Share News

CM Chandrababu: ప్రతి ఇల్లు, గ్రామం ఆనందంగా ఉండాలి

ABN , Publish Date - Jan 16 , 2025 | 04:44 AM

సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి ప్రజలు తమ సొంత గ్రామాలకు వస్తున్నారని, ఇదొక మంచి సంప్రదాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

CM Chandrababu: ప్రతి ఇల్లు, గ్రామం ఆనందంగా ఉండాలి

  • అందుకోసమే స్వర్ణాంధ్ర విజన్‌-2047

  • సంక్రాంతికి సొంతూళ్లకు రావడం మంచి సంప్రదాయం

  • అన్ని వర్గాల అభివృద్ధికి సూపర్‌ సిక్స్‌: బాబు

తిరుపతి, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి ప్రజలు తమ సొంత గ్రామాలకు వస్తున్నారని, ఇదొక మంచి సంప్రదాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రతి ఇల్లు, ప్రతి గ్రామం ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌-2047ని రూపొందిం చామని తెలిపారు. పండుగ జరుపుకోవడానికి కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులతో కలసి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని తన స్వగ్రామం నారావారిపల్లెకు ఈ నెల 12న వచ్చిన ఆయన సోమ, మంగళవారాలు అక్కడ గడిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. శంకుస్థాపనలు కూడా చేశారు. మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్ర సీఎంగా ఉన్నపుడు తానిచ్చిన విజన్‌-2020 కారణంగానే తెలంగాణ ఇప్పుడు దేశంలోనే అధిక తలసరి ఆదాయం పొందుతోందని గుర్తు చేశారు. ప్రపంచం మొత్తమ్మీద తెలుగువారు ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారని, అదే సమయంలో ప్రపంచంలో గొప్ప పెట్టుబడిదారులుగానూ ఎదుగుతున్నారని చెప్పారు. సంపన్న, ఆరోగ్య, ఆనంద సమాజం కోసం విజన్‌-2047 తెచ్చామని.. ఆ దిశగా తమ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తోందని వివరించారు. ‘అన్ని వర్గాలను అభివృద్ధి పరిచేందుకు సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తున్నాం.


ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను రూ.4వేలు, రూ.6 వేలు, రూ.10 వేలు, రూ.15 వేలకు పెంచి ఇస్తున్నాం. రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్ల కోసం ఏటా రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఐవీఆర్‌ఎస్‌ టెక్నాలజీ ఉపయోగించి ఫీడ్‌బ్యాక్‌ పరిశీలిస్తే దేశం మొత్తమ్మీద ఏపీలోనే సంతృప్తికరంగా పెన్షన్‌ విధానం అమలవుతోంది. 199 అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.5కే భోజనం అందిస్తున్నాం. భవిష్యత్‌లో ప్రతి నియోజకవర్గంలో ఒక క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తాం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.996 కోట్ల బకాయిలు చెల్లించాం. ఉద్యోగులు, పోలీసులు, చిన్న కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న రూ.6,700 కోట్లను పండుగ కానుకగా విడుదల చేశాం. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద బాధితులకు రూ.125 కోట్లు ఇచ్చాం. ధాన్యం కొనుగోలు పెండింగు బకాయిలు రూ.1,600 కోట్లు విడుదల చేయడంతో పాటు తాజాగా కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లో రూ.6,655 కోట్లు చెల్లించాం. అన్ని వ్యవస్థలనూ గాడిలో పెడుతున్నాం. అందరికీ న్యాయం చేస్తాం’ అని స్పష్టం చేశారు. జీవితంలో అభివృద్ధి చెందినవారు, తమ తోటి వారికి సహకారమందించాలని మరోసారి పిలుపిచ్చారు. సమావేశంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌, రాష్ట్ర యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహయాదవ్‌, టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని రాత్రి 7 గంటలకు విజయవాడ బయల్దేరి వెళ్లారు.


గ్రామదేవతలకు పూజలు.. అమ్మానాన్నకు నివాళులు

సొంతూరులో మంగళవారం చంద్రబాబు సంక్రాంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పంచెకట్టు కట్టి.. సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌, రామ్మూర్తినాయుడి కుటుంబసభ్యులు, నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ కుటుంబసభ్యులు తదితరులతో కలిసి గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు పూజలు నిర్వహించారు. కులదైవం నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 11.25 గంటలకు చంద్రబాబు తన తల్లితండ్రులు ఖర్జూరపునాయుడు, అమ్మణమ్మ సమాధులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలను ఆవిష్కరించారు. తర్వాత ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సాయంత్రం 4 గంటలకు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లో నారావారిపల్లె క్లస్టర్‌ గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 04:44 AM