Share News

CM Chandrababu: మోయలేనన్ని పాపాలు!

ABN , Publish Date - Jan 02 , 2025 | 04:59 AM

రాష్ట్రాన్ని జగన్‌ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వెళ్లిపోయారని.. పళ్ల బిగువున ఆ సమస్యలను భరిస్తూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

CM Chandrababu: మోయలేనన్ని పాపాలు!

అవన్నీ మేమే మోయాలంటే కుదరదు: చంద్రబాబు

జగన్‌ హయాంలో సర్వం నాశనం.. రాత్రికి రాత్రే సరిదిద్దలేం.. కొంత టైం పడుతుంది

ఆర్థిక పరిస్థితి కుప్పకూలినా పళ్ల బిగువున లాక్కొస్తున్నాం

జగన్‌ మళ్లీ వస్తే ఎలాగని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు

ఇక రానే రాడని చెబుతున్నాం.. 6 నెలల్లో రూ.4 లక్షల కోట్ల

పెట్టుబడులు సాధించాం.. రాష్ట్ర చరిత్రలో ఇదో రికార్డు

విద్యుత్‌ ధర రూ.4.80కి తగ్గించేందుకు కృషి చేస్తున్నాం

అదానీ వ్యవహారంలో తుది నివేదిక కోసం చూస్తున్నాం

ఇక ఆకస్మిక తనిఖీలు ఉంటాయ్‌.. ప్రభుత్వ వేగం పెంచుతాం

మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్‌చాట్‌

ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు ప్రజల్లో పార్టీ ఇమేజ్‌ కాపాడుకోవాలి ఎంత స్థాయివారు తప్పుచేసినా ఊరుకోం మా వాళ్లకు కౌన్సెలింగ్‌ మొదలుపెట్టా: బాబు

అమరావతి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని జగన్‌ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వెళ్లిపోయారని.. పళ్ల బిగువున ఆ సమస్యలను భరిస్తూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మోయలేనన్ని పాపాలు ఆయన చేశారని.. సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. ‘ఆయన చేసిన పాపాలన్నీ మమ్మల్నే మోసి మునిగి పొమ్మంటే సాధ్యం కాదు. రాత్రికి రాత్రి సరిదిద్దడానికి మా దగ్గరేమీ మంత్రదండం లేదు. దిద్దుబాటుకు కొంత సమయం పడుతుంది’ అని తెలిపారు. కొత్త సంవత్సరం తొలి రోజు ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన.. మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటీ మాట్లాడారు. ‘రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మేం పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతుంటే మళ్లీ జగన్‌ వస్తే ఎలాగని అడుగుతున్నారు. ఇక రానే రాడని కచ్చితంగా చెబుతున్నాం. పారిశ్రామికవేత్తల చెయ్యి మెలిపెట్టి వాటాలు రాయించుకోవడం, జే ట్యాక్స్‌ కట్టించుకోవడం ఈ ప్రభుత్వంలో లేవు. అవి చేసినవారు ఇక రారు’ అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని, రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల నుంచి తీవ్రమైన పోటీ ఉన్నా తట్టుకుని వీటిని తెచ్చామన్నారు. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో పెట్టే బీపీసీఎల్‌ రిఫైనరీ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 75 శాతం వాళ్లకు తిరిగి ఇవ్వడానికి అంగీకరించి దానిని సాధించామని చెప్పారు.

