GST Fraud : జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాలకు చెక్
ABN , Publish Date - Jan 01 , 2025 | 05:46 AM
జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
నేటి నుంచి రిజిస్ట్రేషన్లకు బయోమెట్రిక్ ఫేస్ అథంటికేషన్
అమరావతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో అనేక వాణిజ్య సంస్థలు, వ్యాపారులు నకిలీ ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలతో ఆన్‌లైన్‌లోనే జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఆ జీఎస్టీ నంబరుతో కొంతకాలం సక్రమంగా పన్ను చెల్లించడం... ఆ తర్వాత నుంచి నకిలీ వ్యాపారాలతో బురిడీ కొట్టిస్తూ ప్రభుత్వానికి రూ.కోట్లలో పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఉదంతాలు అధికారుల తనిఖీల్లో కోకొల్లులుగా వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)తో దుర్వినియోగాలకూ పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ దశలోనే అక్రమార్కులను గుర్తించేందుకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్‌వర్క్ (జీఎ్‌సటీఎన్) సహకారంతో బయోమెట్రిక్ ఫేస్ అథంటికేషన్ విధానాన్ని బుధవారం నుంచి అమలులోకి తీసుకువస్తోంది. నకిలీ ఆధార్ కార్డులు, పత్రాలను గుర్తించేందుకు ఈ టెక్నాలజీ తోడ్పడుతుందని వాణిజ్య పన్నులశాఖ చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు వివరించారు. రాష్ట్రంలోని 12 జీఎస్టీ సేవా కేంద్రాల్లో పన్ను చెల్లింపుదారుల వేలిముద్రలు లేదా ఐరిస్ స్కానర్‌ను ఉపయోగించి బయోమెట్రిక్ ప్రామాణికతను పరిశీలిస్తారు. పన్ను చెల్లింపుదారులకు మరింత సులువుగా ఉండేలా ఆండ్రాయిడ్ డివైజ్ (సెల్‌ఫోన్లు లేదా ట్యాబ్‌లు)లకు అనుసంధానించేందుకు వీలుగా జీఎ్‌సటీఎన్ ప్రత్యేక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఇక మీదట జీఎస్టీ కేంద్రాల్లో ఇతర పరికరాలతో పనిలేకుండా ఈ కొత్త యాప్ ద్వారానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. కాగా, జీఎస్టీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి బయోమెట్రిక్ పరిశీలన ప్రక్రియను గతంలో మూడు దశలుగా నిర్వహించేవారు. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ వెరిఫికేషన్ విధానంలో రెండు దశల్లోనే పూర్తి చేయనున్నారు. దరఖాస్తుదారుల బయోమెట్రిక్ వివరాలన్నీ ఫేస్ అథంటికేషన్ విధానం ద్వారా పరిశీలిస్తారు.