Sankranti Festival: కోట్లలో కూత
ABN , Publish Date - Jan 16 , 2025 | 05:03 AM
పండగ పందేలు జాతరను తలపించాయి. ఎక్కడికక్కడ షామియానాలు, కుర్చీలు, ఎల్‌ఈడీ స్ర్కీన్లలో ప్రత్యక్ష ప్రసారాలు, వీటికి కామెంట్రీలు ఏర్పాటు చేసి స్టేడియం తరహాలో బరులను నిర్వహించారు.
మూడు రోజులు... వందల బరులు.... సుమారు రూ.రెండు వేల కోట్ల పందేలు! ఇందులో భోగిరోజు రూ.350 కోట్లు. సంక్రాంతి పండగ సందడిని డబుల్ చేస్తూ రెండోరోజు దాదాపు రూ. 600 కోట్లు... ఇక.. కనుమ రోజు ఏకంగా వెయ్యి కోట్లు....! ఇటు కోనసీమ నుంచి అటు రాయలసీమ వరకు సంక్రాంతి కోడి జైత్రయాత్ర ఇలా అప్రతిహతంగా సాగింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క పందెమే రికార్డుస్థాయిలో రూ. 1.25 కోట్లు పలికింది.
కోడి కూత కోటి దాటింది! ఏలూరుకు చెందిన రసంగి, గుడివాడకు చెందిన నెమలి..రెండూ తలపడ్డాయి. నువ్వా నేనా అన్నట్టు తొలి రెండు రౌండ్లలో దీటుగా నిలబడ్డాయి. మూడో రౌండ్‌లో రసంగిని నెమలి గాయపర్చింది. గాయం లోతుగా కావడంతో అది కుప్పకూలింది. నెమలి విజేత ప్రభాకర్ రూ. 1.25 కోట్ల పందెం దక్కించుకున్నాడు. అయితే, ఓడిన రసంగి పందెంరాయుడు రత్తయ్య ఆ వెంటనే తేరుకుని రూ.రెండు కోట్ల పందేనికి సై అన్నాడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పైబోయిన వెంకటరామయ్యతోటలో జరిగింది ఈ పందెం!
3 రోజుల్లో రూ.2 వేల కోట్ల పందేలు!
ఒక్క కనుమనాడే వెయ్యి కోట్లు దాటిన పందెం
కోనసీమ నుంచి రాయలసీమ దాకా ఒకే జోరు
పెద్ద బరుల్లో సందడి చేసిన సంక్రాంతి కోడి
రూ. కోట్లలో పందేలు.. భారీగా ఆఫర్లు
విజేతలకు థార్ జీపు, యాక్టివాలు, బుల్లెట్లు
‘పశ్చిమ’లో ఒక్క పందేనికే రూ.1.25 కోట్లు
గోదావరి జిల్లాల్లో జబర్దస్త్ బృందాల హడావుడి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): పండగ పందేలు జాతరను తలపించాయి. ఎక్కడికక్కడ షామియానాలు, కుర్చీలు, ఎల్‌ఈడీ స్ర్కీన్లలో ప్రత్యక్ష ప్రసారాలు, వీటికి కామెంట్రీలు ఏర్పాటు చేసి స్టేడియం తరహాలో బరులను నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, కోనసీమలను కలుపుకొని పందేలు రూ.500కోట్లు దాటేశాయి. బరుల్లో కోడిపందేలతో సమానంగా గుండాట భారీగా జరిగింది. ఎక్కడా పోలీసుల జాడ లేకపోవడంతో పందెంరాయుళ్లు, గుండాట వ్యాపారులు చెలరేగిపోయారు. అడ్డూఅదుపు లేకుండా రేయింబవళ్లు రెచ్చిపోయారు. మొత్తం పందేల్లో సగానికిపైగా గుండాటదే కావడం విశేషం. ప్రధానంగా కాకినాడ జిల్లాలో మూడురోజుల్లో రూ.250కోట్లకుపైగా పందేలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో రూ.150కోట్లు, కోనసీమ జిల్లాలో రూ.100కోట్లుకుపైగా పందేలు, గుండాట వ్యాపారం జరిగింది. వెరసి మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కలిపి 1500కిపైగా బరుల్లో పందేలు జరిగాయి.
గుండాట కూడా కోట్లలోనే..
