AP FiberNet: కొలువుల పత్రాలు లేకున్నా జీతాలు!
ABN , Publish Date - Mar 02 , 2025 | 03:17 AM
అక్రమాలకు నిలయమైన ఫైబర్‌నెట్‌లో నియామక ఉత్తర్వులు లేకుండా దాదాపు 200 మంది పనిచేస్తున్నట్టు తాజాగా తేలింది.

ఫైబర్‌నెట్‌లో వెలుగు చూసిన అక్రమం
సర్కారుకు ఇన్‌చార్జి ఎండీ నివేదిక
అయినా.. ఈ నెల జీతాల చెల్లింపునకు సిద్ధం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఏదైనా నియామక ఉత్తర్వులు ఉండాల్సిందే. అక్రమాలకు నిలయమైన ఫైబర్‌నెట్‌లో నియామక ఉత్తర్వులు లేకుండా దాదాపు 200 మంది పనిచేస్తున్నట్టు తాజాగా తేలింది. మూడు రోజుల కిందట ఫైబర్‌నెట్ ఇన్‌చార్జి ఎండీ ప్రవీణ్ ఆదిత్య... మంత్రి బీసీ జనార్దనరెడ్డి, ఐ అండ్ ఐ శాఖ కార్యదర్శి యువరాజ్‌కు పంపిన సమగ్ర నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నట్టు సమాచారం. సాధారణంగా అయితే వారిపై చర్యలు తీసుకోవాలి. జీతాలు ఆపేయాలి. చిత్రంగా... వారిని ఉద్యోగాల నుంచి తొలగించకపోగా, ఫిబ్రవరి నెల జీతాలు ఇవ్వడానికి ఇదివరకే బిల్లులు పెట్టారు. రేపో, మాపో జీతాలు కూడా పడనున్నాయి. 2019-24 మధ్య కాలంలో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలోనే నియామక ఉత్తర్వులు లేకుండా వీరిని ఉద్యోగాల్లో నియమించారు. ఫైబర్‌నెట్ అక్రమాలపై ఇటీవల పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.సంస్థ ఎండీ దినేశ్ కుమార్‌పై చైర్మన్ జీవీ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయడం... ఆ తర్వాత చైర్మన్ పదవికి, టీడీపీకి జీవీ రెడ్డి రాజీనామా చేయడం... అదేరోజు ఫైబర్ నెట్ ఎండీ పదవి నుంచి దినేశ్ కుమార్‌ను ప్రభుత్వం తొలగించడం... వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫైబర్‌నెట్‌లో రచ్చ తర్వాత ఇన్‌చార్జి ఎండీ ప్రవీణ్ ఆదిత్య తాజాగా ప్రభుత్వానికి నివేదిక పంపారు.
2014-19 మధ్యకాలంలో 119 మంది అవుట్ సోర్సింగ్, 12 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండేవారని పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నివేదికలోని వివరాల ప్రకారం... టెరాసా్‌ఫ్టకు ఫైబర్‌నెట్ ఆపరేషనల్ నిర్వహణ బాధ్యత అప్పగించాక 495 మంది ఉద్యోగులను నియమించుకున్నట్టు తెలిపారు. ‘2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పార్టీ కార్యకర్తలను ఫైబర్‌నెట్‌లో నింపేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య 119 నుంచి 617కు, కాంట్రాక్టు ఉంద్యోగుల సంఖ్య 542 నుంచి 725కు పెరగగా... మొత్తం 1,342 మంది ఉద్యోగులు అయ్యారు. నెలకు రూ.4,04,29,565 చొప్పున జీతభత్యాలను చెల్లించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 617 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను 295కు, కాంట్రాక్టు ఉద్యోగులను 725 నుంచి 630కి కుదించారు. మొత్తంగా ఉద్యోగులను 925కు కుదించి, జీతభత్యాలను రూ.2,53,78,577కు తగ్గించారు. అవుట్ సోర్పింగ్ ఉద్యోగులు 295 మందిలో 167 మందికి నియామక ఉత్తర్వులే లేవు’ అని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. నియామక ఉత్తర్వులు లేని ఉద్యోగులను తొలగించాలని చైర్మన్‌గా జీవీ రెడ్డి చేసిన సిఫారసులను నాటి ఎండీ దినేశ్‌కుమార్ పట్టించుకోలేదు. ప్రభుత్వమూ వారిని తొలగించేందుకు సముఖత వ్యక్తం చేయడం లేదు.
అప్పులపై లెక్కల్లేవు
2014-19 మధ్యకాలంలో ఫైబర్‌నెట్ కార్యకలాపాల నిర్వహణ కోసం రూ.642 కోట్లు అప్పు చేశారు. కానీ సంస్థ పూర్తిగా నిలదొక్కుకున్నాక 2019-24 మధ్యకాలంలో ఏకంగా 892 కోట్ల రుణం తీసుకున్నారు. ఇందులో సార్వత్రిక ఎన్నికలకు ముందు సంవత్సరం 2023-24లో రూ.887.94 కోట్ల అప్పు చేశారు. ఈ రుణం మొత్తానికి అప్పటి ఫైబర్‌నెట్ యాజమాన్యం లెక్కాపత్రాలను చూపడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ లెక్కల జోలికి వెళ్లకపోవడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.