Share News

Exam Notification: గ్రూప్‌-2 మెయిన్స్‌ నేడే

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:25 AM

జీవో 77 ప్రకారం హారిజాంటల్‌ రోస్టర్‌ అమలు చేయాలని, కానీ పోస్టులకు అందుకు విరుద్ధంగా పాత రోస్టర్‌ అమలు చేశారని ఆరోపిస్తున్నారు.

Exam Notification:  గ్రూప్‌-2 మెయిన్స్‌ నేడే
AP Group 2 Exam

  • పరీక్ష నిర్వహణకే ఏపీపీఎస్సీ నిర్ణయం

  • ‘వాయిదా’ అంటూ రోజంతా హైడ్రామా

  • అభ్యర్థుల ఆందోళనలపై సర్కారులో చర్చ

  • సీఎం ముందు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రస్తావన

  • వాయిదా వేయాలని కమిషన్‌కు ప్రభుత్వ లేఖ

  • కోడ్‌ నేపథ్యంలో వాయిదా వేయలేమని జవాబు

  • నేటి మెయిన్స్‌ పరీక్ష యథాతథం

గ్రూప్‌-2 మెయిన్స్‌పై శనివారం రోజంతా హైడ్రామా నడిచింది. పరీక్షలు ఉంటాయా? లేవా? అని అభ్యర్థులు గంటగంటకూ అయోమయానికి గురయ్యారు. వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆవేదనను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రీషెడ్యూలు చేయాలని ప్రభుత్వం శుక్రవారం రాత్రి సర్వీస్‌ కమిషన్‌కు లేఖ రాసింది. శనివారం ఉదయం ఇది వెలుగులోకి రావడంతో మొదలైన గందరగోళం... చివరికి వాయిదా వేయడం సాధ్యం కాదని సాయంత్రం ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి లేఖ రాయడంతో ముగిసింది. దీంతో షెడ్యూలు ప్రకారం ఆదివారం పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి.

అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): 2023లో జారీ చేసిన గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ రోస్టర్‌లో తప్పులున్నాయని, ఈ నోటిఫికేషన్‌ సరైన విధానంలో లేదని అభ్యర్థులు మొదటి నుంచీ వాదిస్తూ వస్తున్నారు. జీవో 77 ప్రకారం హారిజాంటల్‌ రోస్టర్‌ అమలు చేయాలని, కానీ పోస్టులకు అందుకు విరుద్ధంగా పాత రోస్టర్‌ అమలు చేశారని ఆరోపిస్తున్నారు. ఆదివారం మెయిన్స్‌ పరీక్ష జరగాల్సిన తరుణంలో శుక్రవారం నుంచి ఆందోళనలు పెరిగాయి. విశాఖపట్నం, హైదరాబాద్‌ సహా పలు చోట్ల నోటిఫికేషన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలు చేశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో శుక్రవారం మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ దీనిపై ఆరా తీశారు. ఏం చేస్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుందనే కోణంలో పలువురు ఎమ్మెల్సీలు, అధికారులతో చర్చించారు. మార్చి 11న రోస్టర్‌పై హైకోర్టులో విచారణ ఉన్నందున అప్పటి వరకూ పరీక్షలు వాయిదా వేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు.


అదే విషయాన్ని ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, కంచర్ల శ్రీకాంత్‌ శుక్రవారం రాత్రి ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి లేఖ కావాలని ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌ ఏఆర్‌ అనురాధ కోరారు. అందుకు అనుగుణంగా స్పందించిన సాధారణ పరిపాలన శాఖ(సర్వీసు అంశాలు) శుక్రవారం రాత్రి ఏపీపీఎస్సీకి వాయిదా కోరుతూ లేఖ రాసింది. ‘‘అభ్యర్థుల నుంచి అనేక వినతులు వస్తున్న నేపథ్యంలో పరీక్షలు పారదర్శకంగా, స్పష్టతతో జరుగుతాయన్న భరోసా వారికి ఇవ్వాలి. న్యాయస్థానంలో దీనిపై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడానికి ముందే పరీక్షలు నిర్వహించడం సరైన విధానం కాదు. ఈ క్రమంలో గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలను రీషెడ్యూలు చేసి, కౌంటర్‌ అఫిడవిట్‌లో స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వానికి గడువు ఇవ్వాలి’’ అని లేఖలో కోరింది. ‘అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకున్నాం. సమస్యను పరిష్కరిస్తాం’ అని మంత్రి లోకేశ్‌ ట్వీట్‌ చేయడంతో మెయిన్‌ వాయిదా కోరుతున్న అభ్యర్థుల్లో నమ్మకం పెరిగింది. మరోవైపు... శనివారం చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదాకోసం జరుగుతున్న ఆందోళనలను పార్టీ నేతలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో... ‘వాయిదా కోరుతూ లేఖ రాశాం! కమిషన్‌ దీనిపై స్పందించాలి కదా!’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అభ్యర్థుల ఆవేదనను అర్థంచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.


