AP Mining Barites Scam : ఓఎన్‌జీసీకి టోకరా
ABN , Publish Date - Jan 07 , 2025 | 03:34 AM
జగన్ ప్రభుత్వంలో బెరైటీస్ సిండికేట్ వ్యాపారులు అడ్డగోలుగా దోచుకున్నారు. కొందరు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)ను మోసం చేసి బెరైటీస్ తీసుకెళ్తే.. మరి కొందరు ఏకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)కే కుచ్చుటోపీ పెట్టారు.
ఐదేళ్లలో రూ.370 కోట్లకు కుచ్చుటోపీ!
కడప వ్యాపారుల సిండికేట్ నయా దందా
బెరైటీస్ సరఫరాలో గోల్‌మాల్
సీ గ్రేడ్ కొని బీ గ్రేడ్‌గా అమ్మకం
ఎండీసీ నుంచి టన్ను రూ.2 వేల చొప్పున కొనుగోలు
ప్రాసెస్ చేసి 12 వేలకు అమ్మకం
టన్నుపై రూ.5,426 మేర దోపిడీ
జగన్ పాలనలో దర్జాగా దగా
కార్పొరేషన్ అధికారులూ కుమ్మక్కు
తెర వెనుక కడప వైసీపీ నేత పాత్ర
కడప జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నేతలు ఏపీఎండీసీకి కోట్లాది రూపాయలు ఎగవేసిన సంగతి తెలిసిందే. అలాగే అదే జిల్లాకు చెందిన కొందరు వ్యాపారులు కేంద్ర సంస్థ ఓఎన్‌జీసీని రూ.370 కోట్ల మేర మోసం చేశారు. ఏపీఎండీసీ నుంచి తక్కువ నాణ్యత గల బెరైటీస్ ను కొనుగోలు చేసి ఎక్కువ గ్రేడ్ పేరిట అత్యధిక ధరకు ఓఎన్‌జీసీకి అంటగడుతున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ ప్రభుత్వంలో బెరైటీస్ సిండికేట్ వ్యాపారులు అడ్డగోలుగా దోచుకున్నారు. కొందరు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)ను మోసం చేసి బెరైటీస్ తీసుకెళ్తే.. మరి కొందరు ఏకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)కే కుచ్చుటోపీ పెట్టారు. గత ఐదేళ్ల వ్యవధిలో రూ.370 కోట్ల మేర ఓఎన్‌జీసీని మోసం చేశారు. ఇది ప్రాథమిక అంచనానే. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ చేస్తే ఆ విలువ రెట్టింపయ్యే అవకాశముందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. తక్కువ నాణ్యత ఉన్న సీడీడబ్ల్యూ గ్రేడ్‌ను ఏపీఎండీసీ దగ్గర కొని, బీ గ్రేడ్ పౌడర్ పేరిట ఓఎన్‌జీసీకి సరఫరా చేశారు. కడప జిల్లాకు చెందిన ఓ సిండికేట్ మోసానికి ఓఎన్‌జీసీలోని కొందరు పెద్ద అధికారులు కూడా సహకరించారు.ఇంటిదొంగల అండతో కేంద్ర సంస్థకు తీవ్ర నష్టం చేకూర్చారు. కార్పొరేషన్ భద్రతా ప్రమాణాలను ప్రమాదంలో పడేశారు. ఏపీఎండీసీకి కూడా ఆర్థికంగా నష్టం చేకూర్చారు. ఏపీఎండీసీలోని కొన్ని కీలక ఫైళ్లను పరిశీలించినప్పుడు కేంద్ర సంస్థకు సరఫరా చేసిన బెరైటీస్ వివరాలేవీ కనిపించకపోవడంతో ఈ దోపిడీ గుట్టు రట్టయింది.
