Share News

Land value: రేపట్నుంచి భూముల విలువ పెంపు

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:32 AM

భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల విలువలు రేపటి నుంచి పెరగనున్నాయి. ఇందుకు అనుగుణంగా రిజిస్ర్టేషన్‌ ఛార్జీల ధరలూ పెర గనున్నాయి.

Land value: రేపట్నుంచి భూముల విలువ పెంపు
చిత్తూరులోని రిజిస్ర్టేషన్‌ కార్యాలయం

చిత్తూరు, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల విలువలు రేపటి నుంచి పెరగనున్నాయి. ఇందుకు అనుగుణంగా రిజిస్ర్టేషన్‌ ఛార్జీల ధరలూ పెర గనున్నాయి. ఇప్పటికే భూముల విలువలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 10 శాతం వరకు, విలువ తక్కువగా వున్న ప్రాంతాల్లో 20 శాతం వరకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల వారీగా పెరిగిన వివరాలను జిల్లా రిజిస్ర్టార్‌ కార్యాలయంలో అన్‌లైన్‌ చేస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి పెరిగిన ఆస్తులకు అనుగుణంగా కొత్త లెక్కల ప్రకారం రిజిస్ర్టేషన్లు చేయనున్నారు.

వైసీపీ హయాంలో నాలుగుసార్లు..

వైసీపీ ప్రభుత్వం నాలుగుసార్లు భూముల విలువను పెంచింది. 2020 ఆగస్టులో, 2022 ఫిబ్రవరిలో, ఏప్రిల్‌లో భూముల ధరల్ని పెంచగా, 2024 జూన్‌ 1 నుంచి కూడా పెంచుతున్నట్లు ఆదేశాలిచ్చింది. 2021 లో కరోనా కారణంగా పెంపు జోలికి వెళ్లలేదు. మిగిలిన ప్రతిసారీ 10 నుంచి 40 శాతం వరకు పెంచింది. వైసీపీ ఇష్టానుసారంగా భూముల ధరల్ని పెంచేయడంతో క్రయ విక్రయదారులపై పెనుభారం పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం 10-20 శాతం మధ్యలో పెంపుదలను పరిమితం చేసింది.

ఎక్కడెక్కడ ఎంత పెరుగుతుందంటే?

పుంగనూరు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలో 80 రెవెన్యూ గ్రామాలుండగా, నాలుగేళ్లుగా భూముల విలువ పెరగని 65 గ్రామాల్లో 20 శాతం, మిగిలిన 15 గ్రామాల్లో 15 శాతం పెంచుతున్నారు. పలమనేరు కార్యాలయ పరిధిలో 87, బంగారుపాళ్యం పరిధిలో 46, నగరి పరిధిలో 42 రెవెన్యూ గ్రామాలుండగా, అన్ని చోట్లా 15నుంచి 20 శాతం విలువలు పెరగనున్నాయి. చిత్తూరు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలో 10- 20 శాతం మధ్యలో పెంచతున్నారు.


ఎకరాల్లో లెక్కేసే భూముల విలువల్ని సగటున 15 శాతం పెంచగా.. ఇంటి స్థలాల ధరల్ని 10 శాతం పెంచారు. చాలాకాలంగా పెంచని ప్రాంతాల విలువల్ని మాత్రమే 20 శాతం వరకు పెంచారు.

జాతీయ రహదారుల పక్కనున్న భూములకు ఎకరా రూ.7.20 లక్షల నుంచి రూ.8.28 లక్షలకు పెంచనున్నారు. అంటే 15 శాతం విలువ పెరిగింది.

యాదమరి మండల కేంద్రంలో ఎకరా రూ.4.60 లక్షల నుంచి రూ.5.20 లక్షలకు, చిత్తూరు రూరల్‌ మండలం దిగువమాసాపల్లెలో ఎకరా రూ.3.33 లక్షలు ఉండగా.. రూ.3.83 లక్షలకు పెంచారు. అంటే ఇక్కడ కూడా 15 శాతానికే పెంచారు.అదే విధంగా చదరపు గజం, చదరపు అడుగుల్లో కొలిచే ఇంటి స్థలాలకు.. ఇప్పటికే ఎక్కువగా విలువ ఉన్నవాటికి 10 శాతమే పెంచారు. చిత్తూరు ప్రకాశం రోడ్డులో చదరపు గజం ధర రూ.46,950 ఉండగా, 10 శాతం అంటే రూ.51,645కు పెంచారు. అలాగే నాయుడు బిల్డింగ్స్‌లో చ.గ ధర రూ.16260 ఉండగా.. 10 శాతం పెంచి రూ.17900 చేశారు.

కుప్పానికి వెసులుబాటు

కుప్పం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలో అత్యధికంగా 221 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఈ కార్యాలయం పరిధిలో విలువ పెంపుదల విషయంలో కాస్త వెసులుబాటు ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నియోజకవర్గం కావడం, ఇప్పటికే కొన్ని పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు కావడం, భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉండడం వంటి కారణాలతో ఇక్కడ పెద్దగా భూముల విలువల్ని పెంచడం లేదని తెలుస్తోంది.

Updated Date - Jan 31 , 2025 | 12:32 AM