175 కేంద్రాల్లో పరీక్షలు

గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు 175 కేంద్రాల్లో జరగనున్నాయి. అన్ని ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపికైన 92,250 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఈ నోటిఫికేషన్‌లో 905 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఒక్కో పోస్టుకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపిక చేశారు. మెయిన్స్‌ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆదివారం ఉదయం, మధ్యాహ్నం మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయి.

ఉదయం నుంచే హైడ్రామా

గ్రూప్‌-2 మెయిన్స్‌ అంశంపై శనివారం ఉదయం నుంచి హైడ్రామా మొదలైంది. పరీక్షలు వాయిదా వేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై అభ్యర్థుల నుంచి ఫోన్లు రావడంతో ఏపీపీఎస్సీ స్పందించింది. ‘వాయిదా వార్తలు నమ్మవద్దు. వాయిదా వేసినట్లు సర్క్యులేట్‌ అవుతున్న నోట్‌ నకిలీది’ అని స్పష్టంచేసింది. దీంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఆ వెంటనే కాసేపటికి శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఏపీపీఎస్సీకి రాసిన లేఖ బయటికొచ్చింది. దీంతో మళ్లీ వాయిదా ప్రచారం మొదలైంది. ప్రభుత్వమే లేఖ రాయడంతో ఇక పరీక్షలు వాయిదా పడినట్లేనని అభ్యర్థులు భావించారు. మరోవైపు ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, కంచర్ల శ్రీకాంత్‌ శనివారం ఉదయం 10 గంటలకు ఏపీపీఎస్సీ కార్యాలయానికి వెళ్లారు. పరీక్షలు వాయిదా కోరుతూ ప్రభుత్వం లేఖ రాసిన సమాచారం చేరవేసేందుకు వెళ్లారు. కాగా ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌ కార్యాలయానికి రాకపోవడంతో మధ్యాహ్నం 3 గంటల వరకు వేచిచూసి వెనుదిరిగారు. ఈలోగా అభ్యర్థుల నుంచి ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌, కార్యాలయానికి ఫోన్లు పోటెత్తాయి. పరీక్ష ఉందా? లేదా? అని తెలుసుకునేందుకు వేల సంఖ్యలో అభ్యర్థులు ఫోన్లు చేశారు. హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చి పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఎట్టకేలకు సాయంత్రానికి స్పందించిన ఏపీపీఎస్సీ పరీక్ష వాయిదా వేయడం సాధ్యం కాదంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది.


కోడ్‌ ఉల్లంఘించలేం...

ప్రస్తుతం పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో... పరీక్ష వాయిదా ‘కోడ్‌’ను ఉల్లంఘించినట్లు అవుతుందని సర్వీస్‌ కమిషన్‌ స్పష్టం చేసింది. ‘‘మెయిన్స్‌కు ఎంపిక కాని అభ్యర్థుల నుంచి పరీక్ష వాయిదా వేయాలని భారీగా వినతులు వచ్చాయి. ఈ నోటిఫికేషన్‌ రద్దు చేస్తే, భవిష్యత్తులో జారీ చేసే నోటిఫికేషన్‌లో అవకాశం లభిస్తుందనేది వారి ఆలోచన. దీని వెనుక కొన్ని కోచింగ్‌ సెంటర్ల పాత్ర కూడా ఉంది. రోస్టర్‌ పాయింట్ల గురించి నోటిఫికేషన్‌లో ఎక్కడా పేర్కొనలేదు. దీనిపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ, నోటిఫికేషన్‌ రద్దు కావాలని కోరుకుంటున్నారు. ఈ దశలో పరీక్షల నిర్వహణపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు కూడా చెప్పింది. అభ్యర్థులంతా పట్టభద్రులైనందున ఈ దశలో పరీక్షలు వాయిదా వేస్తే అది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుంది. ఏపీపీఎస్సీ కూడా ఈ పరిమితులకు కట్టుబడి ఉండాలి. అలాగే వాయిదా వేయడం వల్ల ఇప్పటికే హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్న 84,921 మంది అభ్యర్థులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ దశలో పరీక్ష వాయిదా వేయడం కష్టపడి చదివిన విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడం కిందకు రాదు’ అని ఏపీపీఎస్సీ పేర్కొంది.

Updated Date - Feb 23 , 2025 | 07:58 AM