AP Assembly Speaker: ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు.. జగన్ వస్తారా?
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:58 PM
AP Assembly Speaker: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు నిర్ణయించారు. ఈ తరగతులకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేకు శిక్షణ తరగతులు నిర్వహిస్తు్న్నామని.. వాటికి హాజరు కావాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కోరామని.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. సోమవారం న్యూఢిల్లీలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో కలిసి స్పీకర్ అయ్యన్నపాత్రుడు విలేకర్లతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలీపై ఈ సందర్భంగా స్పందించారు.
అసెంబ్లీకి హాజరుకావాలంటూ తాను స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆయనకు సూచించానని చెప్పారు. కానీ ఆయన అసెంబ్లీకి రాకుండా.. తన ప్యాలెస్‌లో కూర్చొని మాట్లాడుతోన్నారన్నారు. అంతేకాదు.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడికి ప్రసంగించడానికి ఎంత సమయం ఇస్తున్నారో.. తనకు అంత సమయం ఇవ్వాలని వైఎస్ జగన్ అంటున్నారని ఇదేమి విచిత్రమంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యంగ్యంగా ప్రశ్నించారు.
ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తాము నిర్ణయించామన్నారు. అయితే ఈ లోపే ఎమ్మెల్యేలకు విజయవాడలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 174 మందిలో 84 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై... అసెంబ్లీలో అడుగు పెట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారందరికీ చట్ట సభల్లో ఎలా వ్యవహరించాలనే అంశంపై శిక్షణ ఇస్తే బావుంటుందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు తాము వివరించామని చెప్పారు. వీటిని రెండు రోజుల పాటు.. అంటే ఫిబ్రవరి 22, 23వ తేదీల్లో నిర్వహిస్తామన్నారు. వీటికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఆహ్వానించామని వారు వెల్లడించారు.
Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు
గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం 61 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. ఏడాదికి కనీసం..75 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తాము భావిస్తున్నామన్నారు. అప్పుడే శాసన సభ్యులు.. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే తాము తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో.. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్.. హైదరాబాద్ నగర శివారులోని గండిపేట వద్ద 7 రోజుల పాటు ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించారని ఈ సందర్భంగా స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు గుర్తు చేసుకున్నారు.
Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
మరోవైపు.. గత అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు విచక్షణ రహితంగా మాట్లాడారు. అంతేకాదు వివిధ సభలు, సమావేశాల్లో సైతం వారు పరుష పదాలను తరచూ వినియోగించేవారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై.. శాసన సభ, శాసన మండలిలో అడుగు పెట్టేవారు.. ఎంత హుందాగా ఉండాలి, ప్రజా సమస్యలపై సభలో ఏ విధంగా స్పందించాలి తదితర అంశాలను ఈ శిక్షణ తరగతుల్లో వివరించనున్నారు.
ఇక గత ఎన్నికల్లో వైసీపీలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. అయితే తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కేటాయించాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. ఎమ్మెల్యేల సంఖ్య బలం లేకుంటే.. ఆ హోదా కేటాయించడం కుదరదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో తనకు ప్రతిపక్ష హోదా కేటాయించాలంటూ ఏపీ హైకోర్టును వైఎస్ జగన్ ఆశ్రయించారు. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్‌తోపాటు మిగిలిన 10 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. ఈ శిక్షణ తరగతులకు హాజరవుతారా? లేదా అనేది మరికొద్ది రోజుల్లో స్పష్టమయ్యే అవకాశముంది.
For AndhraPradesh News And Telugu News