juikl.jpg

ఆ రిఫైనరీ వస్తే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని, ఉద్యోగాలు రావడంతోపాటు పెద్ద సంఖ్యలో అనుబంధ పరిశ్రమలు వస్తాయని వివరించారు. జగన్‌ హయాంలో ఒక్క విద్యుత్‌ రంగంపైనే రూ.1.25 లక్షల కోట్ల భారం పడిందన్నారు. ఆ భారం తగ్గించుకోవడానికి అడ్డగోలుగా కరెంటు బిల్లులు పెంచేశారని విమర్శించారు. ‘ప్రస్తుతం కరెంటు కొనుగోలు ధర యూనిట్‌కు రూ.5.18గా ఉంది. దానిని ఈ ఏడాదిలో రూ.4.80కి తేవాలని నిర్ణయించాం. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలూ వెతికి పట్టుకుని ప్రజలపై భారం తగ్గించాలని ప్రయత్నిస్తున్నాం. రాబోయే రోజుల్లో కొత్తగా చార్జీలు పెంచకుండా చూస్తాం’ అని తెలిపారు. బెనిఫిట్‌ షోలకు తెలంగాణ సర్కారు అనుమతులు నిలిపివేసినా ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడానికి సినీ రంగం నుంచి వచ్చిన విజ్ఞప్తులు కారణమా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. ‘మనం దృష్టి పెట్టాల్సిన పెద్ద పెద్ద అంశాలు వేరే ఉన్నాయి. వాటిపై పనిచేయడం మాకు ప్రయారిటీ’ అని వ్యాఖ్యానించారు. ఇంకా ఏమన్నారంటే..


ఖాళీ చిప్ప చేతికిచ్చారు..

ఈ ఏడాది మొత్తానికి రాష్ట్రం తెచ్చుకోవలసిన రుణం మొత్తాన్ని వాళ్లున్న రెండు నెలల్లోనే తెచ్చేసి వాడేసి ఖాళీ చిప్ప చేతికి చ్చి వెళ్లారు. కొత్తగా అప్పు తెచ్చుకోవడానికి కూడా దారి లేకుండా చేశారు. ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రెండేళ్ల నిధులను ముందే తీసేసుకుని ఖర్చు పెట్టేశారు. దాని నుంచి కూడా వచ్చే పరిస్థితి లేదు. కేంద్ర ఆర్థిక సాయంతో నడిచే 93 పథకాల కింద నిధులు తీసుకుని దారి మళ్లించారు. ఆ పథకాలన్నీ ఆగిపోయాయి. గతంలో ఇచ్చిన నిధులు ఆ పథకాలకు ఖర్చు చేసినట్లు చూపిస్తేనే మళ్లీ కొత్తగా నిధులు వస్తాయి. దీంతో రూ.950 కోట్లు విడుదల చేసి.. ఆర్థిక సంఘం పనుల కోసం ఖర్చు చేసిన రుజువులు చూపించి.. తర్వాతి విడత నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవలసి వచ్చింది. ఈ మాదిరిగా ఇప్పటికి 74 కేంద్ర పథకాలను మళ్లీ దారిలో పెట్టాం. ఢిల్లీకి నాలుగైదుసార్లు వెళ్లి మన పరిస్థితి వివరించాను. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను దారిలో పెట్టాం. అభివృద్ధి, సంక్షేమాలను బ్యాలెన్స్‌ చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకే పేదల పింఛన్లు రూ.4 వేలకు పెంచాం. ఒక్క ఈ పద్దు కింద ఖర్చే రూ.33 వేల కోట్లు అవుతోంది. దేశంలో ఏ రాష్ట్రమూ ఇంత ఇవ్వడం లేదు. గుజరాత్‌ వంటి రాష్ట్రాలు రూ.1,000 లోపే ఇస్తున్నాయి. అన్న క్యాంటీన్లు తెరిచాం. దీపం పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నాం. ఇంకా ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటివి ఇవ్వాలి. ఒకదాని వెంట ఒకటి ఇస్తాం. మేం సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రకటించినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాకున్న అంచనా వేరు. కానీ అధికారంలోకి వచ్చాక లోతుగా చూస్తే ఎంత ఘోరంగా ఉందో తెలిసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంత లోతుగా మాకు తెలియదు. అయినా జగన్‌ మాదిరిగా మేం దులపరించుకుని పోదలచుకోలేదు. ఉద్యోగులకు వారంలోగా సీపీఎస్‌ రద్దుచేస్తానని హామీ ఇచ్చి.. తర్వాత దాని గురించి అవగాహన లేక చెప్పామని ఆయన దులిపేసుకొన్నాడు. మద్య నిషేధం గురించి ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పి తర్వాత మాట మార్చేశాడు. ఇసుక తక్కువ రేటుకు దొరికే ఏర్పాటు చేస్తానని చెప్పి తన జేబులు నింపుకొన్నాడు.

ఎవరు తప్పుచేసినా కఠినంగా ఉంటాం..

