Share News

Pawan Kalyan: భవిష్యత్తులో ఏపీలో రాబోయే మార్పులు చెప్పిన పవన్

ABN , Publish Date - Feb 28 , 2025 | 06:08 PM

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కీలక మార్పులు ఉంటాయని పేర్కొన్నారు.

Pawan Kalyan: భవిష్యత్తులో ఏపీలో  రాబోయే మార్పులు చెప్పిన పవన్
Dy CM Pawan Kalyan

అమరావతి, ఫిబ్రవరి 28: 2025-26 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతిలో స్వయంగా స్పందించారు. ఈ బడ్జెట్ సంక్షేమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా కేటాయింపులు ఉన్నాయని తెలిపారు.

గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గించే చర్యలు చేపట్టిందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా.. అభివృద్ధికి బాటలు వేసేదిగా ఈ బడ్జెట్ ఉందని ఆయన అభివర్ణించారు.


ప్రాధాన్యతల వారీగా అన్ని శాఖలకు కేటాయింపులు పెరగడంతో పాటు.. మూల ధన వ్యయాన్ని రూ.40,636 కోట్లకు పెంచడం ద్వారా మౌలిక వసతులు రాష్ట్రంలో పెరుగుతాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్ర రాబడి పెంపుదలకు బాటలు వేసినట్లు అయిందన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, శాఖలకు తగిన కేటాయింపులు, సంక్షేమ ఫలాలపై తగిన దూరదృష్టితో ముందుకు వెళ్తున్న సీఎం చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Train Journey: మీరు ప్రయాణిస్తున్న రైలులో ఛార్జింగ్ సాకెట్ పనిచేయడం లేదా.. ఇలా చేస్తే క్షణాల్లో ..


అలాగే సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపొందించిన ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తోపాటు రైతాంగానికి మేలు చేసే బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి ఆయన అభినందనలు తెలిపారు. ఇక ఈ బడ్జెట్ కూర్పులో ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ శాఖల అధికారులకు సైతం ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు చెప్పారు.

Also Read: శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలంటూ విద్యార్థులకు పిలుపు


గతేడాది మే, జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అయితే గత ఎన్ని్కల వేళ.. తాము అధికారంలోకి వస్తే.. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో 2019 నాటి ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రజా సంక్షేమం పేరిట బటన్లు నొక్కడం ప్రారంభించింది.

Also Read: Fact Check : రూ.3 వేలకే ఎలక్ట్రిక్ సైకిల్.. కొందామనుకొంటున్నారా


అందుకోసం కేంద్రం నుంచి భారీగా అప్పులు తీసుకు వచ్చింది. దీంతో సంక్షేమం పేరిట ప్రజల ఖాతాల్లో నగదు వేయడం తప్పించి.. రాష్ట్రాభివృద్ధిని మాత్రం పట్టించుకొన్న పాపాన పోలేదు. దీంతో రాష్ట్రంలోని అన్ని రహదారుల పరిస్థితి దాదాపుగా పూర్తి అధ్వాన్నంగా మారాయి. ఇటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో కూటమికి ఓటరు పట్టం కట్టాడు. అదీకాక కూటమిలో బీజేపీ సైతం ఉంది.


ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కార్.. రాష్ట్రాభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. ఆ క్రమంలో రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ను సైతం పూర్తి చేసేందుకు వడి వడిగా అడుగుల వేస్తోంది. మరోవైపు చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం .. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలు తీసుకు వచ్చింది.. వస్తోంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సైతం ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 06:19 PM