Bhupalpalli : వీసా రాలేదని మనస్తాపం.. ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Aug 31 , 2024 | 04:18 AM
విదేశాల్లో ఉన్నతోదోగ్యం చేయాలనే ఆ యువకుడి కల నెరవేరలేదు. వీసా కోసం దరఖాస్తు చేసుకోగా అది రిజెక్ట్ అయింది. ఆ ఆవేదనతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
కాటారం, ఆగస్టు 30: విదేశాల్లో ఉన్నతోదోగ్యం చేయాలనే ఆ యువకుడి కల నెరవేరలేదు. వీసా కోసం దరఖాస్తు చేసుకోగా అది రిజెక్ట్ అయింది. ఆ ఆవేదనతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఈ విషాదం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గంగారం గ్రామానికి చెందిన ముల్కల్ల లక్ష్మయ్య ఇద్దరు సంతానంలో చిన్నవాడైన మహేశ్ (27) బీటెక్ పూర్తిచేసి హైడరాబాద్‌లో రెండేళ్ల పాటు రెండు సంస్థల్లో ఉద్యోగాలు చేశాడు.
మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకొని హైదరాబాద్‌లోనే ఉంటూ కొన్నాళ్లుగా వీసా కోసం ప్రయత్నిస్తూ ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. రాఖీ పండగకు హైదరాబాద్ నుంచి ఇంటికొచ్చాడు. గురువారం తల్లిదండ్రులను బైక్‌పై పొలం వద్ద దింపి ఇంటికొచ్చాడు.
పనులు ముగించుకున్న తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేసరికి మహేశ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. మహేశ్ సెల్‌ఫోన్‌ను పరిశీలించగా వీసా కోసం ఓ కన్సల్టెన్సీకి చెందిన వ్యక్తితో మాట్లాడినట్టుగా ఉంది. వీసా రిజెక్ట్ అయినట్టు వేరే ఫోన్ నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ ఉంది.