మా ఎమ్మెల్యేలకు కౌన్సెలింగ్‌ ప్రారంభించాం. వారిని పిలిచి మాట్లాడుతున్నాం. ఇప్పటికే కొందరితో మాట్లాడాను. ప్రజల్లో పార్టీ ఇమేజ్‌ కాపాడుకోవాలి. ఎంత స్థాయివారు తప్పుచేసినా ఊరుకునేది లేదు. ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. తప్పు ఎమ్మెల్యేలు చేసినా.. అధికారులు చేసినా.. కింది స్థాయిలో నాయకులు, కార్యకర్తలు చేసినా కఠినంగా ఉంటాం. వారివల్ల పార్టీకి చెడ్డపేరు వస్తే సహించేది లేదు. ఆ విషయంలో బాధ్యతగా ఉండడం వల్లే టీడీపీ 40 ఏళ్లుగా ప్రజల్లో నిలిచి ఉంది. మా పార్టీలో కూడా కొందరు ఆవేశపూరితంగా తమ అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. నాయకుడిగా అందరి అభిప్రాయాలూ తెలుసుకుని నా నిర్ణయం నేను చేయాలి. పొత్తులపై మా కేడర్‌ అభిప్రాయం ఒకలా ఉండేది. నా నిర్ణయం మరొక రకంగా ఉంది. ప్రతివారూ తమ ఎజెండానే అమలు చేయాలంటే సాధ్యం కాదు. మేం దీర్ఘకాలిక వ్యూహంతో పని చేయాలనుకుంటున్నాం. హైదరాబాద్‌ను దేశంలో మ రే నగరం కానంత అభివృద్ధి చేసినా ఎన్నికల్లో ఓడిపోయాను. అన్ని ఇజాలు పోయి ఇప్పుడు మెటీరియలిజం వచ్చింది. మాకేం చేస్తావో ముందు అది చెప్పు అని అంటున్నారు.


కూటమిలో మాట్లాడుకుంటున్నాం..

వైసీపీలో అవినీతి ఆరోపణలకు గురైన నేతలు కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరి షెల్టర్‌ తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మిత్రులం అంతర్గతంగా మాట్లాడుకుంటున్నాం. యథాలాప వ్యాఖ్యలు సరికాదు. చరిత్రలో లేని విధంగా ఈసారి టీడీపీ సభ్య త్వం కోటికి చేరువవుతోంది. ఎమ్మెల్యేల పనితీరు బాగున్న నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు బాగా జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మా పార్టీ నేతలు, కేడర్‌ చాలా బాగా పనిచేశారు. కానీ పని చేసిన వారు ఉన్నంత సంఖ్యలో పదవులు లేవు. అయినా నీటి సంఘాలు, సహకార సొసైటీలు, మార్కె ట్‌ కమిటీలు, దేవాలయ కమిటీలు, స్థానిక సంస్థలు వంటి వాటిలో సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం.

బీసీలకు పెద్దపీట..

ఈసారి బీసీ వర్గాలకు ప్రభుత్వంలో బాగా ప్రాధా న్యం ఇస్తున్నాం. చరిత్రలో మొదటిసారి రాష్ట్రంలో బీసీ వర్గానికి వ్యక్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేశాం. డీజీపీ కూడా అదే వర్గాలకు చెందిన వ్యక్తి. మా పార్టీ అధ్యక్షుడు కూడా బీసీయే. మంత్రివర్గంలో కూడా వారికి బాగా పెద్ద ప్రాతినిధ్యం ఇచ్చాం.

