Andhra Govt : నాడు అపహాస్యం.. నేడు చట్టబద్ధం!
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:14 AM
ఇంతలో ఎంత మార్పు! నాడు వైసీపీ సర్కారు ముడుపుల బాగోతంతో టీచర్ల బదిలీలను అపహాస్యం చేస్తే... నేడు కూటమి ప్రభుత్వం బదిలీల కోసం ఏకంగా చట్టమే తీసుకొచ్చింది.

వైసీపీ హయాంలో అడ్డగోలుగా టీచర్ల బదిలీలు
సిఫారసులతో వందలాది మందికి స్థానచలనం.. ఒక్కో బదిలీకి రూ.లక్షల్లో ముడుపుల వసూలు
ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టంతో గందరగోళానికి కూటమి సర్కారు చెక్
ఇకపై ఏటా వేసవిలోనే బదిలీల ప్రక్రియ.. టీచర్లకు ఐదేళ్లు దాటితే తప్పనిసరి బదిలీ
నాలుగు కేటగిరీల్లో ప్రాధాన్యతా పాయింట్లు ..
సంవత్సరంలో ఒకసారే సాధారణ బదిలీలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఇంతలో ఎంత మార్పు! నాడు వైసీపీ సర్కారు ముడుపుల బాగోతంతో టీచర్ల బదిలీలను అపహాస్యం చేస్తే... నేడు కూటమి ప్రభుత్వం బదిలీల కోసం ఏకంగా చట్టమే తీసుకొచ్చింది. ‘ఈ సంవత్సరం బదిలీలు ఉంటాయా? ఉండవా?’ అంటూ ప్రతీ ఏటా టీచర్లు ఆందోళన చెందాల్సిన పరిస్థితి అప్పట్లో ఉండేది. ఇప్పుడు ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా వివాదరహితంగా బదిలీల ప్రక్రియను నిర్వహించనున్నారు. దీనివల్ల విద్యా సంవత్సరంపై ప్రతికూల ప్రభావం కూడా ఉండదని ప్రభుత్వం పేర్కొంటోంది.
ముడుపులు ఇచ్చుకో.. బదిలీలు పుచ్చుకో..
పిల్లల చదువులు ఏమైతే మాకేంటి అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. ముడుపులు ఇచ్చుకో.. బదిలీలు పుచ్చుకో అన్నట్లుగా టీచర్ల సిఫారసు బదిలీలకు తలుపులు బార్లా తెరిచింది. విద్యా సంవత్సరం చివరిలో టీచర్లను మారిస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. బదిలీలపై నిషేధం ఉన్న సమయంలోనూ సీఎం కార్యాలయం నుంచి సిఫారసుల పేరుతో వందల మందిని అడ్డగోలుగా బదిలీ చేసింది. పెద్దల సిఫారసులు అటుంచితే చివరికి గ్రామ సర్పంచ్ సిఫారసు లేఖ ఇచ్చినా అందుకు అనుగుణంగా టీచర్ల బదిలీలు చేశారు. ఎన్నికలకు కొంతకాలం ముందు నుంచి రిక్వెస్ట్ బదిలీల పేరుతో పలు దఫాలుగా బదిలీ ప్రక్రియను నడిపించింది. అప్పట్లో జరిగిన అక్రమ బదిలీల వ్యవహారంలో అనేకమంది ప్రమేయం ఉంది. తొలుత సీఎంవో పేరుతో సిఫారసు బదిలీల జాబితా పంపగా, అనంతరం ఆ జాబితాలో ఉన్నవారు బొత్స పేషీ చుట్టూ తిరిగారు.
పేషీలోని కొందరు అధికారుల ద్వారా ముడుపులు సమర్పించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు పాఠశాల విద్యాశాఖలో కొందరు అధికారులు ‘మాకేంటి?’ అంటూ చక్రం తిప్పారు. అంతా కలసి అందినకాడికి దండుకొన్నారు. ఒక్కో బదిలీకి రూ.3లక్షల నుంచి రూ.4లక్షల చొప్పున రూ.50కోట్లకు పైగా వసూలు చేశారని ఆరోపణలున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందే సగం మందికి పైగా టీచర్లు బదిలీ అయిన పాఠశాలల్లో చేరిపోయారు. ఇక బదిలీ ఉత్తర్వులు అందినా, కోడ్ కారణంగా 917 మంది టీచర్లు పాత స్థానాల్లోనే కొనసాగారు. ప్రభుత్వం మారిన తర్వాత వారి బదిలీల ఫైలును సీఎం చంద్రబాబుకు పంపగా, ఆయన దాన్ని తిరస్కరించడంతో అవి ఆగిపోయాయి. దీంతో అప్పటికే ముడుపులు సమర్పించుకున్న టీచర్లు లబోదిబోమన్నారు.
చట్టంలోని కీలక అంశాలివీ..
