AP Govt : కేంద్ర బడ్జెట్‌లో మనకెంత?
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:22 AM
కేంద్రం శనివారం ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్‌లో.. మన రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజనాలు లభిస్తాయో వివరాలు తెలియజేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ ప్రభుత్వ..

ఏ శాఖకు ఎన్ని నిధులొస్తాయి?
నేటి మధ్యాహ్నంకల్లా వివరాలివ్వాలి
ప్రభుత్వ విభాగాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్దేశం
అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): కేంద్రం శనివారం ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్‌లో.. మన రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజనాలు లభిస్తాయో వివరాలు తెలియజేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ ప్రభుత్వ శాఖలను ఆదేశించింది. సదరు బడ్జెట్‌లో ఏ శాఖకు ఎన్ని నిధుల వచ్చే అవకాశం ఉందో శనివారం మధ్యాహ్నం 3 గంటలకల్లా తమకు సమాచారమివ్వాలని ఉత్తర్వులిచ్చింది. సంబంధిత వివరాలను సీఎం చంద్రబాబుకు అందజేయాలని స్పష్టం చేసింది. బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం లభిస్తుందని రాష్ట్రప్రభుత్వం ఆశిస్తోంది. నదుల అనుసంధానం, టెక్ట్స్‌టైల్స్ పార్కుల ఏర్పాటుకు తోడ్పాటు లభిస్తుందని అంచనా వేస్తోంది. డిసెంబరు 20వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో బడ్జెట్ సన్నాహక సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్రానికి కొన్ని సాయాలను అభ్యర్థించారు. ‘రాజస్థాన్‌లో నదుల అనుసంధానించడానికి సాయం ప్రకటించినట్లే ఆంధ్రలోనూ నదుల అనుసంధానానికి సాయం చేయండి. 2024-25 బడ్జెట్‌లో బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడానికి కేంద్రం పూర్వోదయ ప్రాజెక్టును ప్రకటించింది. కోస్తాంధ్ర తుఫాన్లతో, రాయలసీమ ప్రాంతం కరువుతో అల్లాడుతుంటాయి. రాష్ట్రవిభజన వల్ల కూడా మాకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో పూర్వోదయ ప్రాజెక్టులో ఉన్న ఏపీకి కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటిలో 90 శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలి. రోడ్లు, రేవులు, విమానాశ్రయాల నిర్మాణానికి సాయం చేయాలి. పీపీపీ ప్రాజెక్టులన్నింటికీ వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) భరించాలి.
విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రమే వీజీఎఫ్ భరించాలి. కరువుతో ఎడారిలా మారిపోతున్న జిల్లాలకు జల్‌జీవన్ మిషన్, ఇతర ఇరిగేషన్ పథకాల ద్వారా కేంద్రం 90 శాతం, రాష్ట్ర 10 శాతం నిష్పత్తిలో నిధులు అందించాలి. ఏఐ, ఏవియేషన్ యూనివర్సిటీ, పునరుత్పాదక శక్తి వనరులపై పరిశోధనలు చేసే విశ్వవిద్యాలయాలకు ఒక్కొక్క ప్రాజెక్టుకు రూ.100 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలి. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ మంజూరు చేయాలి. చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున రాష్ట్రానికి 5 టెక్ట్స్‌టైల్ పార్కులను మంజూరు చేయాలి’ అని కోరారు.
For AndhraPradesh News And Telugu News