Share News

APSRTC Flat Purchase: ఎవరి సొమ్మని కోట్లు కుమ్మరింత

ABN , Publish Date - Mar 25 , 2025 | 04:57 AM

ఏపీఎస్‌ఆర్టీసీ క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ (సీసీఎస్‌)కి సంబంధించిన 4 కోట్ల రూపాయల ఫ్లాట్ కొనుగోలు ప్రకటన తీవ్ర చర్చలకు దారి తీసింది. దీనిపై పాలకమండలి వివరణ ఇచ్చి, ఎలాంటివైన విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

APSRTC Flat Purchase: ఎవరి సొమ్మని కోట్లు కుమ్మరింత

  • సీసీఎస్‌ నిధుల బాగోతంపై ఆర్టీసీ సిబ్బంది ఆగ్రహం

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై డిపోల్లో దుమారం

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ‘ఎవరి సొమ్మని కోట్లు కుమ్మరిస్తున్నారు.. రహస్యంగా ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరమేంటి.. రూపాయి ఖర్చులేదు.. 70 వేల మంది సభ్యులకు అనుకూలం.. బస్టాండుకు దూరంగా ఫ్లాట్లు కొంటామంటే ఊరుకోం..’ అంటూ ఏపీఎ్‌సఆర్టీసీలోని క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ(సీసీఎస్‌) సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సీసీఎస్‌ కార్యాలయం పేరుతో బస్టాండుకు దూరంగా రూ.4 కోట్లతో పాలకమండలి అపార్ట్‌మెంట్లో ఒక ఫ్లోర్‌ కొంటున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ లో సోమవారం ప్రచురితమైన కథనం రాష్ట్రంలోని అన్ని బస్‌ డిపోల్లో తీవ్ర దుమారం రేపింది. దీంతో ఉలిక్కిపడిన పాలకమండలి.. ఆ వార్తను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అయితే అందులో ఎవరి సంతకమూ లేదు. సీసీఎ్‌సకు స్థిరాస్తి ఉండాలనే ఫ్లాట్‌ కొంటున్నామని.. హైదరాబాద్‌లో ఉమ్మడి భవనం ద్వారా వచ్చిన వాటా సొమ్ములో నుంచి మూడున్నర కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. చదరపు అడుగు రూ.6,100 చొప్పున 5,500 చ.అడుగుల ఫ్లోర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ఎలాం టి విచారణకైనా సిద్ధమంటూ ఎండీ ద్వారకా తిరుమలరావుకు లేఖ రాస్తామన్న పాలకమండలి.. వార్తలో వచ్చిన పలు అంశాలకు వివరణ ఇవ్వలేదు.


ఇంకోవైపు.. ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఈయూ) రాష్ట్ర కమిటీ ఈ కొనుగోలును వ్యతిరేకిస్తూ ఎండీకి లేఖ రాసింది. సీసీఎస్‌ చైర్మన్‌ హోదాలో ఈ నిర్ణయాన్ని ఎండీ అడ్డుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్‌రావు ప్రకటించారు. ఎండీ చొరవ తీసుకుని మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఏపీపీటీడీ కార్మిక పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌వీ శేషగిరిరావు, ప్రధా న కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాగా, సీసీఎస్‌ సభ్యులు ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలిపారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 04:57 AM