గుండాటలో కాకినాడ జిల్లాలో వ్యాపారులకు లక్షలకు లక్షలు కురిపించాయి. ఒక్కో గ్రామంలో ఏర్పాటు చేసిన బరుల వద్ద రెండు నుంచి నాలుగు వరకు గుండాట బోర్డులు ఏర్పాటు చేసి లక్షల్లో లావాదేవీలు జరిపారు. ప్రత్తిపాడు మండలంలోని ఓ గ్రామంలో మూడురోజులకు కలిపి ఓ గుండాట నిర్వాహకుడు ఏకంగా రూ.1.20కోట్ల వ్యాపారం నిర్వహించారు. ఇందులో సదరు వ్యాపారి రూ.25లక్షలు సంపాదించాడు. మురమళ్ల, కరపలో గుండాట నిర్వాహకులు రూ.కోటికిపైగా సంపాదించారు. కాకినాడ జిల్లాలో 490వరకు బరులు ఏర్పాటవగా, రూ.250కోట్ల పందేలు జరిగాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడిపందేలు, పేకాట, గుండాట జోరుగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జగ్గయ్యపేట నుంచి మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్ వరకు బరులను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో సాగిన కోడి పందాల్లో రూ.400 కోట్లు చేతులు మారాయి. కొన్ని చోట్ల భోగి రోజు మందకొడిగా పందేలు సాగినప్పటికీ సంక్రాంతి, కనుమ రోజున పందేలు జోరందుకున్నాయి. ఈసారి జిల్లా వ్యాప్తంగా లెక్కకు మించి బరులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి బరి వద్ద్దా జనం పలచగా కనిపించారు.
కొత్తబట్టలు.. గారెలు
జూదరులను ఆకర్షించేందుకు నిర్వహకులు కొత్త దారుల్లో ప్రయత్నించారు. బాపట్ల జిల్లా నగరం మండలంలోని ఒక పేకాట శిబిరంలో కొత్తబట్టలు, నాటుకోడి పులుసుతో రాగిసంకటి, గారెలు ఏర్పాటుచేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్కో పందెం రూ.లక్ష నుంచి రూ.7 లక్షల వరకు కొనసాగాయి. వీఐపీ బరుల్లో రూ.3 నుంచి రూ.5 లక్షలపైనే పందాలు వేశారు. ఒక్కో బరిలో రోజుకు 70 నుంచి 100కుపైగా పందేలు వేశారు. ఇందుకు తమ వంతు సహకారం అందించిన పోలీసులు, మిగిలిన శాఖల అధికారులకు కలిపి ఒక్కో బరికి రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు మామూళ్లు అందాయని చెబుతున్నారు. కొన్ని బరుల్లో మహిళా యాంకర్‌లు ఆకర్షణగా నిలిస్తే, మరికొన్నిచోట్ల హిజ్రాలు నృత్యాలతో సందడి చేశారు.
కనిపించని పోలీసింగ్..
హోం మంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గం పాయకరావుపేట పరిధిలోని నక్కపల్లి మండలం వేంపాడు, సత్యవరం గ్రామాల్లో కోడిపందేలు నిర్వహించారు. ఈ శిబిరానికి ఎంపీ సీఎం రమేశ్ కుటుంబసమేతంగా హాజరై సందడి చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో భుజబలపట్నంలో వేసిన అతి పెద్ద బరిని మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ తదితరులు సందర్శించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ, పులగాలిపాలెంలలో పోలీసులు దాడులు నిర్వహించి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలీసులు, మిగిలిన శాఖల అధికారులకు కలిపి ఒక్కో బరికి రూ.లక్ష నుంచి రూ. ఐదులక్షల వరకు మామూళ్లు అందాయని చెబుతున్నారు.
‘కోడిని గెలిచిన కోడి ఇది..’
కడప జిల్లా వేములలో పోలీసులు ఐదుగురు పందెంరాయుళ్లను, నాలుగు కోడి పుంజులను స్టేషన్‌కు తరలించారు. వారినుంచి రూ.13వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లారు. ‘అది కోళ్లను గెలిచిన కోడి’ అంటూ పోలీసుల స్వాధీనంలో ఉన్నవాటిలో ఒకదానిని తీసుకెళ్లారు.
