Central Govt : మిర్చి క్వింటా రూ.11,781
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:31 AM
ఏపీలో మిర్చి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (ఎంఐఎస్) తక్షణమే అమలు చేయడానికి అంగీకరించింది.
ఏపీలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం తక్షణ అమలు
ధర లోటు చెల్లింపునకు కేంద్రం అంగీకారం
గరిష్ఠంగా 2,58,238 టన్నులకు ఎంఐఎస్ కవరేజీ
నేరుగా రైతుల ఖాతాలకు రీయింబర్స్‌మెంట్
మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ
అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ధర తగ్గిపోయి, నష్టపోతున్న మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీలో మిర్చి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (ఎంఐఎస్) తక్షణమే అమలు చేయడానికి అంగీకరించింది. రాష్ట్రంలో మిర్చి ధర పతనమైన నేపథ్యంలో రైతుల్ని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం స్పందించింది. ఎంఐఎస్ అమలు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ డిప్యూటీ కమిషనర్ బినోద్ గిరి వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్ర వ్యవసాయశాఖ ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్ రాజశేఖర్‌కు సోమవారం ఆయన పంపారు. ఉత్పత్తిలో 25ు, ఎంఐఎ్‌సలో గరిష్ఠంగా 2,58,238 మెట్రిక్ టన్నుల మిర్చికి ధర లోటు చెల్లింపు అమలు చేయనున్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్ (ఎంఐపీ) కింద క్వింటా మిర్చి రూ. 11,781గా కేంద్రం ధర నిర్ణయించింది. దీని ప్రకారం వ్యవసాయ, ఉద్యానశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ విక్రయ ధరను నిర్ణయిస్తుందని పేర్కొంది. ఎంఐపీ, అమ్మకం ధర మధ్య వ్యత్యాసం చెల్లింపు గరిష్ఠ పరిమాణంలోని 25ు వరకు ఉంటుందని తెలిపింది. ధర లోటు చెల్లింపుల కింద ప్రయోజనం పొందే రైతులు రాష్ట్రంలోని నోటిఫైడ్ మార్కెట్ యార్డుల్లోనే మిర్చిని విక్రయించాలని స్పష్టం చేసింది. 2024-25 సీజన్‌లో మిర్చికి ఎంఐఎస్ కింద ధర లోటు చెల్లింపు అమలు వ్యవధి మొదటి లావాదేవీ నుంచి ఒక నెల మాత్రమే ఉంటుందని తెలిపింది. ధర లోటు చెల్లింపు అమలులో సంభవించే నష్టాలు 50:50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుందని లేఖలో వివరించారు.
అలాగే ఈ సీజన్‌లో ఎంఐఎస్ కింద మిర్చి కవరేజ్ కోసం వ్యాపారుల జాబితాను ప్రైస్ డెఫిషియెన్సీ పేమెంట్(పీడీపీ) ద్వారా తెలియజేయాలని, అమ్మకం ధర, ఎంఐపీ మధ్య తేడాను నిర్ణయించడానికి అగ్‌మార్క్‌నెట్ పోర్టల్, ప్రభుత్వ ఈ-క్రాప్ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. వ్యత్యాస ధర చెల్లింపును నేరుగా రైతుల ఖాతాలకు జమ చేయడానికి పెట్టుబడి వ్యయం నిర్ధారణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని, రాష్ట్ర ప్రభుత్వ రీయింబర్స్‌మెంట్‌కు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం అమలు తర్వాత ఖాతా వివరాలు, తగిన పత్రాలను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖకు సమర్పించాలని, కాస్టింగ్ సెల్, వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ ద్వారా ఖాతాల పరిశీలన తర్వాత రీయింబర్స్‌మెంట్ అవుతుందని డిప్యూటీ కమిషనర్ బినోద్ గిరి స్పష్టం చేశారు.