Share News

Pastor Praveen Kumar Case: కీసర టోల్‌ వద్ద ప్రవీణ్‌కు ప్రమాదం!

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:45 AM

పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌కుమార్‌ అనుమానాస్పద మృతి కేసులో కీలక ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, విజయవాడ చేరుకునే ముందే కీసర టోల్‌ప్లాజా సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడిపోయినట్లు నిర్ధారణ అయింది

Pastor Praveen Kumar Case: కీసర టోల్‌ వద్ద ప్రవీణ్‌కు ప్రమాదం!

  • విజయవాడకు రాకముందే బైక్‌పై నుంచి పడిన పాస్టర్‌

  • ప్లాజా ముందు ఉన్న మలుపులో పక్కకు దూసుకుపోయిన బుల్లెట్‌

  • స్థానికుల ఫోన్‌తో అంబులెన్స్‌ రాక

  • సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

  • గాయాలను శుభ్రం చేశామన్న టోల్‌ సిబ్బంది

విజయవాడ, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌కుమార్‌ అనుమానాస్పద మృతి కేసులో చిక్కుముళ్లు వీడుతున్నాయి. ప్రవీణ్‌ విజయవాడకు చేరుకోవడానికి ముందే బుల్లెట్‌పై నుంచి అదుపుతప్పి పడిపోవడం నిజమ ని తేలింది. హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఆయన ఎన్టీఆర్‌ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత కీసర టోల్‌ప్లాజాలోకి రావడానికి ముందు ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది. 24వ తేదీన ప్రవీణ్‌ విజయవాడలోని గొల్లపూడి వద్ద ఉన్న పెట్రోలు బంకుకు చేరుకునే సమయానికి గాయాలు ఉన్నట్టు అక్కడ సిబ్బంది పోలీసులకు వివరించా రు. దీనికి ముందే ఆయన బుల్లెట్‌పై నుంచి అదుపుతప్పి పడిపోయారు. జగ్గయ్యపేట వద్ద ముందుగా చిల్లకల్లు టోల్‌ప్లాజా వస్తుంది. ఇది దాటిన తర్వాత కీసర టోల్‌ప్లాజా. ఈ టోల్‌ప్లాజాలోకి వెళ్లడానికి ముందు 50 మీటర్ల దూరంలో జాతీయ రహదారిపై మలుపు ఉంటుంది. ఇక్కడ మలుపు తీసుకున్న తర్వాత ప్లాజాలోని లేన్లలోకి వాహనాలు ప్రవేశిస్తాయి. ప్రవీణ్‌కుమార్‌ 24వ తేదీ మధ్యాహ్నం 3.52 గంటలకు వేగంగా వస్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. సరిగ్గా మలుపు వద్దకు వచ్చేసరికి ఆయన అక్కడ వాహనాన్ని తిప్పలేదు. తిన్నగా వెళ్లిపోవడంతో జాతీయ రహదారికి పక్కన ఉన్న ప్రదేశంలో పడిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల ఫుటేజీలో కనిపిస్తున్నాయి. ప్రవీణ్‌ పడిపోయిన ప్రదేశానికి ముందు రెండో ఆటోలు ఉండడంతో మట్టి గాల్లోకి లేచిన దృశ్యాలు కనిపించాయి. దీన్ని టోల్‌ప్లాజా సిబ్బంది ధ్రువీకరించారు. బుల్లెట్‌పై నుంచి పాస్టర్‌ పడిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది. ఇది విన్న స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఇంతలోనే ప్లాజా సిబ్బంది వెళ్లి పడిపోయిన ప్రవీణ్‌ను పైకి లేపి, బుల్లెట్‌పై కూర్చోబెట్టారు.


కీసరకు ముందుగానే ఒకసారి ప్రమాదం?

అయితే పడిపోయిన వ్యక్తి ఎవరో తమకు తెలియదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ప్రమాదం మాత్రం జరిగిందని, అక్కడికి వెళ్లి చూశామని ప్రత్యక్ష సాక్షులు స్పష్టం చేస్తున్నారు. కీసర టోల్‌ వద్ద జరిగినట్టుగానే.. దీనికి ముందు మరో ప్రమాదం జరిగిందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. టోల్‌ప్లాజా, అంబులెన్స్‌ సిబ్బంది ఘటనాస్థలానికి వెళ్లి ప్రవీణ్‌కు ఏమైనా గాయాలయ్యాయా అని పరిశీలించారు. కుడి చేతిపై గీసుకున్నట్టుగా గాయం ఉన్నట్టు గుర్తించారు. అయితే అది కీసర టోల్‌ప్లాజా వద్ద పడిపోయినప్పుడు తగిలిన గాయం కాదని అంబులెన్స్‌ సిబ్బంది దినకరన్‌ చెబుతున్నాడు. గంట క్రితం తగిలిన గాయంలా ఉందని ఆయన స్పష్టం చేశాడు. దీన్ని బట్టి చూస్తే చిల్లకల్లు-కీసర టోల్‌ప్లాజాల మధ్య ప్రవీణ్‌కు మరో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విజయవాడ వైపునకు వస్తున్న క్రమంలో చిల్లకల్లు టోల్‌గేట్‌ దాటిన తర్వాత ప్రవీణ్‌ అదుపుతప్పి పడిపోయి ఉండొచ్చని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి.


గాయాలను శుభ్రం చేశాం: దినకరన్‌, అంబులెన్స్‌ ఉద్యోగి

24వ తేదీన మాకు సేఫ్టీ మీటింగ్‌ పెట్టారు. ఆ మీటింగ్‌లో ఉండగా కంట్రోల్‌రూం నుంచి 3.52 గంటలకు కాల్‌ వచ్చింది. అప్పటికే మా గేట్‌మ్యాన్‌ పాస్టర్‌ ను పైకి లేపాడు. మేం వెళ్లేసరికి ఆయన బుల్లెట్‌పై కూర్చుని ఉన్నాడు. కుడిచేతిపై గీసుకునట్టుగా ఉంది. ఆ దెబ్బ ఇక్కడ తగల్లేదు. గంట క్రితం వేరే చోట తగిలిన దెబ్బలా అనిపించింది. క్లీన్‌ చేస్తే అక్కడ గీసుకుపోయి ఉంది. బైక్‌ నడిపే పరిస్థితిలో లేరు కాబట్టి.. కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పాం. ఆ సమయానికి ఆయన బైక్‌ను ఆపుకోలేని, నిలబడలేని స్థితిలో ఉన్నారు. 5-10 నిమిషాలు పడిపోయిన ప్రదేశంలోనే ఉంచాం. మేము మాట్లాడుతుంటే అదే పనిగా కిక్‌రాడ్‌తో బైక్‌ను స్టార్ట్‌ చేస్తున్నారు. బైక్‌ స్టార్ట్‌ కాకపోవడంతో కీ ఒకసారి ఆఫ్‌చేసి, ఆన్‌ చేసి సెల్ఫ్‌ స్టార్ట్‌ చేశాడు. మావైపు చూసి ఒక్కసారిగా నవ్వి, మేం చూస్తుండగానే మమ్మల్ని దాటి వెళ్లిపోయాడు. మా ప్లాజాకు 50 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మలుపులో ఒక మొబైల్‌ షాపు ఎదురుగా ఆయన పడ్డారు. ప్లాజాకు ముందు లైన్లు ఉంటాయి. అక్కడ మలుపు ఉంటుంది. ఈ మలుపు తిరగకుండా నేరుగా వెళ్లిపడిపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 05:45 AM