Amaravati Towers Tender: సచివాలయం, ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:20 AM
అమరావతిలో సచివాలయం, ఐకానిక్ జీఏడీ టవర్ల నిర్మాణానికి సీఆర్డీఏ రూ.4,668 కోట్లతో టెండర్లు పిలిచింది.మే 1న టెక్నికల్ బిడ్లను తెరవనున్నారు
రూ.4,668 కోట్లతో డయాగ్రిడ్ మోడల్‌లో నిర్మాణం
మే 1న టెక్నికల్ బిడ్లను తెరవనున్న సీఆర్డీఏ
విజయవాడ, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): అమరావతిలో నిర్మించతలపెట్టి న సచివాలయం, జీఏడీ ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. సచివాలయం కోసం 4 టవర్లు, జీఏడీ టవర్‌కు వేర్వేరుగా టెండర్ నోటిఫికేషన్లు ఇచ్చింది. మొత్తంగా రూ.4,668 కోట్లతో 5 టవర్లను డయాగ్రి డ్ మోడల్‌లో నిర్మించనున్నారు. సచివాలయ 4 టవర్లను బేస్‌మెంట్+39 ఫ్లోర్లు+టెర్రస్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో 1, 2 టవర్లను 28,41,675 చదరపు అడుగుల విస్తీర్ణం, 3, 4 టవర్లను 23,42,956 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించనున్నారు. సీఎం కార్యాలయం ఉండే కీలకమైన జీఏడీ టవర్‌ను బేస్‌మెంట్+47 ఫ్లోర్లు+హెలిప్యాడ్‌తో కలిపి మొత్తం 17,00,3000 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. జీఏడీ టవర్ నిర్మాణానికి రూ.1,126 కోట్లు, సచివాలయం ఒకటి, రెండు టవర్ల నిర్మాణానికి రూ.1,897 కోట్లు, సచివాలయం టవర్ల కోసం రూ.1,664 కోట్లతో వేర్వేరుగా టెండర్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మే 1వ తేదీన సచివాలయం, జీఏడీ టవర్ల టెక్నికల్ బిడ్లను సీఆర్డీఏ తెరవనుంది.