Tirupati Stampede: ఆసుపత్రిలో పరామర్శ.. జగన్ గుట్టు విప్పిన మంత్రి ఆనం
ABN , Publish Date - Jan 10 , 2025 | 07:28 PM
Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట జరిగి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యవహరించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని తిట్టాలంటూ వారందరికి నగదు కవర్లు అందజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి, జనవరి 10: తిరుపతిలో తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న భక్తులను పరామర్శించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలిపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తిరుపతిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పరామర్శకు ముందు ఆసుపత్రిలో బాధితులకు నగదు కవర్లు ఇచ్చి.. సీఎం చంద్రబాబును తిట్టాలని చెప్పారని మండిపడ్డారు. క్షతగాత్రులకు నగదు కవర్లు ఇస్తున్న దృశ్యాలు.. ఆసుపత్రిలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని చెప్పారు.
పరామర్శ పేరుతో వైఎస్ జగన్ దుష్టచతుష్టయ యాత్ర చేశారని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ని భ్రష్టు పట్టించిన ఆ నలుగురే.. గురువారం వైఎస్ జగన్ వెంట ఉన్నారని గుర్తు చేశారు. జగన్ వెంట ఉన్న దుష్టచతుష్టయంలో ఒకరు... ఆయన కంటే ముందే ఆసుపత్రిలోకి వెళ్లారని తెలిపారు. ఆసుపత్రిలో బాధితులకు నగదు కవర్లు ఇచ్చి.. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాలని వారికి సూచించారన్నారు.
పరామర్శకు వెళ్లి.. ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేయాలంటూ నగదు కవర్లు ఇచ్చి వస్తారా? అంటూ వైసీపీ అగ్రనేతలను ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. నగదు కవర్లు ఇచ్చి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పడం.. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది సైతం గుర్తించారని మంత్రి ఆనం వెల్లడించారు.
Also Read: మృతుల ఇంటికి పాలక మండలి సభ్యులు..
ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని ఈ సందర్భంగా మంత్రి ఆనం గుర్తు చేశారు. అలాగే వారికి వైకుంఠ ఏకాదశి రోజు.. దైవదర్శనం కల్పించాలని తమకు సూచించారన్నారు. ఇక తన అభిమానులు నినాదాలు చేస్తుంటే.. డిప్యూటీ సీఎం పవన్ ఎంతో సంస్కారవంతంగా వారిని కంట్రోల్ చేశారని వివరించారు.
Also Read: బ్రాండ్ ఏపీ ముందుకెళ్తోంది
కానీ వైఎస్ జగన్‌తోపాటు వందల మందితో ఐసీయూలోకి వెళ్లారని తెలిపారు. బాధితులకు అందిస్తున్న సెలైన్ బాటిళ్లనూ సైతం లాగేశారని విమర్శించారు. బాధితులను పరామర్శించాలని వైఎస్ జగన్ ఆసుపత్రికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వలాభం కోసం రాజకీయం చేయాలనే వచ్చారంటు వైఎస్ జగన్‌పై మంత్రి ఆనం నిప్పులు చెరిగారు.
Also Read: జగనన్న కాలనీల పేరు మార్చిన ప్రభుత్వం
వైసీపీ కార్యకర్తలను సైతం జగన్ నిలువరించలేదన్నారు. ఇంకా నినాదాలు చేయాలన్నట్లు వారిని వైఎస్ జగన్ ప్రోత్సహించాడని పేర్కొన్నారు. కష్టంలో ఉన్న వారిని ఓదార్చడానికి అతడు రాలేదని.. వైసీపీ కార్యకర్తలను ఉసిగొల్పాడంటూ జగన్‌పై మండి పడ్డారు. జగన్ వచ్చే సరికి ఆస్పత్రిలో 18 మంది బాధితులు ఉన్నారని.. వారికి తెల్ల కవర్లు పంచారని తెలిపారు. వైఎస్ జగన్‌కు ఇంకా అధికార దాహం తీరలేదని విమర్శించారు.
Also Read: అంతరిక్షంలో త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మాణానికి చైనా అడుగులు
రాజకీయాలకు వైఎస్ జగన్ అనర్హుడని ప్రకటించారు. వైఎస్ జగన్ గురించి బొత్సకు ఇంకా అవగాహన వచ్చినట్లు లేదని మంత్రి ఆనం వ్యంగ్యంగా అన్నారు. అసలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ మాజీ మంత్రి బొత్సకి ఆయన సూచించారు. అయినా.. బొత్స ఇంత దిగజారి మాట్లాడుతారని అనుకోలేదన్నారు. దేవాదాయ శాఖను పటిష్టం చేయాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమని మంత్రి ఆనం స్పష్టం చేశారు.
Also Read: గత ప్రభుత్వం.. ప్రభుత్వ డెయిరీలను చంపేసింది
మరోవైపు తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందడం.. దాదాపు 40 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై జ్యూడిషియల్ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇదే ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజలను క్షమాపణలు కొరారు. అలాగే టీటీడీ చైర్మన్, ఈవో వైఫల్యం ఉందని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో వారిద్దరు సైతం క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అయితే సీఎం చంద్రబాబు సూచనల మేరకు తిరుమలలో శుక్రవారం టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశమైంది.
Also Read: టీటీడీ చైర్మన్, ఈవోలపై పవన్ కల్యాణ్ ఫైర్
15 మంది సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల నష్ట పరిహరం కింద చెల్లిస్తామన్నారు. అందుకు సంబంధించిన చెక్కును పాలక మండలి సభ్యులు.. స్వయంగా మృతులు కుటుంబాలకు వెళ్లి అందజేస్తాయని ప్రకటించారు. ఇక ఈ ఘటనపై క్షమాపణలు చెప్పడంలో ఏ మాత్రం తప్పు లేదన్నారు. కానీ క్షమించమని అడగడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ప్రశ్నించారు.
For AndhraPradesh News And Telugu News