AP Govt : తక్షణ సాయం 151.77 కోట్లు ఇవ్వండి
ABN , Publish Date - Jan 10 , 2025 | 06:06 AM
ఖరీఫ్ సీజన్‌లో వచ్చిన కరువు పరిస్థితులను అధిగమించేందుకు, రైతులను ఆదుకునేందుకు తక్షణ సాయంగా 151.77 కోట్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
కేంద్ర బృందాన్ని కోరిన ప్రభుత్వం
అమరావతి, తాడేపల్లి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్‌లో వచ్చిన కరువు పరిస్థితులను అధిగమించేందుకు, రైతులను ఆదుకునేందుకు తక్షణ సాయంగా 151.77 కోట్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈమేరకు రెవెన్యూ, విపత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చారు. గురువారం ఇక్కడి విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో కేంద్ర బృందంతో ఆయన సమావేశం నిర్వహించారు. గత కొద్దిరోజులుగా కేంద్ర బృందం కరువు పీడిత ప్రాంతాలైన అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, తదితర జిల్లాల్లో పర్యటించింది. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యాక తాడేపల్లిలో సిసోడియాతో భేటీ అయ్యింది. కరువు ప్రభావంతో పత్తి, జొన్న, వేరుశనగ, ఎర్రశనగలు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని కేంద్ర బృందానికి సిసోడియా తెలిపారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 54 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించామన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రెటరీ పెరిన్‌దేవి చెప్పారు.