AP Govt : ‘నాడు-నేడు’పై ఆడిట్
ABN , Publish Date - Jan 08 , 2025 | 03:47 AM
ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశామని ప్రచారం చేసుకున్న వైసీపీ సర్కారు అసలు రంగు బయటపడుతోంది. జగన్ హయాంలో ‘నాడు-నేడు’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చేసిన ఖర్చుల లెక్కలు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.
పాఠశాలల్లో పనుల లెక్క తేల్చనున్న ప్రభుత్వం
వైసీపీ హయాంలో 8,230 కోట్లు ఖర్చు
అయినా ఒక్క పాఠశాలకూ దక్కని 5 స్టార్ రేటింగ్
87 పాఠశాలలకు జీరో రేటింగ్
భారీగా నిధులు ఖర్చయినా కనిపించని ఫలితాలు
పనులపై సర్వత్రా అనుమానాలు
పథకం నిధులు 3 వేల కోట్ల దారి మళ్లింపు
(అమరావతి, ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశామని ప్రచారం చేసుకున్న వైసీపీ సర్కారు అసలు రంగు బయటపడుతోంది. జగన్ హయాంలో ‘నాడు-నేడు’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చేసిన ఖర్చుల లెక్కలు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఆ పనులపై రాష్ట్రవ్యాప్తంగా ఆడిట్ చేపట్టనుంది. ఏ పాఠశాలకు ఎన్ని నిధులు కేటాయించారు? వాటిలో ఎంత ఖర్చుచేశారు? ఎలాంటి మార్పు వచ్చింది? చేసిన ఖర్చుకు, కనిపిస్తున్న పనులకు లెక్క సరిపోతుందా? అనే కోణంలో తనిఖీలు చేయనున్నారు. అలాగే నాడు-నేడు పనులు జరిగిన 38,024 పాఠశాలల్లో ఆడిట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వంలో రెండు విడతల్లో కలిపి రూ. 8,230 కోట్లు నాడు-నేడు పథకానికి ఖర్చు చేయగా, ఆ స్థాయిలో ఫలితాలు బడు ల్లో కనిపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై తనిఖీలు అవసరమ ని కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో మొత్తం పథకంపై ఆడిట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత వాస్తవ అవసరాల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
రేటింగ్‌తో బట్టబయలు
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, అకడమిక్ అంశాలపై ప్రభుత్వం ఇటీవల వేర్వేరుగా స్టార్ రేటింగ్ ఇచ్చింది. మౌలిక సదుపాయాలపై 5 స్టార్, అకడమిక్‌పై 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. అన్ని పాఠశాలల్లో సదుపాయాలపై అంచనా వేసి ఈ రేటింగ్ ఇవ్వగా రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క పాఠశాల కూడా 5 స్టార్ రేటింగ్ సాధించలేదు. కనీసం 30 శాతం సదుపాయాలు కూడా లేక 87 పాఠశాలలు జీరో రేటింగ్‌తో సరిపెట్టుకున్నాయి. 1,958 పాఠశాలలు ఒక స్టార్, 16,816 పాఠశాలలు 2స్టార్లు, 19,438 పాఠశాలలు 3 స్టార్లు, 6,788 పాఠశాలలు 4 స్టార్లు రేటింగ్ సాధించాయి. ఒక్క పాఠశాల కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించలేదు. దీంతో పాఠశాలల్లో చేసిన వేల కోట్లు ఖర్చు ఏమైందనే అనుమానాలున్నాయి.
అవసరం లేకపోయినా పనులు
నాడు- నేడు పథకం అంచనాల్లోనే వైసీపీ ప్రభుత్వం తప్పటడుగులు వేసింది. ఏ పాఠశాలలో మౌలిక సదుపాయాలు అవసరం? ఎక్కడ అవసరం లేదు? అనే విషయంలోనే పొరపాట్లు చేసింది. అనేక ప్రాథమిక పాఠశాలల్లో పథకం అమలుచేసిన తర్వాత విద్యార్థులు లేని పరిస్థితి ఏర్పడింది. అలాగే వేల సంఖ్యలో పాఠశాలల్లో పనులు చేశాక అక్కడి 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది.
దారిమళ్లిన నిధులు
రెండో విడత నాడు-నేడు పనులకు రూ.8 వేల కోట్లు అవసరమ వుతాయని వైసీపీ ప్రభుత్వం అంచనా వేసింది. నాబార్డు నుంచి రూ.3,025 కోట్ల రుణం, కేంద్ర పథకం ఎస్‌ఏసీవై నుంచి రూ. 3,561 కోట్లు గ్రాంట్ పొందింది. ప్రపంచ బ్యాంకు ఈ పథకం కోసం రూ.425 కోట్లు రుణంగా ఇచ్చింది. ఈ మొత్తం రూ.7,011 కోట్లు కాగా, సార్వత్రిక ఎన్నికల నాటికి వైసీపీ ప్రభుత్వం రూ. 4,177 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. దాదాపు రూ.3 వేల కోట్లను ఇతరత్రా పథకాలు, బిల్లుల చెల్లింపులకు మళ్లించింది.
ప్రగల్బాలే మిగిలాయి
నాడు- నేడు పథకంలో మూడు విడతల్లో మొత్తం 45 వేల ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని అప్పట్లో వైసీపీ ప్రగల్భా లు పలికింది. ఐదేళ్లలో రెండో విడత పనులు కూడా పూర్తిచేయలేకపోయింది. పైగా ప్రారంభించిన పనులను సగంలోనే వదిలేసింది. ఈ పథకానికి సమీకరించిన రుణాలను పక్కదారి పట్టించింది. కాగా తొలి విడతలో 15,713 పాఠశాలల్లో పనులు చేపట్టి, అందుకోసం రూ. 3,870 కోట్లు ఖర్చుచేసింది. రెండో విడతలో 22,311 పాఠశాలల్లో పనులకు రూ. 4,360 కోట్లు ఖర్చు చేసింది.