AB Venkateswara Rao: ఏబీ వేంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 05 , 2025 | 04:57 PM
విజయవాడలోని గంగూరులో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి, జనవరి 05: కృష్ణా జిల్లా కమ్మవారంటే ఆషామాషీ కాదని రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో అనేక మంది ప్రముఖులకు పుట్టినిల్లుగా ఉందని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్, రామోజీరావు, ఘంటసాల, విశ్వనాథ సత్యనారాయణ, కాకాని వెంకటరత్నం సహా అనేక మంది ప్రముఖులకు ఈ కృష్ణా జిల్లానే పుట్టినిల్లు అని సోదాహరణగా వివరించారు.
విజయవాడలోని గంగూరులో ఆదివారం కమ్మ వారి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా వారిని విమర్శించే వారు.. దమ్ముంటే ఆంధ్రబ్యాంక్‌ను పునరుద్ధరించండంటూ వారికి సవాల్ విసిరారు. అలాగే దమ్ముంటే మరో రామోజీరావును చూపించండంటూ విమర్శకులకు ఏబీ వెంకటేశ్వరరావు సూచించారు.
అయితే గత ఐదేళ్లలో కమ్మ వారిపై బహిరంగ యుద్దం ప్రకటించారన్నారు. ఈ సంక్రాంతిని విమోచన, విముక్తి దినంగా భావించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. గతంలో జరిగిన ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందన్నారు. మన పూర్వీకులు మనకు మంచి మార్గదర్శనం చూపించారని చెప్పారు. వారు చూపిన మంచి లక్షణాలు.. తర్వాతి తరాలు అంది పుచ్చుకోవడాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
ఇక కమ్మ వారి స్థితిగతులు స్థిరంగా లేవన్నారు. కమ్మ వారు మేధో వలసకు గురవుతున్నారన్నారు. దీన్ని భర్తీ చేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఆలోచించాల్సి ఉందన్నారు. కష్టాలు రాగానే కుంగి పోకుండా ఉండే వైనాన్ని పూర్వీకులు మనకు నేర్పించారని.. దీనిని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు. ప్రపంచంలో మనకున్న గుర్తింపును నిలబెట్టుకుని భావి తరాలకు అందివ్వాలన్నారు.
Also Read: చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే
Also Read :సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా.. నిజంగా మీకు పండగలాంటి వార్త
కమ్మ వారి సేవా సమితి ద్వారా చేస్తోన్న సేవలు అభినందనీయమన్నారు. కమ్మ సామాజిక వర్గంలో చాలా మంది పేదరికంలో ఉన్నారని.. ఆయా కుటుంబాలను అన్ని విధాలా సహకరించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వారిని ప్రోత్సహిస్తే.. మన పిల్లల్లో మరో సత్య నాదేళ్ల, ఎన్టీఆర్‌లను చూడవచ్చునని ఏబీ వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా.. మహిళలకు, యువతకు, పిల్లలకు పలు పోటీలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, సృజనా చౌదరితోపాటు జల వనరుల శాఖ సలహాదారు కన్నయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ ముందు ఇంటింటా సందడి నెలకొంటుందన్నారు. విజయవాడలోని కమ్మ సేవా సంఘం ఏర్పాటు చేసి.. పేదవారిని ఆదుకుంటున్నారన్నారని వివరించారు. సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలు చేపడుతూ పేదవారికి ఉపయోగపడుతున్నారని వివరించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదగడం సంతోషకరమని పేర్కొన్నారు.
ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్యనాయుడు మాట్లాడుతూ..
తాను ఎక్కువగా మాట్లాడనన్నారు. కానీ అధికంగా పని చేస్తానని చెప్పారు. అయితే తనకు ఫారిన్ ఆఫర్లు వచ్చినా వాటిని సైతం వదులుకున్నానని తెలిపారు. దేశంలో రైతుల కోసం పని చేస్తున్నానని స్పష్టం చేశారు. అందులోభాగంగా పలు రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల గేట్లు ఏర్పాటు చేస్తూ.. రైతులకు సేవలందిస్తున్నానని వివరించారు. తెలుగు రాష్ట్రంలో నాటి సీఎం ఎన్టీఆర్.. తనకు 1984లో శ్రీశైలం గేట్లు ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చారన్నారు.
