AP Government : మోక్షితకు కొండంత అండ!
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:13 AM
మండే ఎండలో.. చెట్టు నీడలో రిక్షాపై కూర్చొని ఓ పక్క చదువుకుంటూనే.. మరోపక్క పండ్లు అమ్ముతున్న విద్యార్థిని మోక్షిత దీనగాథపై ప్రభుత్వం స్పందించింది.

విద్యార్థినికి స్కాలర్‌షిప్, కేజీబీవీలో సీటు
స్పందించిన డీఈవో, ఐసీపీఎస్ అధికారులు
సొంతింటి నిర్మాణానికి ఎమ్మెల్యేతో మాట్లాడతానన్న సీఐ
చిత్తూరు అర్బన్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): మండే ఎండలో.. చెట్టు నీడలో రిక్షాపై కూర్చొని ఓ పక్క చదువుకుంటూనే.. మరోపక్క పండ్లు అమ్ముతున్న విద్యార్థిని మోక్షిత దీనగాథపై ప్రభుత్వం స్పందించింది. ‘అమ్మా.. నాన్నలు లేక.. అక్షరమే ఆలంబనగా’ అనే కథనం ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన రెండో పట్టణ సీఐ నెట్టికంఠయ్య ప్రభుత్వపరంగా లేదా వ్యక్తిగతంగా వారికి ఏం అవసరమో తెలుసుకోవడానికి విద్యార్థిని మోక్షిత అవ్వాతాతలతో మాట్లాడారు. సొంత ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యేతో తానే వెళ్లి మాట్లాడతానని సీఐ తెలిపారు. అనంతరం డీఈవో వరలక్ష్మి దృష్టికీ మోక్షిత విషయాన్ని తీసుకెళ్లారు. స్పందించిన విద్యాశాఖ అధికారులు ఆమెకు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవీ)లో సీటు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అలాగే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఐసీపీఎస్) ఆధ్వర్యంలో డీసీపీవో సుబ్రహ్మణ్యం, సోషల్ వర్కర్ మురళి తదితరులు మోక్షిత అవ్వాతాతలు పండ్లు అమ్ముతున్న చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు ఆదివారం వెళ్లి వివరాలను తెలుసుకున్నారు. మోక్షితకు మిషన్ వాత్సల్య పథకం కింద నెలకు రూ.4500 స్కాలర్‌షిప్ ఇస్తామని తెలిపారు.