Share News

AP Governor : దుష్పరిపాలన నుంచి విముక్తి

ABN , Publish Date - Feb 25 , 2025 | 04:49 AM

బాధ్యతాయుతమైన సుపరిపాలన వైపుగా రాష్ట్రాన్ని నడిపించడంలో గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు.

AP Governor : దుష్పరిపాలన నుంచి విముక్తి

  • సుపరిపాలన దిశగా అడుగులు

  • ఏపీలో మరో విప్లవం.. బ్రాండ్‌ ఏపీ పునరుద్ధరణ

  • కొత్త వాణిజ్య కారిడార్ల ఆవిష్కరణకు సిద్ధం

  • పేదరిక రహిత సమాజం లక్ష్యంగా పాలసీలు

  • నిలిపేసిన 74 కేంద్ర పథకాల పునరుద్ధరణ

  • డెమోగ్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌పై కొత్త విధానం

  • ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047

  • బడ్జెట్‌ ప్రసంగంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ వెల్లడి

  • గవర్నర్‌ నోట కందుకూరి మాట

ఆత్మగౌరవం, ఆర్థిక స్థిరత్వం లక్ష్యంగా..

‘‘ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త అనే విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఆత్మగౌరవం, ఆర్థిక స్థిరత్వం రెండింటినీ కుల వృత్తులు సాధించుకునేందుకు ఊతం ఇస్తున్నాం. గీత కులాల వారి కోసం 10 శాతం మద్యం దుకాణాలను రిజర్వు చేశాం. వారికి రాయితీలు ఇస్తున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పోలవరానికి అనుసంధానం చేస్తున్నాం. పోలవరం నిర్మాణం 73 శాతం పూర్తయింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 28.50 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. 540 గ్రామాలకు తాగునీరు అందుతుంది. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. రాయలసీమను ఈ ప్రాజెక్టు నీటి సురక్షిత ప్రాంతంగా మారుస్తుంది. అమృత్‌, జల్‌జీవన్‌ మిషన్‌ అమలు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం తిరిగి వాటిని పునరుద్ధరించింది.’’

అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): గత దుర్భరపాలన, దుష్పరిపాలన నుంచి బాధ్యతాయుతమైన సుపరిపాలన వైపుగా రాష్ట్రాన్ని నడిపించడంలో గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మరో విప్లవానికి నాయకత్వం వహిస్తోందని, ఐటీ నుంచి కృత్రిమ మేధ వరకు టెక్నాలజీ వినియోగంలో కొత్త పుంతలు తొక్కుతోందని తెలిపారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో భాగమవుతూ ‘పీపుల్‌ ఫస్ట్‌’ విధానంతో స్వర్ణాంధ్ర-2047 దార్శనిక పత్రం తయారుచేసుకుని, సమగ్ర రోడ్‌మ్యా్‌పను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.


దీనికోసం పది మార్గదర్శక సూత్రాలను రూపొందించుకుని పని చేస్తోందన్నారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభిస్తూ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 74 పథకాలను పునరుద్ధరించి, రూ.9,371కోట్ల అప్పులు తీర్చామని తెలిపారు. నీటి పారుదల, రోడ్లు, ఇతర పనులకు సంబంధించి రూ.10,125 కోట్ల విలువైన బిల్లులు క్లియర్‌ చేశామన్నారు. తద్వారా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకోవడానికీ బ్రాండ్‌ ఏపీపై విశ్వాసం పునరుద్ధరణకూ వీలు ఏర్పడిందని గవర్నర్‌ తెలిపారు. పోలవరం నీటి పారుదల ప్రాజెక్టు, అమరావతి రాజధాని ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కాయనీ, విశాఖ ఉక్కు కర్మాగారానికి పునరుజ్జీవం, కొత్త రైల్వే జోన్‌ వంటి ఎన్నికలను నెరవేర్చామని పేర్కొన్నారు. సుస్థిర వృద్ధి, శ్రేయస్సుకు దోహదపడే 22 కొత్త విధానాలను ప్రారంభించడం ద్వారా ఏపీ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది వేశామన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తుండటం గర్వంగా ఉన్నదని చెప్పారు. భారీ పెట్టుబడుల కోసం గూగుల్‌, ఆర్సెలర్‌ మిట్టల్‌ స్టీల్‌ కంపెనీ, టాటా పవర్‌, గ్రీన్‌కో గ్రూప్‌, బీపీసీఎల్‌, టీసీఎస్‌ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారని, నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమైందన్నారు. ఏ సమాజమైనా సుభిక్షంగా ఉండాలంటే సంక్షేమం, అభివృద్ధి కలిసికట్టుగా సాగాలనీ, అవి ఒకే నాణేనికి రెండు పార్శ్యాలని వ్యాఖ్యానించారు. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత సాధించడంలో ముఖ్యమంత్రి మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. ‘‘ఎవరికైనా చేపను ఇస్తే అది అతని ఆకలిని ఒక్క రోజు మాత్రమే తీర్చగలదు. అదేగనుక మనిషికి చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం తిండి లభిస్తుందనే సూక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్నారు.’’ అని గవర్నర్‌ తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


ప్రపంచ ఉత్తమ వ్యూహరచనలు...

