Share News

AP Chandrababu : పోలవరం ముంపుపై అధ్యయనం

ABN , Publish Date - Jan 05 , 2025 | 06:12 AM

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో తెలంగాణలో ఏర్పడే ముంపుపై ఐఐటీ హైదరాబాద్‌తో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

AP Chandrababu : పోలవరం ముంపుపై అధ్యయనం

  • నెల రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి

  • గోదావరి-బనకచర్ల అనుసంధానంపై..

  • అభ్యంతరాలను ఏపీ సీఎస్‌ దృషికి తీసుకెళ్లాలి

  • అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో తెలంగాణలో ఏర్పడే ముంపుపై ఐఐటీ హైదరాబాద్‌తో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో సమగ్ర నివేదికను సిద్ధం చేయాలన్నారు. ఐఐటీ హైదరాబాద్‌తో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్దేశించారు. శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌, కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్‌సీ (జనరల్‌) జి.అనిల్‌కుమార్‌తో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయించాలన్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ఠ నీటిమట్టం దాకా నీటిని నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలోని ముర్రేడువాగు, కిన్నెరసాని నదులతో పడే ప్రభావంపై సర్వే చేసి, ముంపు ప్రాంతాలను గుర్తించడానికి ఆంధ్ర ముందుకొచ్చిందని అధికారులు సీఎంకు నివేదించారు. పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ ఉంటే.. కిన్నెరసాని, ముర్రేడువాగు నదుల నీరు గోదావరిలోకి సాఫీగా ప్రవహించదని, దీంతో ఈ వరద పంట పొలాలను ముంచెత్తుతుందని పేర్కొన్నారు. దీనిపై సర్వే చేసి చర్యలు తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు ఇచ్చిందని, ఆ ఆదేశాలకు అనుగుణంగా నాలుగుసార్లు కేంద్ర జలవనరుల సంఘం సాంకేతిక కమిటీ సమావేశమయిందని వివరించారు.


పోలవరం బ్యాక్‌వాటర్‌తో 954 ఎకరాలు ముం పునకు గురవుతాయని, అంతేకాకుండా భద్రాచలం ఆలయంతోపాటు మణుగూరు హెవీ వాటర్‌ ప్లాంట్‌పై ప్రభావం పడే అవకాశాలున్నాయని అధికారులు సీఎంకు గుర్తు చేశారు. 1986లో గోదావరికి 27 లక్షల క్యూసెక్కుల వరద వస్తే.. భద్రాచలం వద్ద 76.5 అడుగుల ఎత్తుతో నది ప్రవహించిందని, అదే 2022 ఆగస్టులో 24.50 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. 71 అడుగుల ఎత్తుతో గోదావరి ప్రవహించిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 2022లో వచ్చిన వరదతో ఏకంగా 106 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, 16 వేల ఇళ్లు నీట మునిగాయని వివరించారు. 1986లో వచ్చిన వరద కన్నా 2022 ఆగస్టు వరద తక్కువే ఉన్నప్పటికీ ముంపు అధికంగా ఉందని గుర్తు చేశారు. దాంతో సమగ్ర అధ్యయనం కోసం ఐఐటీ హైదరాబాద్‌తో సర్వే చేసి, ఒక అభిప్రాయానికి రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల అనుసంధానాన్ని కూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వరద జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించిందని, దీనికి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. అనుమతుల కోసం ఇటీవలే కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించిందని చెప్పారు. దీంతో ఈ విషయంలో అభ్యంతరాలు ఏమున్నా ఏపీ సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం అన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే.. వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేయాలన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 06:12 AM