అలాగే 2009, అక్టోబర్‌లో శ్రీశైలం డ్యాం ప్రమాదకర పరిస్థితిలో ఉన్న సమయంలో సైతం తాను ధైర్యంగా వెళ్లి డ్యాం గేట్లు ఎత్తి ప్రజలను రక్షించానని గుర్తు చేశారు. ఇక పోలవరం ప్రాజెక్టుకు తొలుత డిజైన్ రూపొందించింది తానేనని వివరించారు. దక్షిణాదిలో ఎక్కడ.. రైతులకు అత్యవసర పరిస్థితి ఏర్పడిన.. వాలంటర్‌గా సేవలందిస్తున్నానన్నారు. అలాగే తుంగభద్రలో గేట్లు కొట్టుకుపోతే వాటిని సైతం విజయవంతంగా అమర్చానని తెలిపారు. ఇటీవల ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లు విరిగి పోతే వేగంగా మరమ్మతులు చేశానని.. ఆ సమయంలో తాము గేట్లు ఏర్పాటు చేయడం వల్లే 40 వేల రైతు కుటుంబాలు సంక్రాంతి చేసుకుంటున్నాయన్నారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లు దెబ్బ తిన్నప్పుడు సీఎం చంద్రబాబు తనకు ఫోన్ చేశారని గుర్తు చేశారు. ఆ వెంటనే వచ్చి వేగంగా గేట్ల మరమ్మతులు చేసి రైతులు నష్ట పోకుండా కాపాడానన్నారు. ఎవరైనా ఆకలితో ఉంటే అన్నం పెట్టకుండా వదల వద్దన్ని సూచించారు. రైతన్నల వల్లే పేదరికం నిర్మూలన అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
రైతులు నీటిని సమర్థంగా వినియోగించుకుని దేశాన్ని, రాష్ట్రాన్ని, సమాజాన్ని ఉద్దరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పూడిక పెరగడం వల్ల డ్యాంలలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోందన్నారు. ఆ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టులో పూడిక తీయడం కష్టతరమన్నారు. గోదావరి నుంచి నీటిని కృష్ణా నదికి మళ్లిస్తే రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని గతంలో భావించినపుడు.. ఆ నిర్ణయం తీసుకోవద్దంటూ కేంద్రానికి లేఖలు రాశానని కన్నయ్యనాయుడు వివరించారు. ఇక పోలవరం డ్యాం సకాలంలో పూర్తి చేసేందుకు ఆర్ అండ్ ఆర్ అడ్డుగా వస్తోందన్నారు. పోలవరం సకాలంలో పూర్తి చేస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ..
సూర్యచంద్రులు ఉన్నంత వరకు కులమతాలు కచ్చితంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఇతర కులాలను ఎవరూ కించ పరచ వద్దని సూచించారు. వారి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. అందరూ కలసి పని చేస్తేనే మనకు రాజ్యాధికారం వస్తుందని స్పష్టం చేశారు. సమర్థత, సామర్థ్యం పెంచుకునేందుకు కమ్మ సేవా సమితి ద్వారా సేవ చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. అందరూ కలసి పని చేస్తేనే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు. ఓ ఇంజినీర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా తాను ఎప్పుడూ కులం చూడనన్నారు.
సామర్థ్యం ఆధారంగా తాను ఉద్యోగులను నియమించి.. ప్రోత్సహించానని గుర్తు చేశారు. ప్రభుత్వాల్లో కమ్మ వారి ప్రాధాన్యత పెంచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజానికి అన్ని కులాలు మతాల వారికి సేవ చేస్తే మనకు మంచి జరుగుతుందన్నారు. రాజ్యాధికారం రావడానికి అందరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని పేర్కొ్న్నారు. కమ్మ వారంతా విశాల దృక్ఫథంతో ముందుకు వెళ్లి సాయం చేస్తే అభివృద్ధిలోకి వెళ్ల వచ్చునని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు.
For AndhraPradesh News And Telugu News