Share News

ఆర్టీసీ కండక్టర్‌గా డ్యూటీ చేయలేకపోతున్నా..

ABN , Publish Date - Oct 23 , 2024 | 03:44 AM

ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం చేయడం ఇష్టం లేక విధుల్లో చేరిన 20రోజులకే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం జీఎడవల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

ఆర్టీసీ కండక్టర్‌గా డ్యూటీ చేయలేకపోతున్నా..

  • కోరుకున్న ఉద్యోగం రాలేదని యువకుడి మనస్తాపం

  • విధుల్లో చేరిన 20 రోజులకే ఆత్మహత్య

కనగల్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం చేయడం ఇష్టం లేక విధుల్లో చేరిన 20రోజులకే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం జీఎడవల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ‘ఈ ఉద్యోగం నాకు ఇష్టం లేదు.. నేను డ్యూటీ చేయలేకపోతున్నాను’ అని విధుల్లో చేరినప్పటి నుంచీ ఫోన్‌ చేసి చెప్పేవాడంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని జీఎడవల్లికి చెందిన నీలకంఠం వెంకటేశం ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ 2018లో కంటి చూపు తగ్గిన కారణంగా స్వచ్చంద ఉద్యోగ విరమణ పొందాడు. ఆయన స్థానంలో పెద్ద కుమారుడు నీలకంఠం చక్రవర్తి(25) యాదగిరిగుట్ట డిపోలో ఈనెల 2న కండక్టర్‌గా చేరాడు. డిగ్రీ చదివిన చక్రవర్తికి పెళ్లి కాలేదు.

రెండో కుమారుడు సురేశ్‌ కానిస్టేబుల్‌గా ఎంపికై శిక్షణ పొందుతున్నాడు. తాను కోరుకున్న కానిస్టేబుల్‌ ఉద్యోగం రాకపోవడంతో నిరాశగా ఉన్న చక్రవర్తి తప్పని పరిస్థితుల్లో యాదగిరిగుట్ట డిపోలో కండక్టర్‌గా చేరాడు. సోమవారం ఉదయం 11గంటలకు డ్యూటీని ముగించుకుని ఇంటికొచ్చాడు. మధ్యాహ్నం భోజనం చేసిన చక్రవర్తి ఆధార్‌కార్డు అప్‌డేట్‌ చేయించుకుంటానని తల్లి నాగమణికి చెప్పి బయటికెళ్లాడు. రాత్రి 8 గంటలు దాటినా చక్రవర్తి ఇంటికి రాలేదు. ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అని రావడంతో అనుమానించిన చక్రవర్తి తమ్ముడు సురేశ్‌.. స్నేహితులతో కలిసి ఆచూకీ కోసం గ్రామంలో వెతికాడు. గ్రామ శివారులోని వారి పొలం వద్దే చక్రవర్తి మృతదేహం కనిపించింది. మృతదేహం పక్కన కూల్‌డ్రింక్‌ బాటిల్‌ ఉండటం.. పక్కన వాంతులు చేసుకున్నట్లు ఆనవాళ్లు లభించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు.

Updated Date - Oct 23 , 2024 | 07:02 AM