‘‘మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీమోడల్‌ రవాణా కేంద్రాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అవి మన రాష్ట్రాన్ని ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించే కొత్త వాణిజ్య కారిడార్లను ఏర్పాటు చేస్తాయి. గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన రహదారుల స్థితిని మార్చడానికి ప్రారంభించిన ‘మిషన్‌ పాట్‌హోల్‌ ఫ్రీ ఆంధ్రా’ కార్యక్రమం అద్భుతమైన పురోగతి సాధించింది. 20,059 కిమ్లీకు గాను మూడునెలల్లోనే 17,605 కిమీ పరిధిలో పనులు పూర్తిచేశాం. జిల్లా ప్రధాన కేంద్రం నుంచి మండల కేంద్రం వరకు, ఆనుకుని ఉన్న మండల కేంద్రాల మధ్య డబుల్‌-లేన్‌ కనెక్టివిటీని ప్రభుత్వం చేపడుతోంది. 2025-26లో విద్యుత్‌ చార్జీలు పెంచరాదని నిర్ణయించాం. క్లీన్‌ ఎనర్జీ లభ్యతను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్రంలోని సుమారు 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూప్‌టాప్‌ సోలార్‌ను ‘పీఎం సూర్య ఘర్‌’, ‘ముఫ్త్‌ బిజ్లీ యోజన’ కింద చేపడుతున్నాం. గత ప్రభుత్వం రెవెన్యూ పరిపాలనకు నిర్లక్ష్యం చేసింది. దీనిని సరిదిద్దడంలో భాగంగా భూదురాక్రమణ నిరోధక చట్టాన్ని తీసుకొచ్చాం. రెవెన్యూ సదస్సుల ద్వారా పాలనను నేరుగా ప్రజల ముంగిటకు చేర్చాం.’’


కందుకూరి స్ఫూర్తితోనే స్వర్ణాంధ్ర డాక్యుమెంట్‌

‘‘అవకాశాలొస్తే ప్రతి మనిషిలోని మేటి నైపుణ్యం వెలుగొందుతుంది’’ అని మహా సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు అన్నారు. కందుకూరి స్ఫూర్తితోనే ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్‌ను రూపొందించాం. ఆంధ్రప్రదేశ్‌ బలం....దాని విధానాలు, ప్రాజెక్టులలో మాత్రమే కనిపించదు. అది ప్రజల సమైక్యత, దృఢ సంకల్పం, ఆవిష్కరణ స్ఫూర్తిలో ఉంది. మన ముందున్న మార్గం బోలెడు అవకాశాలతో నిండి ఉంది. దానిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరిపైనా ఉంది.’’

త్వరలోనే ‘తల్లికి వందనం’

‘ఏపీ గణనీయమైన జనాభా పరివర్తనలకు లోనవుతోంది. సంతాన సాఫల్య రేటులో తీవ్రమైన క్షీణత ఉంది. వృద్ధాప్య జనాభా వేగంగా పెరుగుతోంది. సంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్నాయి. అందువల్ల డెమోగ్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌పై పాలసీని తీసుకొచ్చాం. పిల్లల చదువులు కుటుంబానికి భారంగా మారకుండా తల్లులకు ఆర్థిక చేయూతనిస్తూ ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయనున్నాం.’’


ఇదీ స్వర్ణాంధ్ర లక్ష్యం..

‘‘వ్యక్తులకు, కుటుంబాలకు సాధికారత కల్పించి రాబోయే కొన్నేళ్లలోనే పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తున్న ఎన్టీఆర్‌భరోసా పథకం..దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం. నిరుపేదలకు ఆహారభద్రతను కల్పించేందుకు రూ.5కే అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయి. ఎస్టీల సమగ్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి ప్రభుత్వం పని చేస్తోంది. దీనికోసం ఐటీడీఏ ప్రాంతాల్లో గిరిజనుల విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, జీవనోపాధులు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి వంటి రంగాల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. సమాజానికి వెన్నెముక వంటి బీసీల సామాజిక, రాజకీయ సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీసీల ఆదాయం పెంచడానికి రూ.896 కోట్లు పలు కార్పొరేషన్ల ద్వారా అందించాం. రాష్ట్ర శాసనసభలో 33 శాతం బీసీ రిజర్వేషన్ల వర్తింపునకు తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. ఆలయ అర్చకుల గౌరవవేతనాన్ని రూ.15 వేలకు, నాయీ బ్రాహ్మణుల గౌరవవేతనాన్ని రూ.25 వేలకు పెంచాం. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం దీపం-2 పథకం కింద సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లను అందిస్తోంది.’’

Updated Date - Feb 25 , 2025 | 04:50 AM