Share News

AP High Court Case: బోరుగడ్డపై కోర్టు ధిక్కరణ కేసు!

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:44 AM

హైకోర్టు, తప్పుడు మెడికల్‌ సర్టిఫికెట్‌తో బోరుగడ్డ అనిల్‌కుమార్‌ బెయిల్‌ పొడిగించుకునేందుకు చేసిన ప్రయత్నంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు నిర్దేశించిన గడువు లోపు సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి కేంద్ర కారాగారంలో లొంగిపోలేకపోవడంతో వివరణ కోరింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.

AP High Court Case: బోరుగడ్డపై కోర్టు ధిక్కరణ కేసు!

  • తప్పుడు మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పణ వ్యవహారంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం

  • కళ్లు మూసుకుంటే బెయిల్‌ పొడిగించాలని ఎన్నిసార్లైనా కోరతారు!

  • ఈనెల 11న ఎందుకు లొంగిపోలేదు?

  • బోరుగడ్డ అనిల్‌పై న్యాయస్థానం మండిపాటు

  • ప్రాథమిక దర్యాప్తు వివరాలు కోర్టు

  • ముందు ఉంచాలని పోలీసులకు ఆదేశం

అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): తప్పుడు మెడికల్‌ సర్టిఫికెట్‌తో కోర్టును మోసం చేసి, మధ్యంతర బెయిల్‌ పొడిగించుకున్న వ్యవహారంలో రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కుమార్‌పై హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి బెయిల్‌ పొడిగింపు కోసం ప్రయత్నించడంపై మండిపడింది. ‘కళ్లు మూసుకుంటే బెయిల్‌ పొడిగించాలని ఎన్నిసార్లైనా కోరతారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు నిర్దేశించిన గడువు అయిన ఈనెల 11న సాయంత్రం 5 గంటలలోగా రాజమండ్రి కేంద్ర కారాగారం అధికారులు ముందు ఎందుకు లొంగిపోలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘ఇష్టమైనప్పుడు వచ్చి లొంగిపోతామంటే కుదరదు’ అని స్పష్టం చేసింది. తల్లి ఆరోగ్యంపై తప్పుడు మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించి.. మధ్యంతర బెయిల్‌ పొందారని ఓవైపు వివాదం జరుగుతున్నా, మరోసారి బెయిల్‌ పొడిగింపు కోసం ప్రయత్నించడంపై న్యాయస్థానం మండిపడింది. తప్పుడు మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించడంపై క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి, విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ వ్యవహారంపై ప్రాథమిక దర్యాప్తు ద్వారా సేకరించిన వివరాలను సీల్డ్‌ కవర్‌లో కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరుపుతామని, సంబంధిత డాక్టర్‌ను కూడా కోర్టుకు పిలిచి విచారిస్తామని తెలిపింది. బోరుగడ్డ మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యేందుకు వీలుగా పూచీకత్తులు సమర్పించిన వారి వివరాలు తమ ముందుంచాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఉత్తర్వులు ఇచ్చారు.


సర్టిఫికెట్‌ ఇవ్వలేదని ఆ డాక్టర్‌ చెప్పారు..

అనంతపురం 4వ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బోరుగడ్డ.. తన తల్లి బి.పద్మావతి గుండె సంబంఽధిత వ్యాధితో బాధపడుతూ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, తన సహాయం ఆమెకు అవసరమని నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్‌తో ఈ నెల 11 వరకు మధ్యంతర బెయిల్‌ పొడిగించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యంతర బెయిల్‌ను మరికొంత కాలం పొడిగించాలని ఈ నెల 11న మరోసారి అభ్యర్థించగా.. న్యాయమూర్తి తిరస్కరించారు. పిటిషన్‌ సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. అనిల్‌ తల్లి ఆరోగ్యంపై ఈ ఏడాది ఫిబ్రవరి 28న తాను ఎలాంటి సర్టిఫికెట్‌ ఇవ్వలేదని గుంటూరు లలిత సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు పీవీ రాఘవశర్మ చెప్పారన్నారు. కోర్టు నిర్దేశించిన గడువులోగా అనిల్‌ జైలు అధికారుల ముందు లొంగిపోలేదని, మధ్యంతర బెయిల్‌ పొడిగింపునకు ఈనెల 11న మరోసారి లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేశారన్నారు. ప్రాసిక్యూట్‌ చేసేందుకు అనుమతించాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. అనిల్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు వివరాలను తమకు అందించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ‘ఎందుకు? అందజేస్తే వాటిని కూడా తారుమారు చేస్తారా?’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.


మరో కేసులో బోరుగడ్డకు 4 వరకు రిమాండ్‌

బోరుగడ్డ అనిల్‌కు మరో షాక్‌ తగిలింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 3న నమోదైన కేసులో నరసరావుపేట రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి సోమవారం ఆయనకు ఏప్రిల్‌ 4 వరకు రిమాండ్‌ విధించారు. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బోరుగడ్డను పోలీసులు పీటీ వారెంట్‌పై నరసరావుపేట తీసుకువచ్చారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 02:46 AM