Share News

Chandrababu: పుష్కరాల్లోపే పోలవరం

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:12 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి పుష్కరాల ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తయ్యే ముందు నిర్వాసితుల పునరావాసం పూర్తి చేస్తామని చెప్పారు. పుష్కరాల సమయానికి ప్రాజెక్టు ప్రారంభం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు

Chandrababu:  పుష్కరాల్లోపే  పోలవరం

  • ముందు పరిహారం.. ఆ తర్వాతే ప్రారంభం: చంద్రబాబు

  • 2026 డిసెంబరుకల్లా చెల్లింపులు

  • ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేశారు

  • వారికి న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వానిదే

  • గత పాలకులవన్నీ మాయమాటలే

  • పరిహారం ఇస్తామన్నారు.. ఎక్కడ?

  • మేమే ఇచ్చాం.. ఇంకా ఇస్తాం

  • పోలవరం నిర్మాణం నా సెంటిమెంటు

  • చెప్పిన పనులు చేయకపోతే బ్లాక్‌ లిస్టులోకి కాంట్రాక్టర్లు: సీఎం

  • పోలవరంలో క్షేత్ర స్థాయి పర్యటన

  • ఏరియల్‌ వ్యూ ద్వారా పనుల పరిశీలన

  • నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నా సెంటిమెంట్‌. నష్టం జరిగినా, జాప్యం జరిగినా ఎక్కువ బాధపడేది నేనే. ప్రాజెక్టు నిర్మించే అవకాశం నాకు దక్కింది. దీనిని వినియోగించుకుని పూర్తి చేయాలన్నదే నా అభిలాష. నేనే పూర్తి చేయాలని ఆశిస్తున్నా..జగన్‌ హయాంలో జరిగిన తప్పు చరిత్ర క్షమించరాని నేరం. అహంభావం, తెలియనితనం, రాజకీయ కక్షతో ప్రాజెక్టుకు నష్టం కలిగించారు. జాతీయ ప్రాజెక్టును, ప్రజల ఆస్తిని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు.

- సీఎం చంద్రబాబు

ఏలూరు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ర్టానికి జీవనాడి అయిన ఈ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేయకముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తిచేస్తామని.. ఆ తర్వాతే ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. గురువారం ఆయన క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. తొలుత పనులను ఏరియల్‌ వ్యూ ద్వారా, తర్వాత ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్ష జరిపారు. నిర్వాసితులతో ముఖాముఖి సమావేశమయ్యారు. విలేకరులతోనూ మాట్లాడారు. గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్నాయి. ఆ ఏడాది డిసెంబరునాటికి పోలవరాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం తొలుత లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పుష్కరాలు వచ్చేలోపే పూర్తిచేస్తామని సీఎం తాజాగా ప్రకటించారు.


ప్రాజెక్టు మొదటి దశలో ఆర్‌ అండ్‌ ఆర్‌, భూసేకరణ కింద వచ్చే ఏడాది డిసెంబరు నాటికి 6,000 కోట్లకుపైగా ఖర్చవుతాయన్నారు. మొదటి దశ పూర్తయ్యాక 45.74 కాంటూరు పరిధిలో పనులు చేపట్టాల్సి ఉందన్నారు. పరిహారం విషయంలో అందరికీ న్యాయం జరగాలని, ఎక్కడా అక్రమాలు జరగడానికి వీల్లేదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. 2019లో టీడీపీ ప్రభుత్వమే మళ్లీ వచ్చి ఉంటే 2020కే ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. గత పాలకులు దీనికి ఏ గ తి పట్టించారో చూశామని.. ఆలస్యం చేయడం వల్ల ఖర్చు భారీగా పెరిగిపోయిందని చెప్పా రు. డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నా ఎవరికీ తెలియలేదని, కాఫర్‌ డ్యాం సకాలంలో పూర్తి చేసి ఉంటే ఈ నష్టం జరిగేది కాదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు అఽథారిటీ (పీపీఏ), కేంద్రం ముందే చెప్పినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, ఒక్కసారి ఓట్లేసినందుకు రాష్ర్టానికి జీవనాడి దెబ్బ తినే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. నిపుణుల కమిటీ పరిశీలించి, దెబ్బతిన్న వాల్‌ మళ్లీ నిర్మించాలని చేసిన సూచనకు కేంద్రం, రాష్ట్రం ఆమోదముద్ర వేశాయన్నారు. రూ.400 కోట్లతో తాము వాల్‌ పూర్తిచేశామని.. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మళ్లీ రూ.990 కోట్లతో కొత్తది కట్టాల్సి వస్తోందన్నారు. ఎగువ కాఫర్‌ డ్యాం నుంచి సీపేజీని నివారించేందుకు బట్రస్‌ డ్యాం నిర్మిస్తున్నామని.. రెండు నెలల్లోనే పూర్తవుతుందన్నారు. ప్రాజెక్టు వద్ద ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణంతోపాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం జీవితానికి ఒక పరమార్థమని.. ప్రధాని మోదీ సహకారంతో ఇది కూడా పూర్తిచేస్తామని తెలిపారు. ఇంకా సీఎం ఏమన్నారంటే..


