CM Chandrababu Naidu : అర్జీలూ ఆన్‌లైన్‌లో !
ABN , Publish Date - Jan 08 , 2025 | 04:25 AM
సొంత నియోజకవర్గం కుప్పం నుంచి వినూత్న ప్రయోగాలు చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
కుప్పంలో ‘జన నాయకుడు’ పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం
8 సార్లు గెలిపించిన నియోజకవర్గానికి నేను చేయాల్సింది చాలా ఉంది
నేడో రేపో టీడీపీ కోటి సభ్యత్వం
కార్యకర్తలకు ఆమోదయోగ్యమైన వారికే నామినేటెడ్ పదవులు
పార్టీ పోస్టులు కూడా ముఖ్యమైనవే
మే నెలలోగా అన్ని రకాల పదవులూ భర్తీ
గత ఐదేళ్లలో కబ్జాలు, వివక్షలు
అన్నీ సరిదిద్దడానికి 4-5 నెలలు: బాబు
కుప్పంలో రెండో రోజూ పర్యటన
నీతి నిజాయితీతో రాజకీయాలు చేయాలి. డబ్బు సంపాదించేందుకు రాజకీయాల్లోకి రావాలనే భావన పోవాలి.
ఐదేళ్ల పాటు కబ్జాలు చేశారు.. రికార్డులు మార్చారు, రాజకీయ వివక్ష చూపించారు. వ్యవస్థ విధ్వంసమైంది. అన్నీ సరిదిద్దేందుకు ఇంకా నాలుగైదు నెలలు పడుతుంది. ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటాం.
- సీఎం చంద్రబాబు
కుప్పం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): సొంత నియోజకవర్గం కుప్పం నుంచి వినూత్న ప్రయోగాలు చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు, కార్యకర్తలు ఇచ్చే అర్జీలను ఇక నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘జన నాయకుడు’ పేరుతో ఓ పోర్టల్‌ను సిద్ధం చేశారు. మంగళవారం కుప్పం నుంచే దానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్‌లో దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. మంగళవారం రెండో రోజు ఆయన కుప్పంలో బిజీబిజీగా గడిపారు. టీడీపీ కార్యాలయంలో ‘జననాయకుడు’ పోర్టల్‌ను ప్రారంభించి.. అది పనిచేసే తీరును పరిశీలించారు.
సిబ్బంది అర్జీలను ఎలా తీసుకుని నమోదు చేస్తున్నారో గమనించారు. కొన్ని అర్జీలను తానే పరిశీలించి తక్షణం పరిష్కరించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ప్రజల నుంచి సుమారు 1,090 అర్జీలను స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.ఆ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘8 సార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గానికి నేను చేయాల్సింది చాలా ఉంది. ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత నాది. ఎమ్మెల్యే హోదాలో ఇక్కడ సమస్యల పరిష్కారానికి జననాయకుడు పోర్టల్‌ను ఏర్పాటు చేసుకున్నాను. అరాచక పాలనకు వైసీపీ పరాకాష్ఠ. నాతో సహా మా శ్రేణుల మీద కేసులు పెట్టారు. రాజకీయ కక్షతో ఐదేళ్లలో మీడియాపై పెట్టిన కేసులను కూడా తొలగించేస్తాం’ అని చెప్పారు. టీడీపీ చరిత్రలో ఎప్పుడూ కోటి సభ్యత్వం నమోదు కాలేదని.. నేడో రేపో ఆ లక్ష్యాన్ని చేరుకోనున్నామని తెలిపారు. కార్యకర్తల్లో ఆమోదయోగ్యమైన వారికే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులిస్తామన్నారు. ప్రభుత్వ పదవులతోపాటు పార్టీలో ఇచ్చే పదవులు కూడా ముఖ్యమైనవేనని.. మే నెలలోగా అన్నిరకాల పదవులనూ భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
‘ఎనీవేర్’ మంచిదే కానీ..
ఎనీవేర్ రిజిస్ర్టేషన్ మంచిదేనని.. కానీ గత ఐదేళ్లలో రికార్డులను తారుమారు చేసి ఇష్టానుసారం రిజిస్ర్టేషన్లు చేసుకున్నారని సీఎం ధ్వజమెత్తారు. వాటన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. అందుకే రెవెన్యూ సదస్సులు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. గోదావరి-పెన్నా అనుసంధానం, పోలవరం-బనకచర్ల అనుసంధానం.. రాష్ట్రానికి గేమ్ చేంజర్ లాంటివి. వేల టీఎంసీలు సముద్రంలో కలిపోతున్నాయి. బనకచర్లకు నీళ్లు తెస్తే రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులకు నీళ్లు సరిపోతాయి. రాష్ట్రంలో కరువు అనేది ఉండదు’ అని తెలిపారు.
శంకుస్థాపనలు..
ఎన్టీఆర్ స్టేడియంలో మదర్ డెయిరీ, శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, కడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ల నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. చివరిగా ద్రవిడ వర్సిటీలోని అకడమిక్ బ్లాక్ కొత్త భవనా న్ని ప్రారంభించారు. రాత్రి కుప్పం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో బస చేసిన ఆయ న.. బుధవారం కుప్పం నుంచి బయల్దేరి ప్రధాని పర్యటనలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్లనున్నారు.
అప్పుడు వారు.. ఇప్పుడు వీరు!
వైసీపీ హయాంలో ప్రభుత్వ భవనాలకు ఆ పార్టీ రం గులు వేశారు. దీనిపై అప్పట్లో నానా యాగీ చేసిన టీడీపీ.. ఇప్పుడు ఆ దారిలోనే వెళుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని మున్సిపల్ కమ్యూనిటీ హాల్‌లో మెప్మా కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భవనానికి టీడీపీ రంగు వేశారు.
- నరసరావుపేట, ఆంధ్రజ్యోతి