Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..
ABN , Publish Date - Feb 08 , 2025 | 08:23 PM
అనంతపురం జిల్లా ఉరవకొండలో బెట్టింగ్ యాప్‌ల మోసానికి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలయ్యాడు. అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అనంతపురం: ఆన్ లైన్ మోసాలు (Online Frauds) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఓ పక్కన సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతుంటే.. మరోపక్కన బెట్టింగ్ (Betting Apps) భూతం అమాయకులను బలి తీసుకుంటోంది. వేలల్లో నగదు పెడితే తక్కువ కాలంలోనే లక్షలు వస్తాయంటూ మోసపూరిత ప్రకటనలు ఇస్తూ నిండా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. అందుకు తోడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అనేక బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ ఇన్‌ఫ్లూయెన్సర్లు దర్శనమిస్తున్నారు. పలానా బెట్టింగ్ యాప్‌లో రూ.100 పెడితే గంటల వ్యవధిలో ఇంత వచ్చాయి, అంత వచ్చాయంటూ ఊదరకొడుతున్నారు. అమాయకులను బెట్టింగ్ పెట్టేలా రెచ్చగొడుతున్నారు. అలా బెట్టింగ్‌కు అలవాటై లక్షలు మోసపోవడమే కాకుండా చేసిన అప్పులను కట్టలేక ప్రాణాలు సైతం తీసుకుంటుకున్నారు.
తాజాగా అలాంటి ఘటనే అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్‌ల మోసానికి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలయ్యాడు. అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరవకొండ పట్టణానికి చెందిన కిషోర్ డేటా బెట్టింగ్ యాప్‌లో స్నేహితులతో కలిసి లక్షల రూపాయలు పెట్టాడు. అయితే అందులో మెుత్తం పోగొట్టుకున్నారు. అయితే కిషోర్ స్నేహితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అతనిపై ఒత్తిడి చేశారు. అప్పులు రూ.8 లక్షలకు చేరుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్నేహితులు మోసం చేశారంటూ సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టించి ఇప్పుడు తనను మాత్రమే అప్పులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. చొక్కా మీద, ఆస్పత్రి ఫైళ్ల మీద తన మరణానికి కారణమైన స్నేహితుల పేర్లతో సూసైడ్ నోట్ రాశాడు. కాగా, కిషోర్ ఆత్మహత్య ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సదరు యువకుడు గతంలో సింగపూర్‌లో ఉద్యోగం చేసి స్వదేశానికి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీలో చేరి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. చేతికొచ్చిన కుమారుడు తమను మంచిగా చూసుకుంటాడని నమ్మిన ఆ తల్లిదండ్రులు ఇప్పుడు పుట్టెడు అప్పులతో తీవ్ర దుఖంలో మునిగిపోయారు. ఇప్పటికైనా బెట్టింగ్ భూతాన్ని దేశం నుంచి తరిమికొట్టాలని పలువురు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..