గెలిచిన డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో కోడిపందేల శిబిరంవద్ద ఏర్పాటు చేసిన గుండాటలో రూ.200 గెలుచుకున్నప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడంతో జరిగిన వివాదంతో కొమ్మిశెట్టి గంగాధర్(18) అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. మోటార్‌సైకిల్ నుంచి పెట్రోలు తీసి మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనంతరం భయాందోళనకు గురై పక్కనే ఉన్న నీళ్ల బోదెలోకి దూకాడు. అప్పటికే శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. ఆయనను వెంటనే స్థానికులు తణుకు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మెడలో రెండు కేజీలు తగ్గకుండా బంగారపు గొలుసు... చేతి వేళ్లకు ఎనిమిది ఉంగరాలు... ముంజేతికి పసిడి తొడిగిన పూసల దండలు.. ఒక్కమాటలో ఈయనో బంగారుబాబు! పేరు డేగల నాగేంద్ర. కాకినాడ జిల్లా కరపలోని కొరుపల్లి బరిలో పండగ మూడు రోజులు 64 పందేలు సాగగా, అందులో ఎక్కువ పందేల్లో విజేతగా నిలిచారు. మహీంద్రా థార్ జీపును గెలుచుకున్నారు.
పారిన తెలంగాణ మద్యం
ఏలూరు జిల్లావ్యాప్తంగా దాదాపు 80 కోట్ల రూపాయలు కోడి పందేల రూపంలోను, మరో 30 కోట్ల రూపాయలు పేకాటలోను జనం చేతులు మారాయి. ఒకటికాదు.. రెండు కాదు ఏకంగా బరులన్నింటిలోనూ ఎలాంటి బెరుకు లేకుండా పేకాట, గుండాట యథేచ్ఛగా సాగాయి. బరుల వద్ద మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. తెలంగాణ సరిహద్దున ఉన్న చింతలపూడి నియోజకవర్గానికి పెద్దఎత్తున తెలంగాణవాసులు తరలివచ్చారు. వస్తూ వస్తూ తెలంగాణ మద్యం తెచ్చారు. కొంత మంది పందేల మాటున ఆ మద్యం విక్రయించారు. నూజివీడులో జరిగిన కోడి పందేలకు తెలంగాణ మాజీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు హాజరయ్యారు.
కుమ్మేసుకున్న పొట్టేళ్లు..
చందర్లపాడు, జనవరి 15: సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది కోడి పందేలు. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల కోడి పందేలు జోరుగా సాగాయి. అయితే ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలో దీనికి భిన్నంగా పొట్టేలు పందేలు అందర్నీ ఆకట్టుకున్నాయి. చందర్లపాడులోని కొందరు తమ పొట్టేళ్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి పోటీలకు తీసుకొచ్చారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోటీల్లో పొట్టేళ్లు కుమ్మేసుకున్నాయి. పోటీల అనంతర విజేతలకు బహుమతులు అందజేశారు. కోమటి అజే్‌షకు చెందిన పొట్టేలు మొదటి బహుమతిని సొంతం చేసుకుంది.
జల్లికట్టులో నలుగురికి గాయాలు
చంద్రగిరి, జనవరి 15(ఆంధ్రజ్యోతి): జల్లికట్టులో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో బుధవారం అట్టహాసంగా జల్లికట్టు నిర్వహించారు. ఈ సందర్భంగా వందకుపైగా ఎద్దులను వదిలారు. ఎద్దులకు కట్టిన బహుమతులను చేజిక్కించుకోడానికి యువత పోటీ పడగా, వారినీ, తిలకించేందుకు వచ్చిన జనాన్నీ ఎద్దులు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆకర్షించిన ఆఫర్లు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పెద అమిరం, సీసలిలో పెద్ద బరులు ఏర్పాటయ్యాయి. ఇక్కడ ముసుగు పందేలు జోరుగా సాగాయి. తాడేపల్లిగూడెంలో ఒక్కో ముసుగు పందెం రూ.27 లక్షలు కాశారు. యూనికార్న్, యాక్టివా వంటి ఆఫర్‌లు భీమవరంలో ప్రకటించారు. భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన పందెం రాయుళ్లు చెరో వాహనాన్ని దక్కించుకున్నారు. