YS Sunitha Reddy : వివేకా హత్య కేసు విచారణ తీవ్ర ఆలస్యం
ABN , Publish Date - Jan 31 , 2025 | 04:03 AM
వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి అన్నారు.

6 నెలల్లో పూర్తిచేసేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వండి
తెలంగాణ హైకోర్టులో వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్
విచారణ 4వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం
హైదరాబాద్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి అన్నారు. సమీప భవిష్యత్తులో విచారణ ప్రారంభమయ్యే ఆనవాళ్లు కనిపించడంలేదని.. ఆరు నెలల్లో ట్రయల్ మొత్తం పూర్తిచేసేలా నాంపల్లి సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీచేయాలని ఆమె తెలంగాణ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో సీబీఐతోపాటు నిందితులు టి.గంగిరెడ్డి, వై.సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరి (అప్రూవర్), డి.శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్‌గౌతమ్ వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయి రెండేళ్లు దాటినా ఇంకా సీఆర్పీసీ 207 దశ (ప్రాసిక్యూషన్ పత్రాల కాపీలను నిందితులకు అందజేయడం)లోనే ఉందని పేర్కొన్నారు. సీబీఐ సమర్పించిన హార్డ్‌డి్‌స్కల్లో 13 లక్షల ఫైల్స్ ఉండగా ఇప్పటివరకు 13,717 ఫైల్స్ మాత్రమే ఓపెన్ చేశారన్నారు. ఇలాగే.. రోజుకు 500 ఫైల్స్ చొప్పున ఓపెన్ చేసుకుంటే పోతే మరో ఏడేళ్లయినా ట్రయల్ ప్రారంభం కాదని చెప్పారు. ఈ కేసులో సాక్షి వైఎస్ అభిషేక్‌రెడ్డి తాజాగా మరణించారని తెలిపారు. ట్రయల్ ప్రారంభం కాకపోతే ఇబ్బందులు వస్తాయని, నిందితులందరికీ నోటీసులు జారీచేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘నిందితులకు నోటీసులిస్తే ఏం లాభం.. మేం ట్రయల్‌కు సహకరిస్తున్నాం’ అని చెబుతారని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపడతామని పేర్కొంటూ విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే
Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News