ఉపాధ్యాయుల బదిలీల్లో గందరగోళానికి ముగింపు పలకడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిర్దేశిత సమయంలో వివాదరహితంగా బదిలీలు జరగాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చింది. దీనికి ‘ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీ నియంత్రణ చట్టం-2025’ అని పేరు పెట్టింది. దీని ప్రకారం... బదిలీలకు విద్యా సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఒకేచోట ఐదేళ్ల సర్వీసు దాటిన హెచ్‌ఎంలకు, 8ఏళ్లు దాటిన టీచర్లకు బదిలీ తప్పనిసరి. ఒక పాఠశాలలో కనీసం రెండేళ్లు పనిచేస్తే బదిలీలకు అర్హుల జాబితాలోకి వస్తారు. బదిలీలకు ప్రాంతాల వారీగా నాలుగు కేటగిరీలు ఉంటాయి. కేటగిరీ-1లో జిల్లా కేంద్రాలు, నగర కార్పొరేషన్, ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాలు, కేటగిరీ-2లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కేటగిరీ-3లో మండల కేంద్రాలు, రోడ్డు సదుపాయం కలిగిన గ్రామాలు, కేటగిరీ-4లో రోడ్డు సదుపాయం లేని గ్రామాలు, కొండ ప్రాంతాలు ఉంటాయి. టీచర్ల మొదటి నియామకం లేదా హెచ్‌ఎంగా పదోన్నతి పొందిన తర్వాత మొదటి పోస్టింగ్‌ను 3, 4 కేటగిరీ ప్రాంతాల్లో ఇస్తారు. బదిలీల సమయానికి రెండేళ్లలోపు మాత్రమే సర్వీసు ఉన్నవారిని కోరుకుంటేనే బదిలీ చేస్తారు.
50ఏళ్ల కంటే తక్కువ వయసున్న హెచ్‌ఎంలు, టీచర్లు బాలికల ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తుంటే తప్పనిసరిగా బదిలీ చేస్తారు. బాలికల ఉన్నత పాఠశాలలకు మహిళా హెచ్‌ఎంలు, టీచర్లను నియమిస్తారు. వారు అందుబాటులో లేకపోతే 50ఏళ్లు దాటిన పురుష టీచర్లను నియమిస్తారు. లైంగిక నేరాలు, బాలికల అంశాల్లో ఆరోపణలున్న పురుష టీచర్లకు బాలిక ఉన్నత పాఠశాలల్లో పోస్టింగ్ ఇవ్వరు. హెచ్‌ఎంలు, టీచర్లపై నమోదైన అభియోగాలు పెండింగ్‌లో ఉంటే బదిలీలకు పరిగణలోకి తీసుకోరు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీల ప్రక్రియను నిర్వహిస్తారు. అలాగే ప్రస్తుత పాఠశాల ప్రామాణికంగా కేటగిరీ-1లో ఉన్న టీచర్లకు ఏడాదికి ఒక పాయింట్, కేటగిరీ-2లో ఉన్నవారికి 2 పాయింట్లు, కేటగిరీ-3లో ఉన్నవారికి 3 పాయింట్లు, కేటగిరీ-4లో ఉన్నవారికి ఏడాదికి 5 పాయింట్లు ఇస్తారు.బదిలీలు జరిగే సంవత్సరం మే 31 నాటికి అన్ని కేడర్లలో కలిపి సర్వీసులోని ప్రతి సంవత్సరానికి ఒక పాయింట్ ఇస్తారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారి జీవిత భాగస్వామి అయిన టీచర్లకు ప్రత్యేక పాయిట్లు లభిస్తాయి. 40ఏళ్లు దాటిన అవివాహిత మహిళా టీచర్లు, దివ్యాంగులు, గుర్తించిన వ్యాధులు కలిగినవారు, వితంతువులు, ఒంటరి మహిళలు, మాజీ సైనికుల జీవిత భాగస్వాములు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌గా పనిచేస్తున్న వారికీ ప్రత్యేక పాయింట్లు ఉంటాయి. టీచర్ల పనితీరు ఆధారంగా కూడా పాయింట్లు కేటాయిస్తారు. సెక్షన్-7 ప్రకారం సంవత్సరంలో ఒకసారి మాత్రమే సాధారణ బదిలీలు చేస్తారు. ఏటా బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమందికి సమానమైన పాయింట్లు వస్తే కేడర్‌లో సీనియారిటీ, పుట్టిన తేదీ, మహిళలను ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటారు.
నాడు బొత్స సమర్థన
‘‘సిఫారసు బదిలీ చేస్తే తప్పేంటి? ఎమ్మెల్యేలుగా ఉండి టీచర్ల బదిలీలు కూడా చేసుకోకూడదా? ఆ మాత్రం బదిలీలు కూడా చేసుకోలేకపోతే ఇక ప్రభుత్వం ఎందుకు? సిఫారసు బదిలీలు చాలా తక్కువే. దీని గురించి రాద్ధాంతం అక్కర్లేదు’’ అని నాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
నేడు లోకేశ్ మాట
‘‘గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా, ఇష్టారాజ్యంగా టీచర్లను అక్రమంగా బదిలీ చేశారు. ఎన్నికల సమయంలో బదిలీలపై నిషేధం ఉన్నా 1,100 మందిని బదిలీ చేశారు. దీనిపై అనేక న్యాయ వివాదాలు ఉత్పన్నమయ్యాయి. అందుకే ఇకపై ఎవరి జోక్యం ఉండకూడదని, టీచర్ల బదిలీలకు ప్రత్యేకంగా చట్టం తీసుకొస్తున్నాం’’ అని టీచర్ల బదిలీల చట్టంపై అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంలో మంత్రి నారా లోకేశ్ అన్నారు.