Share News

Nimmala Rama Naidu: వేరే వారికి పుట్టిన బిడ్డ.. తన బిడ్డగా చెప్పుకొంటుంది

ABN , Publish Date - Jan 12 , 2025 | 03:36 PM

Nimmala Rama Naidu: గత జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై మరోసారి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పేద, మధ్య తరగతి వర్గాలను గత ప్రభుత్వం దూరం చేసిందని విమర్శించారు.

Nimmala Rama Naidu: వేరే వారికి పుట్టిన బిడ్డ.. తన బిడ్డగా  చెప్పుకొంటుంది
AP Minister Nimmala Rama Naidu

పాలకొల్లు, జనవరి 12: గత జగన్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధిని రద్దు చేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. తద్వారా పేద, మధ్య తరగతి వర్గాలను వైద్యం నుంచి దూరం చేసిందంటూ ఆ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధిని పునరుద్ధరించి.. పేదల వైద్య ఖర్చుల కోసం లక్షలాది రూపాయలు సహాయం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం మంత్రి నిమ్మల రామానాయుడు.. పాలకొల్లులో 70 మందికి వైద్య సహాయక ఖర్చుల కోసం.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 60 లక్షల విలువైన చెక్కులను స్వయంగా అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2018లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు వచ్చిందని గుర్తు చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ తమ పాలనలో వచ్చిందంటూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తీరు ఎలాం ఉందంటే.. వేరే వారికి పుట్టిన బిడ్డను కూడా తన బిడ్డ అని చెప్పుకొనే చందంగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు జగన్ పార్టీపై నిప్పులు చెరిగారు. అలాగే పేదల వైద్యానికి గత జగన్ ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 500 కోట్లు చంద్రబాబు విడుదల చేశారన్నారు. సంక్రాంతి కానుకగా వివిధ వర్గాలకు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 6700 కోట్లను సైతం తమ ప్రభుత్వం విడుదల చేసిందని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు సోదాహరణగా వివరించారు.


మరోవైపు.. ఒక రోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. ఇటీవల విశాఖపట్నం విచ్చేశారు. విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన కాకుండా.. ప్రాజెక్ట్‌లను సైతం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. అందులోభాగంగా గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్‌ను సైతం ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రాన్ని మరిన్ని ప్రాజెక్టులు భవిష్యత్తులో వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.


అలాంటి వేళ.. ఈ ప్రాజెక్ట్ గత జగన్ ప్రభుత్వమే తీసుకు వచ్చిందంటూ వైసీపీ ప్రచారానికి తెర తీసింది. ఈ నేపథ్యంలో గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్ 2014లో అధికారంలోకి వచ్చిన నాటి టీడీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిందంటూ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఆ క్రమంలో వైసీపీ చేసుకొంటున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించడమే కాకుండా.. దానిని తిప్పి కొట్టారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 12 , 2025 | 03:36 PM