Share News

Year Ender 2024: జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 75 మంది ఉగ్రవాదులు హతం

ABN , Publish Date - Dec 29 , 2024 | 04:56 PM

Year Ender 2024: ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్‌లో జరిగిన కాల్పుల్లో 75 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. వారిలో 60 శాతం మంది విదేశీయులేనని తెలిపారు.

Year Ender 2024: జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 75 మంది ఉగ్రవాదులు హతం

దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఒకలా ఉంటే.. జమ్మూ కశ్మీర్‌లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయన్న సంగతి అందరికి తెలిసిందే. గతంలో ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 370ని రద్దు చేశారు. కానీ జమ్మూ కశ్మీర్‌లో కాల్పుల మోత మాత్రం ఆగడం లేదు. జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 75 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని ఆర్మీ ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ హతమైన ఉగ్రవాదుల్లో 60 శాతం మంది విదేశీయులని ఆర్మీ అధికారులు వివరించారు.

వీరిలో అత్యధికులు పాకిస్థాన్ వారేనని స్పష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే.. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. ప్రతి ఐదు రోజులకు ఒక ఉగ్రవాదిని భద్రతా బలగాలు అంతం చేశాయని వివరించారు. దేశంలో ఉగ్రవాదాన్నిఎగదోసేందుకు పాకిస్థాన్ ఎంత చేయాలో అంత చేస్తుందన్నారు. అందులోభాగంగా ఈ ఏడాది కేవలం నలుగురు స్థానిక యవకులనే ఉగ్రవాద సంస్థలు నియమించుకున్నాయని సోదాహరణగా వివరించారు.

ఇక మృతి చెందిన ఉగ్రవాదుల్లో.. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ), అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి చొరబాటుకు యత్నించిన 17 మంది ఉగ్రవాదులతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మరో 26 మంది ఉగ్రవాదులను భద్రత సిబ్బంది హతమార్చాయని విశదీకరించారు. ఇక పెరుగుతోన్న ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో భద్రతా బలగాలు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని అభిప్రాయ పడ్డారు.


Jammu.jpg

అలాగే జమ్మూ ప్రాంతంలో ఐదు జిల్లాలు.. జమ్మూ, ఉధంపూర్, కథువా, దోడాతోపాటు రాజౌరిలో 42 మంది ఉగ్రవాదులు మరణించారని .. వారిలో స్థానికేతరులే అధికంగా ఉన్నారని స్పష్టం చేశారు. కశ్మీర్ లోయలోని బారాముల్లా, బందిపొరా, కుప్వారా, కుల్గాం జిల్లాల్లో విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. అదే విధంగా జమ్మూ కశ్మీర్‌లోని తొమ్మిది జిల్లాల్లో విదేశీ ఉగ్రవాదులు ఉనికి ఉన్నా.. బారాముల్లాలో మాత్రం అత్యధిక ఉగ్రవాదుల మరణాలను నమోదు చేసుకుందని గణాంకాలతో సహా ఉన్నతాధికారులు వెల్లడించారు.


kashmir.jpg

తొమ్మిది ఎన్‌కౌంటర్లలో 14 మంది స్థానికేతర ఉగ్రవాదులు హతమయ్యారని.. అలాగే బారాముల్లాలోని చాలా మంది విదేశీ ఉగ్రవాదులు ఉరీ సెక్టార్‌లోని సబురా నాలా ప్రాంతం, మెయిన్ ఉరి సెక్టార్, కమల్‌కోట్ ఉరి నియంత్రణ రేఖ వెంబడి, చక్ తప్పర్ క్రిరి, నౌపోరా, హడిపొర, సాగిపోరా, వాటర్‌గామ్‌తోపాటు రాజ్‌పూర్‌లోని లోతట్టు ప్రాంతాలలో ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు వివరించారు. అయితే జమ్మూ కాశ్మీర్‌లో పని చేస్తున్న స్థానిక ఉగ్రవాదుల ఉనికి గణనీయంగా తగ్గుముఖం పట్టిందన్నారు.


ప్రధానంగా పాకిస్తానీ ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చురుకుగా ఉన్నారని ఈ కాల్పుల ఘటనల ద్వారా స్పష్టమవుతోందని చెప్పారు. అయితే స్థానిక ఉగ్రవాద సంస్థలు మాత్రం దాదాపు తుడిచి పెట్టుకు పోయినాయని సైనిక ఉన్నతాధికారి వెల్లడించారు. ఇక ఈ ఏడాది అంటే.. 2024లో జమ్మూ కాశ్మీర్‌లో 60 ఉగ్ర దాడి ఘటనల్లో 32 మంది పౌరులు, 26 మంది భద్రతా దళాల సిబ్బందితో సహా మొత్తం 122 మంది చనిపోయారని సైనిక ఉన్నతాధికారులు గణాంకాలతో సహా వివరించారు.


ఈ ఏడాది జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. అదీ కూడా ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ఎన్నికలు జరగడంతో.. ఆ రాష్ట్ర ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్పరెన్స్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

మరిన్ని Year Ender - 2024 వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 29 , 2024 | 06:01 PM