Share News

Perni Nani: పోలీస్ విచారణకు హాజరైన పేర్ని జయసుధ

ABN , Publish Date - Jan 01 , 2025 | 03:32 PM

Perni Nani: రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ బుధవారం పోలీస్ విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి ఆమె ఆర్ పేట తాలుకా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

Perni Nani: పోలీస్ విచారణకు హాజరైన పేర్ని జయసుధ
Perni Nani With His Wife Jayasudha

మచిలీపట్నం, జనవరి 01: రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం బందరు తాలుకా పోలీస్ స్టేషన్‌కు పేర్ని జయసుధ వచ్చారు. తన న్యాయవాదులతో కలసి విచారణకు వచ్చిన పేర్ని జయసుధను.. రాబర్ట్‌సన్ పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఏసు బాబు విచారిస్తున్నారు. రేషన్ బియ్యం మాయం అంశంపై పేర్ని జయసుధ నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో ఏ1గా పేర్ని జయసుధ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.

బందరు మండలం పొట్లపాలెంలో పేర్ని నాని .. తన భార్య పేరిట గోడౌన్లు నిర్మించారు. అందులో రేషన్ బియ్యం బఫర్ నిల్వలను ఉంచారు. అయితే ఇటీవల వార్షిక తనిఖీల్లో భాగంగా సదరు గోడౌన్లలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారి కోటిరెడ్డి సోదాలు చేపట్టారు. ఆ క్రమంలో దస్త్రాల్లో ఉన్న బియ్యం బస్తాల నిల్వలకు.. గోడౌన్లలో ఉన్న సరకుకు భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు. దాదాపు వేలాది బియ్యం బస్తాల తేడా ఉండడంతో... పేర్ని నాని సతీమణికి నోటీసులు జారీ చేశారు.


మరోవైపు వే బ్రిడ్జ్‌లో సమస్యలు ఉన్నాయని.. అందువల్ల ఈ తేడా అంటూ పేర్ని నాని పౌర సరఫరాల శాఖ అధికారులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్లీ అంతలోనే రేషన్ బియ్యం ఎంత మాయం అయిందో అంతకు నగదు చెల్లించేందుకు పేర్ని నాని సతీమణి జయసుధ సుముఖత వ్యక్తం చేశారు. దీంతో రూ.1.70 కోట్ల నగదు డీడీని ప్రభుత్వానికి చెల్లించారు.


ఇంకోవైపు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ రంగంలోకి దిగి... తనిఖీలు చేపట్టారు. దాంతో మరిన్ని బస్తాలు మాయమైనట్లు గుర్తించి... ఆ నగదు కూడా చెల్లించాలంటూ పేర్ని జయసుధకు నోటీసులు జారీ చేశారు.


ఇంతలో ఈ వ్యవహారంలో పేర్ని జయసుధ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. దాంతో ఆమె జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందీ కోర్టు. అయితే పోలీస్ విచారణకు సహకరించాలంటూ కోర్టు ఆమెకు సూచించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణకు తన న్యాయవాదులతో కలిసి పేర్ని జయసుధ పోలీస్ విచారణకు హాజరయ్యారు.


అదీకాక.. ఈ బియ్యం మాయం కేసులో పలువురిని పోలీసులు విచారించారు. గోడౌన్లలో మాయమైన బియ్యం బస్తాలు.. కాకినాడ పోర్టు ద్వారా బయటకు వెళ్లాయాని పోలీసుల విచారణలో నిందితులు ఒప్పకున్నట్లు ఓ ప్రచారం అయితే బందరులో వాడివేడిగా నడుస్తోంది.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 01 , 2025 | 03:32 PM