APRTC : అంతా ఉచితం.. అయినా కోట్లు పెట్టి కొంటాం!
ABN , Publish Date - Mar 24 , 2025 | 05:09 AM
ఏపీఎస్‌ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హౌస్‌లో జరుగుతున్న చర్చ ఇది. క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) కార్యాలయం ప్రస్తుతం విజయవాడ బస్టాండు ప్రాంగణంలోని ఆర్టీసీ హౌస్‌లో ఉంది. రూపాయి కూడా అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆర్టీసీలోని సీసీఎస్ ఆఫీసు కోసం 4 కోట్లతో ఫ్ల్లాట్
బెజవాడలో బస్టాండుకు 6 కిలోమీటర్ల దూరంలో
ఇప్పటికే బిల్డర్‌తో ఒప్పందం.. 26న తీర్మానం
ప్రస్తుతం బస్టాండు ప్రాంగణంలోనే కార్యాలయం
పాలక మండలి నిర్ణయంపై సర్వత్రా విమర్శలు
స్వప్రయోజనాల కోసమేనని ఉద్యోగుల ఆగ్రహం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కార్యాలయానికి అద్దె లేదు. కనీసం కరెంటు బిల్లు కూడా లేదు. సభ్యులకు అంతా సౌకర్యంగా ఉంది. కానీ పాలక మండలికి నచ్చలేదు. ఉచితంగా ఎందుకంటూ రూ.4 కోట్లు ఖర్చు చేసి ఫ్లాట్ కొనుగోలు చేస్తోంది. ఇంత ఖర్చు చేసినా సభ్యులకు అనుకూలంగా ఉంటుందా? అంటే అడ్రస్ కనుక్కోవడం కూడా కష్టమే. మరి ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నారు? ఏపీఎస్‌ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హౌస్‌లో జరుగుతున్న చర్చ ఇది. క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) కార్యాలయం ప్రస్తుతం విజయవాడ బస్టాండు ప్రాంగణంలోని ఆర్టీసీ హౌస్‌లో ఉంది. రూపాయి కూడా అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. అలాంటిది.. ఎక్కడో ఆరు కిలోమీటర్ల దూరంలో రూ.4 కోట్లు పెట్టి ఫ్లాట్ ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? ఈ డబ్బు బ్యాంకులో వేసినా ప్రతి నెలా మూడు లక్షల దాకా వడ్డీ వస్తుంది. యాజమాన్యం ఉచితంగా ఇవ్వబోమని అంటే.. అదే ఆర్టీసీ హౌస్‌లో ఇతర ఆఫీసులకు ఇచ్చినట్లు అద్దె లేదా లీజుకు తీసుకోవడానికి ఖాళీ ఉంది కదా! అక్కడ సీసీఎస్ ఆఫీసు ఉంటే సభ్యులకు వచ్చి వెళ్లేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఒకవేళ సొంత భవనం కావాలనుకుంటే విద్యాధరపురంలోని ఆర్టీసీ ఆసుపత్రి ప్రాంగణంలో గతంలో ఇచ్చిన 500 గజాల్లో నిర్మాణం చేపడితే బాగుంటుందని వినిపిస్తున్నాయి.
