Tirumala Temple Security: టీటీడీకి డ్రోన్ వర్రీ
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:52 AM
తిరుమల ఆలయంపై డ్రోన్లు సంచారం భద్రతా సవాలు, యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు పై టీటీడీ సమీక్ష. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంతో డ్రోన్లు తిరుమల చేరడం, యాంటీ డ్రోన్ చర్యలు తీసుకునే నిర్ణయం
క్షేత్ర భద్రతకు సవాలు విసురుతున్న డ్రోన్లు
కొండపైకి తేవడంపై ఏళ్ల క్రితమే నిషేధం
అలిపిరిలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల
డ్రోన్లతో తిరుమలకు వచ్చేస్తున్న భక్తులు
వరుస ఘటనలతో అధికారుల్లో కలవరం
యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటుపై కసరత్తు
వచ్చే బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం
(తిరుమల-ఆంధ్రజ్యోతి)
తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ల సంచారం క్షేత్ర భద్రతకు సవాలు విసురుతోంది. ఈ అంశం టీటీడీ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలోనే యాంటీ డ్రోన్ సిస్టమ్ ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయ విమాన గోపురంపై విమానాల రాకపోకలు నిషేధం. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని ఇప్పటికే టీటీడీ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడికి సైతం ఇదే విషయమై లేఖ రాసింది. ఈ అంశం కేంద్రం, టీటీడీ మధ్య నలుగుతుండగానే గత ఐదారేళ్లుగా తిరుమల కొండపై డ్రోన్ల సంచారం అధికారులను కలవరపెడుతోంది. భక్తులు డ్రోన్లతో కొండపైకి రావడాన్ని టీటీడీ కొన్నేళ్ల క్రితమే నిషేధించింది. అయితే అలిపిరి భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంతో కొందరు డ్రోన్లతో నేరుగా తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ కారణంగా శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో అనేకమార్లు డ్రోన్లు ఎగిరిన ఘటనలు చేటుచేసుకున్నాయి.
అసాంఘిక శక్తులైతే?
ఇప్పటివరకు తిరుమలలో డ్రోన్లను ఎగువేసిన వ్యక్తులకు మరో ఉద్దేశమేమీ లేదని వెల్లడైంది. ఒకవేళ వారిలో అసాంఘిక శక్తులు ఉంటే కొండపై భద్రత పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పత్నమవుతున్నాయి. తిరుమలకు ఉగ్ర ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అలిపిరిలో భద్రత తనిఖీలు దాటుకుని మరీ డ్రోన్లు తరచూ క్షేత్రంపై సంచరించడం పెనుప్రమాదాలకు దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజా డ్రోన్ ఘటనతో యాంటీ డ్రోన్ సిస్టమ్స్‌పై టీటీడీ మళ్లీ దృష్టి సారించింది. వాస్తవానికి 2021లోనే తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని భావించినా... అమలు కాలేదు. ఆ తర్వాత సోషల్ మీడియాలో డ్రోన్ విజువల్స్ ప్రత్యక్షనప్పుడు అప్పటి అధికారులు నావల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ (ఎన్‌ఎడీఎ్‌స)ను ఏర్పాటు చేస్తామని ప్రకటించినా అమలు కాలేదు.
భద్రతా వైఫల్యమే: భానుప్రకాశ్‌రెడ్డి
తాజా ఘటనపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి స్పందించారు. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమేనని అన్నారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీపై డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డిని సంప్రదించామని, వచ్చే బోర్డు సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. డ్రోన్‌ను డ్రాప్ చేసే టెక్నాలజీని మాత్రమే వినియోగిస్తే అవి ఆలయ పరిసర ప్రాంతాల్లో పడే అవకాశముంటుందని, అలా కాకుండా అసలు డ్రోన్లు పనిచేయకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో భద్రతా వైఫల్యాలు కూడా గుర్తించామని, సిబ్బంది సంఖ్యను పెంచడంతో పాటు అలిపిరిలో అధునాత స్కానర్లు అందుబాటులోకి తీసుకువచ్చి తనిఖీలను పటిష్టం చేస్తామని వివరించారు.
ఇవీ ఘటనలు
2020 డిసెంబరులో వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అనుచరులు తిరుమలకు డ్రోన్ తీసుకొచ్చి గోగర్భం వద్ద ఎగురవేశారు.
2023 జనవరిలో శ్రీవారి ఆలయ డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సర్వే కోసమని ఓ సంస్థకు అనుమతి ఇచ్చిన అప్పటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ సంస్థ సిబ్బంది గోగర్భం ప్రాంతంలో కాకుండా డ్రోన్‌ను నేరుగా ఆలయంపైకే తీసుకువెళ్లి ఆ విజువల్స్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
2024 జనవరిలో హరియాణాకు చెందిన ఓ జంట ఘాట్‌రోడ్డులో డ్రోన్‌ను ఎగరేయడం కలకలం రేపింది.
తాజాగా, రాజస్థాన్‌కు చెందిన ఓ యూట్యూబర్ ఆలయంపై పది నిమిషాల పాటు డ్రోన్‌ను ఎగురవేయడంతో మరోసారి తిరుమల భద్రతకు సవాల్ విసిరినట్టయింది.