నయా దోపిడీ
సాధారణంగా బీ గ్రేడ్ ముగ్గురాయి టన్ను రూ.13,067 రూపాయలు ఉంటుంది. అయితే కొందరు కడప వ్యాపారులు తాము రూ.11,926కే సరఫరా చేస్తామని ఓఎన్‌జీసీకి చెప్పారు. అంటే... మార్కెట్ రేటుతో పోలిస్తే తాము రూ.1,141 నష్టాన్ని భరించి సరఫరా చేస్తామని నివేదించారు. వాస్తవానికి బీ గ్రేడ్ బైరటీస్ టన్ను ధర రూ.7,800 ఉంటుంది. రవాణా, ప్రాసెసింగ్, ప్యాకింగ్, ఇత ర బెనిఫిసియేషన్ చార్జీలతో కలిపి రూ.13,067 అవుతుందని ఎండీసీ లెక్కలు చెబుతున్నాయి. కానీ వ్యాపారులు మార్కెట్ రేటు కంటే తక్కువకే సరఫరా చేస్తామని ఓఎన్‌జీసీకి ఆఫర్ ఇచ్చాయి. ఇలా గత ఐదేళ్లుగా ముగ్గురాయి పౌడర్‌ను సరఫరా చేస్తున్నాయి. ఏ వ్యాపారి అయినా తన కు పది రూపాయలు లాభం వచ్చేలా వ్యాపారం చేస్తాడు. మార్కెట్ రేటు కంటే కాస్త ఎక్కువ లేదా దానికి సమానమైన ధరకు సరుకును అమ్మాలని కోరుకుంటారు. అంతేకానీ నష్టం వచ్చేలా ఎవరూ వ్యాపారం చేయరు. ఎండీఎల్ లైసెన్స్ కలిగి వ్యాపారుల అవతారం ఎత్తిన వైసీపీ నేతలు కొందరు మోసం, నయవంచన, దగాతో వ్యాపారాన్ని చేస్తున్నారు. వాస్తవానికి ఓ వైసీపీ నేత కనుసన్నల్లోని ఈ సిండికేట్ ఓఎన్‌జీసీకి సరఫరా చేసేది బీ గ్రేడ్ 4.10 కాదు. సీడీడబ్ల్యూ గ్రేడ్ (3.7 -3.6 )పౌడర్‌నే సరఫరా చేస్తున్నారు. ఇది ముగ్గురాయిలో అతి తక్కువ నాణ్యత కలిగినది. బ్లోఅవుట్ ఆపరేషన్స్‌కు పెద్దగా వినియోగించరు. బెరైటీస్ ను ప్రాసెస్ చేసే క్రమంలో వచ్చే వేస్టేజీని కూడా ఇందులోనే కలిపేస్తారు. దీని విలువ టన్నుకు 2 వేల రూపాయల లోపే ఉంటుంది.
వ్యాపారులు ఎండీసీతో పాటు మిల్లుల నుంచి నాసిరకం ముగ్గురాయిని కొనుగోలు చేసి ప్రాసెస్ చేసి ఓఎన్‌జీసీకి సరఫరా చేస్తున్నారు. ఇందుకు వీరికి అవుతున్న మొత్తం ఖర్చు 5,500 రూపాయలు. ఇందులోనే రవాణా, లోడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ వంటి ఖర్చులు ఉన్నాయి. అంటే.. బీ గ్రేడ్ పేరిట ఓఎన్‌జీసీకి సీడీడబ్ల్యూ గ్రేడ్ ముగ్గురాయిని సరఫరా చేయడం వల్ల వ్యాపారులకు టన్నుకు రూ.5,426 మిగులుతోంది.ఏటా 1.20 లక్షల టన్నుల మేర ఓఎన్‌జీసీకి ముగ్గురాయిని సరఫరా చేస్తున్నారు. ఈ మేరకు ఏటా 69.55 కోట్ల రూపాయలు ఓఎన్‌జీసీ నుంచి అదనంగా బిల్లులు పొందుతున్నారు. ఇలా గత ఐదేళ్ల కాలంలో రూ.347.76 కోట్ల మేర ఓఎన్‌జీసీ నుంచి అప్పనంగా దోచుకున్నారు. ఓఎన్‌జీసీలోని కొందరు పెద్దలు ఇక్కడి వ్యాపారులతో కుమ్మ క్కై సీడీడబ్ల్యూ గ్రేడ్‌ను బీ గ్రేడ్‌గా నమోదు చేయించి పౌడర్‌ను తీసుకుంటున్నట్లుగా వెలుగుచూసింది. వ్యాపారులు ఏ కంపెనీకైనా బీ గ్రేడ్ బెరైటీ్‌సను పౌడర్ రూపంలో సరఫరా చేసి ఉంటే అది ఏపీఎండీసీలో రికార్డు అవుతుంది. కానీ గత ఐదేళ్ల కాలంలో ఓఎన్‌జీసీకి బీ గ్రేడ్ ముగ్గురాయిని సరఫరా చేసినట్లుగా ఒక్క రికార్డు కూడా అందుబాటులో లేదు.