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లోని హోటళ్లలో పేకాటలు జరిగాయి. జబర్దస్త్ టీమ్‌తోపాటు యాంకర్ శ్రీముఖి పండగ రెండు రోజులూ నర్సాపురంలో సందడి చేశారు. సినీ గాయకులు విచ్చేశారు. యలమంచిలిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించి తొమ్మిది బంగారు నాణేలను మహిళలకు ప్రథమ బహుమతులుగా ఇచ్చారు. మహిళల కోసం ప్రత్యేకంగా గుండాట టేబుళ్లు ఏర్పాటుచేశారు. అక్కడే విందు భోజనాలు ఏర్పాటుచేశారు. సమీపంలో కోడి పందేల బరి నిర్వహించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలో కోడి పందేల్లో విజేతలకు బహుమతిగా 12 బైక్‌లను అందజేశారు. కాకినాడ జిల్లాలోని కరప మండలంలో ఎక్కువమంది పందెంరాయుళ్లను ఆకర్షించడానికి గిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. పందేల్లో ఎవరు ఎక్కువ గెలిస్తే వారికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్లను మూడురోజులపాటు అందించారు. కరపలోని కొరుపల్లి బరిలో మూడురోజుల జరిగిన 64 కోడిపందేల్లో ఎక్కువ పందేలు గెలిచిన డేగల నాగేంద్ర అనే (గోల్డ్‌మ్యాన్) వ్యక్తికి మహీంద్రా థార్ జీపును కనుమరోజు అందించారు. ఆలమూరు మండలం జొన్నాడకు చెందిన సత్తిరెడ్డి, ఆత్రేయపురం మండలం మెర్లపాలేనికి చెందిన గోవిందు, అమలాపురం రూరల్ మండలం మాగాంకు చెందిన సురే్‌షచౌదరి బుల్లెట్ దక్కించుకున్నారు. మండపేటలో హోండా యాక్టీవా ద్విచక్రవాహనాలు ఇచ్చారు. పందేల తొలిరోజు పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట ప్రాంతాలకు చెందిన వారు రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను గెలిచారు.
పులివెందులలో పందేల జోరు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొణిజేడు కొండల వద్ద మంగళ, బుధవారాల్లో రూ.కోట్లలో పందెం నడిచింది. ప్రతి రోజూ 30 జతలకు తగ్గకుండా పందేలు వేశారు. పైపందేలు సైతం పెద్దఎత్తున జరిగాయి. బరుల వద్ద మందు, బిర్యానీ, తినుబండారాల దుకాణాలను ఏర్పాటుచేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె, పులివెందుల, లింగాల, చక్రాయపేట మండలాల్లో పందేలు కోట్లలో సాగాయి. రెండు మూడు చోట్ల ముక్కలాట కూడా నిర్వహించారు. పులివెందులలో ఓ చోట ప్రవేశ రుసుం కట్టిన తర్వాతే బరిలోకి అనుమతించారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, కడప తదితర నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన కొన్ని బరుల్లో కోడిపందేల నిర్వాహకులు అక్కడకు వచ్చిన వారందరికీ తాగునీరు, భోజన వసతి ఏర్పాటుచేశారు. మద్యం విక్రయించారు.
కాలుకదపకుండానే గెలిచిన పుంజు
భీమడోలు, జనవరి 15(ఆంధ్రజ్యోతి): ఒక్కోసారి ఏమీ చేయకుండా ఉంటేనే కలసివస్తుంది. దానికి ఉదాహరణే ఓ కోడిపుంజు గెలుపు. కదన రంగంలో కనీసం కాలు కదపకుండానే విజయం సాధించింది. కోడి పందేలు చివరి దశకు చేరుకున్న క్రమంలో పోరాడకుండానే గెలిచిన ఆ పుంజు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా భీమడోలులో మూడు రోజులుగా కోడి పందేలు జరుగుతున్నాయి. బుధవారం చీకటి పడే వేళకు పందేలు ముగించాల్సి ఉండగా ఇక ఐదు పుంజులు మిగిలాయి. ఈసారి ఒకే పందెం వేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఒక్కోదానిపైన రూ.పది వేలు పందెం కాశారు. అంటే చివరికి మిగిలిన కోడికి మిగిలిన నలుగురు నలబై వేలు ఇవ్వాలి. ఐదు పుంజులను బరిలోకి దింపారు. రసంగి రకం పుంజు వీరోచితంగా పోరాడి మిగిలిన మూడు పుంజులను మట్టి కరిపించింది. ఈ పోరు జరుగుతున్నంత సేపు అబ్రాస్ రకం కోడి కాలు కదపలేదు. మిగిలిన పుంజుల పోరాటాన్ని చూస్తూ ఉండిపోయింది. చివరకు దగ్గరకు రాగానే అప్పటికే అలసిపోయి.. రక్తమోడుతున్న రసంగి నేలకొరిగింది. అబ్రాస్ విజేతగా నిలిచింది.