త్వరలో ఆకస్మిక తనిఖీలు

త్వరలో నా ఆకస్మిక తనిఖీలు మొదలవుతాయి. ప్రభుత్వ శాఖల్లో పనితీరు ప్రమాణాలు మెరుగుపరుస్తాం. ప్రభుత్వ పనితీరులో వేగం పెంచుతాం. 150 రకాల సేవలను వాట్సాప్‌ ద్వారా పొందే ఏర్పాటు చేస్తున్నాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద క్యూ ఆర్‌ కోడ్‌ పెట్టి.. అధికారులు, ఉద్యోగుల పనితీరుపై ప్రజలు ఫీడ్‌ బ్యాక్‌ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. పింఛన్ల పంపిణీని పరిశీలించే టెక్నాలజీ ప్రవేశపెడుతు న్నాం. తాజా సర్వే ప్రకారం 7 శాతం లబ్ధిదారులను కొంత దూరం పిలిపించారు. ఎందుకలా చేశారో కారణాలు కనుక్కుంటున్నాం. ధాన్యం కొనుగోలు సమయంలో తేమ శాతాన్ని సరిగ్గా లెక్కవేయడానికి కొత్త పరికరా లు సరఫరా చేస్తాం. ధాన్యం మిల్లుకు చేరిన వెంటనే రైతు ఖాతాలో డబ్బు పడేలా చూస్తాం. సామాన్య ప్రజలు తమ సమస్యను తెలపడానికి నోటితో చెబితే రికార్డయి.. సంబంధిత శాఖకు వెళ్లే కృత్రిమ మేధ(ఏఐ) టెక్నాలజీని ప్రవేశపెట్టబోతున్నాం.


మెతక వ్యక్తిని కాదు..

మా ప్రభుత్వం కావాలని రాజకీయ కోణంలో ఎవరినీ వేధించదు. అదే సమయంలో తప్పులు చేసిన వారిని ఉపేక్షించదు. నేను 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజాన్ని కఠినంగా అణచివేశాను. నేను మెతక వ్యక్తినైతే వీటిని అణచివేయలేను. రాజకీయ కక్ష సాధింపులకు మేం వ్యతిరేకం. కానీ దోచుకున్న వారిని వదిలిపెట్టం. ఒకట్రెండు అవినీతి కేసుల్లో అరెస్టులు కూడా కాకముందే నిందితులకు బెయిల్‌ ఎలా వచ్చిందో సమీక్ష చేస్తాం.

అమెరికా తుది నివేదిక కోసం..

విద్యుత్‌ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అదానీ కంపెనీలపై అమెరికా ప్రభుత్వం నమోదు చేసిన కేసులో తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం. ఈ కేసు నాకు లడ్డూ మాదిరిగా దొరికిందని మీరు అనుకోవచ్చు. కానీ నాకు విశ్వసనీయత ముఖ్యం. రేపు అమెరికా ప్రభుత్వం కాదంటే ఇబ్బంది పడాలి. అందుకే తుది నివేదిక కోసం చూస్తున్నాం.

సినిమా రంగంపై అమరావతి ప్రభావం!

భవిష్యత్‌లో సినిమా రంగంలో అమరావతి కూడా ప్రభావం చూపే ప్రాంతం అవుతుంది. మొదట్లో ఈ రం గానికి బెజవాడ కేంద్ర స్థానంగా ఉండేది. స్టూడియోలు, నటులంతా మద్రాసులోనే ఉన్నా.. సినిమా పంపిణీ సం స్థలు, ఇతర సంస్థలు బెజవాడలోనే ఎక్కువగా ఉండేవి. ఆ రంగంలో హైదరాబాద్‌ ప్రాముఖ్యం విస్తరించింది. ఇప్పుడు పరిస్థితి ఇంకా మారింది. భవిష్యత్‌లో అమరావతి కూడా ప్రభావం చూపించే స్థాయికి రావచ్చు.

నిన్న నరసరావుపేట, ఈ రోజు కనకదుర్గమ్మ గుడికి వెళ్లినప్పుడు నా పట్ల ప్రజల స్పందన చూసి చాలా ఆనందం కలిగింది. నేను ఏదో చేస్తానన్న నమ్మకం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అది నా బాధ్యతను మరింత పెంచుతోంది.

బీజేపీ గుజరాత్‌లో వరుసగా ఏడు సార్లు, కేంద్రం, హరియాణాలోనూ వరుసగా మూడుసార్లు గెలిచింది. అది ఎలా సాధ్యమైం దో అధ్యయనం చేస్తున్నాం. పని చేయడం ఒకటే చాలదు. ప్రజలు నిరంతరం మనతో ప్రయాణం చేసేలా చూసుకోవాలి.

- సీఎం చంద్రబాబు

Updated Date - Jan 02 , 2025 | 04:59 AM