సీసీఎస్ పాలకమండలి స్వలాభం కోసం ఫ్లాట్ కొనాలనే నిర్ణయం తీసుకుందని, ఏదో మమ అనిపించేందుకు ఈ నెల 26న తీర్మానం చూపించి, ఇప్పటికే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం భారతీనగర్‌లో కొనుగోలు చేసేందుకు సిద్ధమైందని చెబుతున్నారు. ఈ భవనం నిర్వహణతో పాటు విద్యుత్ బిల్లులు ఇతరత్రా ఖర్చులు అన్నీ కలిపి నెలకు రెండు లక్షలకు పైనే వస్తాయని చెబుతున్నారు. నాలుగు కోట్ల రూపాయలకు వడ్డీ కోల్పోవడంతో పాటు ఏటా పాతిక లక్షల వరకూ అదనపు భారం సీసీఎ్‌సపై పడుతుందని ఆర్టీసీ హౌస్‌లో బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ డబ్బంతా వృథా
ఏటా వేల కోట్లు ఆర్జిస్తున్న సంస్థగా, ప్రయాణికుడి రూపాయికీ లెక్క చెప్పే ఏకైక సంస్థగా ఆర్టీసీకి పేరుంది. కండక్టర్ వద్ద రూ.2 అదనంగా ఉన్నా ఉద్యోగం తొలగించేటంత క్రమశిక్షణ చర్యలు ఇందులో ఉన్నాయి. అటువంటి సంస్థలో చిన్న కార్మికుడి నుంచి ఈడీ వరకూ సొమ్ము పొదుపు చేసుకునేందుకు సీసీఎస్ ఏర్పాటైంది. ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగితో పాటు రిటైరైనవారి డబ్బులు కూడా ఇందులో పొదుపు చేసుకోవచ్చు. ప్రస్తుతం సీసీఎస్‌లో ఉన్న 46,500 మంది సభ్యులకు 8.5-9.5 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తోంది. అవసరాల కోసం లోన్లు తీసుకునే ఉద్యోగుల నుంచి 11 శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తుంది. అలా వచ్చిన రూపాయిన్నర ఆదాయాన్ని రిటైర్డ్ ఉద్యోగులకు పింఛను రూపంలో, సిబ్బంది పిల్లలకు వృత్తి విద్యలో స్కాలర్ షిప్పులు, తదితర సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంది. ఏటా రూ.2,500 కోట్ల టర్నోవర్ కలిగిన సీసీఎస్ పాలక మండలికి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. 9 మంది డెలిగేట్స్‌గా ఎన్నికవుతారు. చైర్మన్‌గా ఆర్టీసీ ఎండీ వ్యవహరిస్తారు. ఆర్టీసీ సొమ్ములో ప్రతి రూపాయిని జాగ్రత్తగా కాపాడే ఎండీ, సిబ్బంది కోసమే తాము పోరాటాలు చేస్తున్నామంటూ వినతులు, ప్రకటనలతో మభ్యపెట్టే యూనియన్ల ప్రతినిధులు సీసీఎస్ పాలక మండలిలో ఉన్నారు.
ఆ సొమ్మును జాగ్రత్తగా కాపాడుకోకుండా తమ అవసరాలు, కమీషన్ల కోసం విజయవాడలోని భారతీనగర్‌లో ఒక అపార్ట్‌మెంట్లోని ఐదో అంతస్తు మొత్తం(6వేల చదరపు అడుగులు) కొనేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. బిల్డర్‌తో తెర వెనుక ఒప్పందం చేసుకుని మార్కెట్ ధర కన్నా ఎక్కువ చెల్లించి సీసీఎ్‌సకు చెందిన 4 కోట్లు వృథా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెల 26న పాలక మండలి సమావేశం కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేయడం.. అపార్ట్‌మెంట్లో ఫ్లాటు కొనుగోలు తీర్మానం కోసమేననే చర్చ జరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం: ఈయూ
ఆర్టీసీలో పనిచేస్తున్న, రిటైరైన 70 వేల మంది సొమ్మును ఏడుగురు ఇష్టారాజ్యంగా కృష్ణా నదిలో పారబోస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఉద్యోగ అసోసియేషన్ ఈయూ హెచ్చరించింది. అన్ని అసోసియేషన్లతో కూటమి ఏర్పాటు చేసుకుని ఎన్‌ఎంయూ మెజారీటీలో ఉన్న సీసీఎస్ పాలకమండలి చర్యల్ని అడ్డుకుంటామని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్ రావు అన్నారు. ఎవరి ప్రయోజనాలు, స్వలాభాల కోసం వేలాది మంది సొమ్ముతో గెస్ట్ హౌస్‌లు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు.