Share News

Central Govt : ‘టీ-5’ మిశ్రమాన్ని ఆపండి!

ABN , Publish Date - Jan 20 , 2025 | 03:45 AM

రాష్ట్ర జల జీవనాడి పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్‌వాల్‌ పనులు ప్రారంభమయ్యాయని అందరూ సంతోషిస్తున్న సమయంలో...

Central Govt : ‘టీ-5’ మిశ్రమాన్ని ఆపండి!

  • డయాఫ్రమ్‌వాల్‌ కాంక్రీట్‌పై

  • సీడబ్ల్యూసీ మళ్లీ వెనకడుగు

  • జల శక్తి కార్యదర్శి దేబర్షిముఖర్జీ

  • సందేహంతో పనుల్లో హంసపాదు

  • రాష్ట్ర జలవనరుల అధికారుల విస్మయం

  • దావోస్‌లో కేంద్రమంత్రి పాటిల్‌తో దీనిపై

  • చర్చించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

  • పనులు ఆగకుండా చూసేలా గట్టి యత్నం

  • నేడు సీడబ్ల్యూసీ, సీఎ్‌సఎంఆర్‌ఎస్‌ చర్చలు

  • తుది నిర్ణయం వెల్లడిస్తామన్న సీడబ్ల్యూసీ

అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జల జీవనాడి పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్‌వాల్‌ పనులు ప్రారంభమయ్యాయని అందరూ సంతోషిస్తున్న సమయంలో కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ‘టీ-5 ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమం’ వినియోగాన్ని ఆపాలని ఆదేశించింది. ఈ మిశ్రమం వినియోగంపై పునరాలోచనలో పడినట్టు రాష్ట్ర జలవనరుల శాఖకు సమాచారం ఇచ్చింది. అయితే, అనేక చర్చలు, పరిశీలనల తర్వాత శనివారం పనులు ప్రారంభించామని.. ఇప్పుడు అకస్మాత్తుగా సందేహాలు వెలిబుచ్చడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ వ్యవహారంపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సీఎం చంద్రబాబు దావోస్‌లోనే చర్చించనున్నారు. సత్వరమే నిర్ణయం తీసుకుని పనులు సజావుగా సాగేలా చూడాలని కోరనున్నారు.

అసలు ఏం జరిగింది?

డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణానికి టీ-5 ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమం వినియోగించవచ్చని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి సీడబ్ల్యూసీ శుక్రవారం చెప్పింది. దీంతో ఈ సమాచారాన్ని రాష్ట్ర జల వనరుల శాఖకు, పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ నరసింహమూర్తికి పీపీఏ చేరవేసింది. శనివారం ఉదయం డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే, ‘టీ-5 కాంక్రీట్‌ మిశ్రమం’పై పునరాలోచనలో పడినట్లు శనివారం రాత్రి సీడబ్ల్యూసీ నుంచి సమాచారం వచ్చింది. దీంతో ప్రభుత్వం సహా అధికారులు నివ్వెరపోయారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో మళ్లీ ఈ ఆటంకాలేంటని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుకు చేరవేశారు. పెట్టుబడుల సదస్సు కోసం దావోస్‌కు వెళ్తున్న రామ్మోహన్‌నాయుడును దీనిపై సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని కోరారు.


ఎందుకీ అభ్యంతరం?

డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం కోసం వాడే ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమంపై సీఎ్‌సఆర్‌ఎంఎస్‌, అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్‌ ఇచ్చిన అభిప్రాయాలను సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుంది. అనంతరం ‘టీ-5’ మిశ్రమాన్ని వాడాలని పీపీఏ ద్వారా రాష్ట్ర జల వనరుల శాఖకు సూచించింది. ఇదే విషయాన్ని కేంద్ర జల శక్తి కార్యదర్శి దేబర్షి ముఖర్జీకి సైతం సీడబ్ల్యూసీ వెల్లడించింది. అయితే.. ‘టీ-16’ మిశ్రమం అయితే.. ప్రాజెక్టు భవిష్యత్తుకు మరింత భద్రత కల్పిస్తుందన్న అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్‌ అభిప్రాయాన్ని కూడా దేబర్షికి సీడబ్ల్యూసీ వివరించింది. దీంతో టీ-5, టీ-16 మిశ్రమాల విషయంలో అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్‌ నుంచి స్పష్టమైన సూచనలు తీసుకోవాలని దేబర్షి ఆదేశించారు. ‘టీ-5’ వాడాక భవిష్యత్తులో సమస్యలు ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారని సీడబ్ల్యూసీని నిలదీశారు. దీంతో టీ-5 మిశ్రమంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి సీడబ్ల్యూసీ సమాచారం చేరవేసింది.

ఏదైనా ఓకే.. పనులు సాగాలి: సీఎం

సీడబ్ల్యూసీ అభ్యంతరం, దీనికి ముందు జరిగిన పరిణామాలను సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ విషయంపై దావోస్‌ పర్యటనలో ఉన్న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో అక్కడే చర్చించాలని నిర్ణయించారు. ఈ సమస్యపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని పాటిల్‌ను కోరనున్నారు. సీడబ్ల్యూసీ సూచించినట్టు ‘టీ-5’ మిశ్రమానికైనా, అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్‌ చెబుతున్న ‘టీ-16’ మిశ్రమానికైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేయనున్నారు. పనులు ప్రారంభించాక.. కాస్త ఆగాలంటూ సీడబ్ల్యూసీ పేర్కొనడంపై పాటిల్‌ను ప్రశ్నించనున్నారు.

నేడు తుది నిర్ణయం!

డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణంలో కాంక్రీట్‌ మిశ్రమం వినియోగంపై సీడబ్ల్యూసీ.. సోమవారం అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్‌, సీఎ్‌సఎంఆర్‌ఎస్‌, ఐఐటీ-తిరుపతితో సంప్రదింపులు జరపనుంది. ‘టీ-5’ మిశ్రమం వాడాలో, లేదంటే అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్‌ చెప్పినట్లు ‘టీ-16’ మిశ్రమం వాడాలో తేల్చనుంది. ఏ మిశ్రమం వాడేందుకైనా తాము సిద్ధమేనని సీడబ్ల్యూసీకి కాంట్రాక్టు సంస్థ బావర్‌ వెల్లడించింది. దీంతో సోమవారం కాంక్రీట్‌ మిశ్రమంపై తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని ప్రకటించింది.

Updated Date - Jan 20 , 2025 | 03:45 AM