ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: లోకేశ్
ABN , Publish Date - Mar 25 , 2025 | 05:05 AM
రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రణాళికను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు. పెట్టుబడుల పెంపుపై దృష్టి పెట్టి, మౌలిక వసతులు, అనుమతులు వేగంగా పరిష్కరించాలన్నారు

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ పునరుద్ఘాటించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటుచేసిన మంత్రుల ఉపసంఘం రెండో సమావేశం సోమవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగింది. మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, పి.నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. పెట్టుబడుల ట్రాకర్ పోర్టల్‌ను సమర్థవంతంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా అధికారులను లోకేశ్ ఆదేశించారు. పెట్టుబడులు పెట్టేవారికి ప్రతిబంధకంగా ఉన్న విధానాలను సంస్కరిస్తామన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిల్లోని అన్ని పెద్ద కంపెనీలను రాష్ర్టానికి ఆహ్వానించాలన్నారు. కంపెనీల కిచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు తగిన సమయంలో ఇవ్వాలన్నారు. భూ కేటాయింపులు, అనుమతులను వేగంగా పరిష్కరించాలన్నారు. ఎంఎ్‌సఎంఈలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామన్నారు. కాగా, ఇప్పటివరకూ కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా రూ. 8,73,220 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా 5,27,824 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు వివరించారు.