Share News

Velagapudi Pipeline Repair: నాటి నిర్లక్ష్యానికి నేడు మూల్యం!

ABN , Publish Date - Apr 01 , 2025 | 05:10 AM

అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా టీడీపీ హయాంలో నిర్మించిన భూగర్భ పైపులైను నిర్వహణ లేక వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతింది. దీంతో దాన్ని పూర్తిగా తొలగించి, మళ్లీ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది

 Velagapudi Pipeline Repair: నాటి నిర్లక్ష్యానికి నేడు మూల్యం!

  • ‘రాజధాని’ పునర్నిర్మాణంలో సవాళ్లెన్నో..

  • జంగిల్‌ క్లియరెన్స్‌.. నీటి తోడకం పనులకు భారీ వ్యయం

  • దెబ్బతిన్న పైపుల తొలగింపు ప్రక్రియ

  • 9 కి.మీ. మేర తిరిగి పైపులు వేయడానికి రెట్టింపు ఖర్చు

గుంటూరు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి విషయంలో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి ప్రస్తుత ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వమేదైనప్పటికీ చెల్లించే డబ్బు ప్రజాధనం కావడమే ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాజధాని పరిధిలో జంగిల్‌ క్లియరెన్స్‌, సచివాలయ, ఐకానిక్‌ భవనాల వద్ద నీటి తొలగింపు పనులకు కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు పైపులైను తొలగింపు పనులపై కూడా కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపురించింది.

9 కి.మీ మేర దెబ్బతిన్న పైపులు

రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం భూగర్భ పైపులైను నిర్మాణం చేపట్టింది. గడచిన ఐదేళ్లలో వాటిని కూడా వైసీపీ సర్కారు పట్టించుకోకుండా వదిలేయడంతో నిర్వహణ కొరవడి పైపులు దెబ్బతిన్నాయి. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు నుంచి వెలగపూడి, ఐనవోలు వరకూ వేసిన 9 కి.మీ. మేర పైపులైను దెబ్బతింది. అత్యంత కీలకమైన పైపులైను దెబ్బతినడంతో దాన్ని తొలగించి, తిరిగి పైపులైను వేయాల్సిన పరిస్థితి రావడంతో ఖర్చు రెట్టింపయింది. దీనికి సంబంధించి కాంట్రాక్టు తీసుకున్న బీఎస్ఆర్‌ సంస్థ పది రోజులుగా ముమ్మరంగా పనులు నిర్వహిస్తోంది.


వైసీపీ సర్కార్‌ నిర్లక్ష్యం!

2014- 19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణ పనులు చేపట్టింది. దాదాపు 10వేల కోట్ల మేర ఖర్చు చేసి ప్రభుత్వ భవనాలతోపాటు మౌలిక సదుపాయాల కల్పన చేసింది. ఆ క్రమంలోనే రాజధాని పరిధిలో రహదారులు, అంతర్గత పైపులైను పనులు చేపట్టింది. 2019లో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులను పూర్తిగా పక్కనపెట్టేసి, నిర్లక్ష్యంగా వదిలివేసింది. దీంతో రాజధాని మొత్తం అడవిలా మారిపోయింది. ఆ అడవి కంప చెట్లను తొలగించడానికి ప్రభుత్వం అక్షరాల రూ.36.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అమరావతిలో ఐకానిక్‌ టవర్లుగా చెప్పుకుంటున్న సచివాలయ భవన సముదాయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను పట్టించుకోకపోవడంతో వాటి పునాదుల్లో నీరు చేరింది. ఐదేళ్లపాటు 18 అడుగుల లోతు మేర నీటిలో మునిగి ఉన్న నిర్మాణాలు పనికి వస్తాయో.. లేదో తెలుసుకోవడానికి నిపుణుల అధ్యయనాలు, పునాదుల్లో చేరిన నీటిని తొలగించడం కోసం కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అవి రెండూ పూర్తవగానే పైపులైన్ల సమస్య తెరమీదకు వచ్చింది.


Read Latest AP News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 05:10 AM