అలసత్వం కూడదు..

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు నిర్మాణ పనులన్నీ శరవేగంగా పూర్తి చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టు ఏజెన్సీది.. ఇంజనీరింగ్‌ అధికారులదే. అలసత్వం కూడదు. పనులు పూర్తిచేసేందుకు దశల వారీగా లక్ష్యాలను నిర్దేశిస్తున్నాం. ఈ ఏడాది డిసెంబరుకల్లా డయాఫ్రం వాల్‌ పూర్తిచేయాలి. కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీలను 2026 జూలై నాటికి పూర్తి చేయాలి. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌-1 పనులను 2026 మార్చి నాటికి, ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌-2 పనులను 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యం విధించినా ఆలోపే పూర్తి చేయాలి. గడువులోగా పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతాం.

రూ.10 లక్షల పరిహారం ఇచ్చారా?

2014-19 మధ్య మా ప్రభుత్వం ఇచ్చిన పరిహారం సరిపోదని.. ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ రూ.10 లక్షలు పరిహారం ఇస్తానన్నాడు.. గద్దెనెక్కాక ఇచ్చాడా? ఐదేళ్లలో రూపాయి కూడా ఇచ్చింది లేదు. కనీసం వరదలు వచ్చినప్పుడూ నిర్వాసితులను పట్టించుకోలేదు. ప్రాజెక్టు పూర్తవ్వాలంటే తెలంగాణలోని ఏడు ముంపు మండలాలు ఏపీలో విలీనం చేయాలని అప్పట్లో ప్రధానిని ఒప్పించాం. 2014లో మేం రాక ముందు చాలా తక్కువ పరిహారం ఇచ్చారు. మేమొచ్చాక రూ.4,311 కోట్లు చెల్లించాం. 2019లో వచ్చిన జగన్‌ ప్రభుత్వం ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా మీ గురించి ఆలోచించలేదు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్వాసితుల ఖాతాల్లో రూ.829 కోట్లు జమ చేశాం. సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని పనిచేశాను. 33 సార్లు ప్రాజెక్టును సందర్శించా. 2027 నాటికి పునరావాసాలు పూర్తిచేస్తాం. కొందరి పేర్లు తొలగించారని బాధితులు చెబుతున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. అర్హులైన అందరికీ పరిహారం చెల్లిస్తాం. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత పాలకులు ఇతర అవసరాలకు మళ్లించారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తయి ఉంటే మీరు ఈ పాటికే స్థిరపడేవారు. పోలవరం హైడల్‌ ప్రాజెక్టు పూర్తయి ఉంటే రూ.2,500 కోట్లు ఆదాయం వచ్చేది. దానినీ ఆలస్యం చేయడంతో అదనపు భారం పడి ఖర్చు పెరిగింది.


ఇప్పుడా మాయమాటలు ఉండవు..

పునరావాసం కల్పించిన తర్వాత మీ ఆదాయ మార్గాలు, జీవన ప్రమాణాలు పెరగడానికి చర్యలు తీసుకుంటాం. మీరంతా ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించారు. మీరు ధైర్యంగా ఉండండి. ఇది మీ ప్రభుత్వం. మనందరి ప్రభుత్వం. మంచిని మంచిగా చెబితే మరింత మంచి జరుగుతుంది. మంచి చేసిన వారికి సహకరించకపోతే తప్పే అవుతుంది. ఈ ప్రభుత్వంలో దళారులు, దొంగలు, మోసగాళ్లు, మాయమాటలు చెప్పేవారు అసలు లేరు. చేసే పని మాత్రమే చెప్పి చేసి చూపిస్తాం. ప్రాజెక్టు కోసం గిరిజనులు ఎక్కువ త్యాగం చేశారు. ఇళ్లు నిర్మించుకునే గిరిజనులకు రూ.75 వేలు అదనంగా మన ప్రభుత్వం అందిస్తుంది. ఖర్చు పెట్టే ప్రతి పైసా మీకే చెందాలి.


886 కోట్లు కావాలి..

ప్రాజెక్టు అత్యవసర పనుల నిమిత్తం రూ.400 కోట్లు, భూసేకరణ, పునరావాస కార్యక్రమానికి రూ.486 కోట్లు అవసరమని.. మొత్తమ్మీద రూ.886 కోట్లు అందుబాటులో ఉంచాలని ఇంజనీరింగ్‌ అధికారులు సీఎంను కోరారు. పర్యటనలో ఆయన వెంట జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, సలహాదారు-ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరావు, ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ ఎస్‌.రామచంద్రారెడ్డి, జెన్‌కో ఎండీ చక్రధరబాబు, ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ నరసింహమూర్తి, మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ డైరెక్టర్‌ సుబ్బయ్య, ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, పితాని సత్యనారాయణ, సొంగా రోషన్‌ కుమార్‌, కామినేని శ్రీనివాస్‌, మాజీ మంత్రి పీతల సుజాత తదితరులు ఉన్నారు.


For More AP News and Telugu News

Updated Date - Mar 28 , 2025 | 03:15 AM