Share News

AP Govt : చెరి సగం కుదరదు!

ABN , Publish Date - Jan 22 , 2025 | 04:35 AM

కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలను రెండు తెలుగు రాష్ట్రాలకు చెరి సగం పంచాలన్న తెలంగాణ డిమాండ్‌ను ఆంధ్రప్రదేశ్‌...

AP Govt : చెరి సగం కుదరదు!

  • నీటి లెక్కలు

  • 66:34 నిష్పత్తిలోనే కృష్ణా జలాలు పంచుకోవాలి

  • బోర్డు భేటీలో ఆంధ్ర స్పష్టీకరణ.. సుప్రీంలో వ్యాజ్యం ఉన్నందున కేటాయింపులపై చర్చ వద్దు

  • కాదని నిర్ణయం తీసుకుంటే కోర్టు ధిక్కరణే.. తీర్పు వచ్చేదాకా ప్రస్తుత కేటాయింపులే!

  • మా వాటా మేం వాడుకుంటుంటే టెలిమెట్రీల ఏర్పాటు ఎందుకు: ఏపీ

  • చెరి సగం డిమాండ్‌ను మినిట్స్‌లో రాయాలని తెలంగాణ సర్కారు పట్టు

  • తాము వ్యతిరేకించినట్లు కూడా నోట్‌ చేయాలని ఆంధ్ర స్పష్టీకరణ

  • తమకు 71% వాటా దక్కాలన్న తెలంగాణ.. అయినా 50 శాతమే అడుగుతున్నామని వెల్లడి

  • బచావత్‌ అవార్డుకు విరుద్ధంగా దేనికీ అంగీకరించేది లేదన్న ఏపీ అధికారులు

  • బోర్డు కార్యాలయం బెజవాడకు తరలించేందుకు సూత్రప్రాయ అంగీకారం

  • అద్దెలేని భవనం అడిగిన చైర్మన్‌ జైన్‌.. తమ ఆఫీసులే అద్దె భవనాల్లో ఉన్నాయన్న ఆంధ్రా

రెండ్రోజుల్లో డెల్టాకు నీరు

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు ఈ ఏడాది మూడో విడత 15 టీఎంసీలను కృష్ణా డెల్టాకు కేటాయించగా.. అందులో 2.9 టీఎంసీలు మాత్రమే వచ్చాయని బోర్డు భేటీలో ఏపీ గుర్తుచేసింది. మిగతా 12 టీఎంసీలను రోజుకు 1,700 క్యూసెక్కుల చొప్పున విడుదల చేసి.. చివరి ఆయకట్టుకు నీరివ్వాలని కోరింది. నీటి విడుదల ప్రారంభించామని.. రెండ్రోజుల్లో డెల్టాకు నీరందుతుందని బోర్డు చైర్మన్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలను రెండు తెలుగు రాష్ట్రాలకు చెరి సగం పంచాలన్న తెలంగాణ డిమాండ్‌ను ఆంధ్రప్రదేశ్‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 66:34 దామాషాలోనే నీటి కేటాయింపులు, వినియోగం కొనసాగించాలని స్పష్టం చేసింది. మంగళవారం హైదరాబాద్‌ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో బోర్డు చైర్మన్‌ అతుల్‌ జైన్‌, రాష్ట్రం నుంచి ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, జలవనరుల శాఖ సీఈ (అంతర్రాష్ట్ర వ్యవహారాలు) సుగుణాకరరావు, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.


బచావత్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పు మేరకు తొలుత 731 టీఎంసీలు.. తర్వాత 811 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా కేటాయించారని జలవనరుల శాఖ అధికారులు గుర్తుచేశారు. కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ నడుస్తున్న తరుణంలో.. నీటి కేటాయింపులపై చర్చకు ఆస్కారమే లేదని తేల్చిచెప్పారు. ఈ సమయంలో కేటాయింపులపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడేంతవరకు ఇంతకుముందు అంగీకారం కుదిరినట్లుగా ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకోవలసిందేనని తెలిపారు. తెలంగాణ డిమాండ్‌ చేస్తున్నట్లుగా 50:50 వినియోగానికి అంగీకరించేది లేదన్నారు. అయితే.. తాము చెరిసగం వాటా కోసం పట్టుబడుతున్న విషయాన్ని మినిట్స్‌లో రాయాలని తెలంగాణ పట్టుబట్టగా.. తా ము అంగీకరించడం లేదన్న విషయాన్ని కూడా అందులో పొందుపరచాలని ఏపీ కోరింది. తమ అభ్యంతరాన్ని నోట్‌ చేయకపోతే.. భవిష్యత్‌లో తాము న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపింది.

ఏపీలో కొత్తగా ప్రతిపాదనల్లో ఉన్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు సహా.. ఇతర ప్రధాన కాలువల ద్వారా వినియోగిస్తున్న జలాలపై తెలంగాణ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. కృష్ణా జలాలను చెరిసగం వినియోగించుకునేలా ఆదేశాలివ్వాలని బోర్డుపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించింది. వాస్తవానికి తమకు 71 శాతం వాటా, ఏపీకి 29 శాతమే రావాలని.. కానీ తాము చెరో 50 శాతం తీసుకుందామంటున్నామని తెలిపింది. అయి తే బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు మేరకే నీటిని వాడుకోవాలని.. ఆ కేటాయింపులకు విరుద్ధంగా దేనికీ అంగీకరించబోమని ఏపీ పునరుద్ఘాటించింది. ఆంధ్ర ఎంత నీటిని వాడుతోందో లెక్కించేందుకు టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలన్న తెలంగాణ వాదనలను తిప్పికొట్టింది. తమకు కేటాయించిన 512 టీఎంసీలను మాత్రమే వాడుకుంటున్నామని పేర్కొంది.


బెజవాడ రావడానికి ఓకే..

కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించేందుకు చైర్మన్‌ జైన్‌ సూత్రప్రాయంగా అంగీకరించారు. అద్దె భారం లేని 15,000 చదరపు అడుగుల భవనాన్ని ఉచితంగా అప్పగిస్తే.. వెంటనే షిఫ్ట్‌ చేస్తామని చెప్పారు. అయితే.. బోర్డుకు ఉచితంగా కార్యాలయ భవనాన్ని సమకూర్చడం కుదరదని ఏపీ స్పష్టం చేసింది. విజయవాడకు తరలించాలంటే రూ.కోటిన్నర వరకూ వ్యయమవుతుందని.. 2025-26 వార్షిక బడ్జెట్‌లో ఈ ఖర్చు చూపుతామని జైన్‌ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 22 , 2025 | 04:36 AM