తెరవెనుక కడప నేత
ఈ సిండికేట్‌లో కడప జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత కంపెనీ ఉంది. గతంలో మంగంపేటలోని ఎండీ సీ స్టాక్‌పాయింట్ల నుంచి సీడీడబ్ల్యూ ముగ్గురాయి పేరిట 2 లక్షల టన్నుల ఏ గ్రేడ్ సరుకును ఎత్తుకెళ్లిపోయారు. ఇది విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడయినా నా టి సీఎం జగన్ అస్మదీయుడు అనే కారణంతో ఏ చర్యలు తీసుకోకుండా వదిలేసింది. ఆయన నేతృత్వంలోని కంపెనీ కొందరు వ్యాపారులతో సిండికేట్ చేయించి కేంద్ర సంస్థనే బురిడీ కొట్టిస్తోంది. కేంద్ర సంస్థ ఈ మోసాన్ని ఇప్పటికైనా కనిపెట్టాల్సి ఉంది.
బెరైటీస్‌ను ఎందుకు వాడుతారంటే..
దేశంలో ఆయిల్ ఇండియా కార్పొరేషన్(ఓఐఎల్), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)లు భారీగా బెరైటీ్‌సను వాడుతున్నా యి. ఆయిల్ బావుల నుంచి ఇంధనం తవ్వి తీసే క్రమంలో భూ ఉత్పాతాన్ని తగ్గించడానికి, భారీ విస్పోటనాలు నిరోధించేందుకు బి గ్రేడ్ ముగ్గురాయి(బెరైటీస్ 4.10 ఎస్‌జీ)ని వాడుతారు. చక్కటి కూలంట్‌గా ఈ పౌడర్ పనిచేస్తుంది. అందుకే 4.10 బెరైటీస్ పౌడర్‌కు విలువ ఎక్కువ. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ కంపెనీలు ఏ గ్రేడ్ 4.2, బీ గ్రేడ్ 4.10ను కొనుగోలు చేస్తాయి. దేశీయంగా ఓఐఎల్, ఓఎన్‌జీసీలకు కడప జిల్లా నుంచి కొందరు వ్యాపారులు బీ గ్రేడ్ ముగ్గురాయిని సరఫరా చేస్తున్నారు.
మార్కెట్లో బీ గ్రేడ్ బెరైటీస్ టన్ను ధర రూ.13,067. కానీ వ్యాపారులు రూ.11,926కే సరఫరా చేస్తామని ఓఎన్‌జీసీకి ఆఫర్ చేశారు. అంటే.. మార్కెట్ రేటు కంటే రూ.1,141 నష్టానికి..! ఇక్కడే అసలు కిటుకు ఉంది. ఏపీఎండీసీ నుంచి వ్యాపారులు తక్కువ నాణ్యత గల బెరైటీస్‌ను టన్ను రూ.2 వేలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీన్ని ప్రాసెస్ చేసి పౌడర్‌గా మార్చి ఓఎన్‌జీసీకి సరఫరా చేస్తున్నారు. ప్రాసె్‌సతో పాటు రవాణా, లోడింగ్, ప్యాకింగ్ వంటి ఖర్చులన్నీ కలిపి టన్నుకు రూ.5,500 ఖర్చు అవుతుంది. బీ గ్రేడ్ పేరిట సీడీడబ్ల్యూ గ్రేడ్ బెరైటీస్‌ను సరఫరా చేయడం వల్ల టన్నుకు రూ.5,426 మిగులుతోంది.
జగన్ హయాం నుంచి గత ఐదేళ్లుగా ఈ దందా సాగుతోంది. ఏటా 1.20 లక్షల టన్నుల మేర ఓఎన్‌జీసీకి బెరైటీస్ ను సరఫరా చేస్తున్నారు. ఓఎన్‌జీసీ నుంచి అదనంగా బిల్లులు పొందుతున్నారు. కార్పొరేషన్‌లోని కొందరు పెద్దలు వ్యాపారులతో కుమ్మక్కయ్యారు. ఈ వ్యవహారంలో కడప జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది.