Share News

AP Government : అసైన్డ్‌ భూములపై ఉపసంఘం!

ABN , Publish Date - Feb 20 , 2025 | 04:22 AM

రాష్ట్రంలో అసైన్డ్‌ భూముల ఫ్రీ హోల్డ్‌పై నిర్దిష్టమైన విధానం అనుసరించేందుకు మరోసారి అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

AP Government : అసైన్డ్‌ భూములపై ఉపసంఘం!

నిషేధిత జాబితా నుంచి ప్రైవేటు భూములకు విముక్తి

ఫ్రీ హోల్డ్‌పై మరోసారి సర్కారు అధ్యయనం

రాష్ట్రంలో అసైన్డ్‌ భూముల ఫ్రీ హోల్డ్‌పై నిర్దిష్టమైన విధానం అనుసరించేందుకు మరోసారి అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అసైన్డ్‌ భూముల చట్టసవరణ, 20 ఏళ్ల కాలపరిమితి దాటాక జీవో 596 ప్రకారం ఇచ్చే ఫ్రీ హోల్డ్‌, తదితర అంశాలపై తదుపరి ఏం చేయాలన్న దానిపై ఉపసంఘంతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఫ్రీ హోల్డ్‌ అయిన అసైన్డ్‌ భూములను నిషేధిత జాబితా 22(ఏ) నుంచి తొలగించడం, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుదఫాలుగా ఈ నిషేధాన్ని కొనసాగిస్తోంది. దీనివల్ల చిన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే నిషేధం తొలగించాలని కోరుతున్నారు. చట్టప్రకారం 20 ఏళ్ల కాలపరిమితి దాటిన చిన్న కమతాల అసైన్డ్‌ భూములను ఫ్రీ హోల్డ్‌ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్‌లకు వెసులుబాటు కల్పించాలన్న డిమాండ్లు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేక నిషేధాన్ని కొనసాగిస్తోంది.

ప్రైవేటు భూములకు విముక్తి!

గత జగన్‌ సర్కారు రాజకీయ కక్ష, ఇతర కారణాలతో నిషేధిత జాబితా లో చేర్చిన ప్రైవేటు భూములకు స్వేచ్ఛ కల్పించాలని కూటమి ప్రభు త్వం నిర్ణయించింది. అభ్యంతరం లేని ప్రైవేటు భూములను 22(ఏ) జాబి తా నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రజలు, రైతుల నుంచి వచ్చిన విన్నపాల ఆధారంగా ఒక్కో కేసును పరిశీలించి ప్రైవేటు భూములు, నివాస స్థలాలను 22(ఏ) నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి.సిసోడియా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

Updated Date - Feb 20 , 2025 | 04:22 AM