Education : ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:39 AM
ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో వారి పాత్ర కీలకమైనదని ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ ఐవీ రావు కొనియాడారు.
ఎన్‌టీఆర్ వర్సిటీ మాజీ వీసీ డాక్టర్ ఐవీ రావు ప్రశంస
యూటీఎఫ్ స్వర్ణోత్సవ విద్యావైజ్ఞానిక మహాసభలు ప్రారంభం
కలెక్టరేట్ (కాకినాడ), జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో వారి పాత్ర కీలకమైనదని ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ ఐవీ రావు కొనియాడారు. కాకినాడ పీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం యూటీఎఫ్ స్వర్ణోత్సవ విద్యావైజ్ఞానిక మహాసభలు ఘనం గా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథి ఐవీ రావు మాట్లాడుతూ.. నేటితరం విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని సన్మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులదేనన్నారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ నేటి పాలకుల ఉదాసీన వైఖరి వల్ల రాజ్యాంగ లక్షణాలు మరుగున పడ్డాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత యూటీఎఫ్ ఉపాధ్యాయులపైనే ఉందన్నారు.
ప్రభుత్వ విధానాలతో విద్య నానాటికీ కుంటుపడుతోందని, ఇప్పటికే దేశంలో సగం వరకు విద్యారంగం ప్రైవేటీకరణ జరిగిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తారన్నారు. ప్రభుత్వ రంగ పాఠశాలలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి మాట్లాడుతూ 1974 ఆగస్టు 10న యూటీఎఫ్ ఏర్పడిందని, యాభై ఏళ్లుగా పోరాటాల ద్వారా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించిందని తెలిపారు. అఖిలభారత ఉపాధ్యాయ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సీఎన్ భారతి మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసి ఓపీఎ్‌సను పునరుద్ధరించాలన్నారు. ఎమ్మె ల్సీ కేఎస్ లక్ష్మణరావు రాసిన నాలుగు పుస్తకాలను సభలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు జోజయ్య, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కె.సత్తిరాజు, బీవీ రాఘవులు, జి.చిట్టిబాబు పాల్గొన్నారు.