FUNDS FRAUD: స్వాహాపర్వం..!
ABN , Publish Date - Jan 05 , 2025 | 12:11 AM
: ప్రజోపకార్యాలకు ఉపయోగించాల్సిన ప్రభుత్వ నిధులను యథేచ్ఛగా స్వాహా చేశారు. పంచాయతీ ప్రజాప్రతినిధికి కొందరు నాయకులు తోడై ప్రజల సొమ్మును మింగేశారు. స్తానిక పంచాయతీ నిధులు పక్కదారి పట్టిన విషయం బయటికి పొక్కడంతో శనివారం పెనుకొండ డీఎల్‌పీఓ శివనారాయణరెడ్డి విచారణ చేపట్టారు.
కొత్త బోర్లకు పాత మోటార్ల ఏర్పాటు
విచారణలో అక్రమాలు బయటపడేనా?
చిలమత్తూరు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ప్రజోపకార్యాలకు ఉపయోగించాల్సిన ప్రభుత్వ నిధులను యథేచ్ఛగా స్వాహా చేశారు. పంచాయతీ ప్రజాప్రతినిధికి కొందరు నాయకులు తోడై ప్రజల సొమ్మును మింగేశారు. స్తానిక పంచాయతీ నిధులు పక్కదారి పట్టిన విషయం బయటికి పొక్కడంతో శనివారం పెనుకొండ డీఎల్‌పీఓ శివనారాయణరెడ్డి విచారణ చేపట్టారు. పంచాయతీ కార్యాలయానికి చేరుకుని, రికార్డులను పరిశీలించారు.
మరుగుదొడ్ల మాటున మటాష్
మండలకేంద్రం సమీపాన ఓ దేవాలయం వద్ద నిర్మించిన మరుగుదొడ్లకు పంచాయతీ నిధులు డ్రా చేశారు. దేవాలయం వద్ద ఆలయ కమిటీ సొంత డబ్బుతో వాటిని నిర్మించింది. వాటికి పంచాయతీ నిధుల నుంచి రూ.3.5 లక్షలకుపైగా నిధులను డ్రాచేయడం గమనార్హం. మరుగుదొడ్ల పేరుతో డ్రా చేసిన సొమ్ము అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి ఖాతాలోకి జమకావడం విశేషం.
కొత్త బోర్లకు.. పాత మోటార్లు..
కొత్తగా బోరుబావులు తవ్వించి, వాటికి పాత మోటారు, పంపుసెట్లు ఏర్పాటుచేసి రూ.లక్షల్లో నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. రూ.మూడు లక్షల వ్యయంతో పూర్తయ్యే బోరుబావికి ఏకంగా రూ.6.5 లక్షల వరకు నిధులను డ్రా చేయడం గమనార్హం. క్షేత్రస్థాయిలో బోరుబావులను పరిశీలిస్తే పాతమోటార్లు బయటపడతాయని ప్రజలు చెప్పుకుంటున్నారు. పాత పైపులు ఏర్పాటుచేసి, కొత్తవాటిని కొనుగోలు చేసినట్లు బిల్లులు స్వాహా చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఇటు ప్రజాప్రతినిధి, అటు అధికార పార్టీకి చెందినవారు ఉండటంతో విచారణ సజావుగా సాగేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ క్షేత్రస్థాయిలో జరిగితేనే అక్రమాలు బయటపడతాయన్న వాదలను వినిపిస్తున్నాయి.