TTD: తిరుమలను కాంక్రీట్ జంగిల్‌గా మార్చొద్దు
ABN , Publish Date - Mar 13 , 2025 | 03:48 AM
తిరుమలను కాంక్రీట్ జంగిల్‌గా మారనీయకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీకి హైకోర్టు స్పష్టం చేసింది. భవన నిర్మాణాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
భవన నిర్మాణాల విషయంలో అప్రమత్తంగా ఉండండి
టీటీడీకి స్పష్టం చేసిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు
అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): తిరుమలను కాంక్రీట్ జంగిల్‌గా మారనీయకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీకి హైకోర్టు స్పష్టం చేసింది. భవన నిర్మాణాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ధార్మిక సంస్థల పేరుతో ఎలాపడితే అలా నిర్మాణాలు చేస్తామంటే కుదరదని వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలను అనుమతిస్తూ పోతే కొన్నాళ్లకు అటవీప్రాంతం కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాల విషయంలో తాము కఠినంగానే ఉంటామని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ, పలు మఠాలకు నోటీసులు జారీచేసింది.
విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. పలు మఠాలు తిరుమలలో అనుమతులు లేకుండా ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నా, టీటీడీ పట్టించుకోవడం లేదంటూ తిరుపతికి చెందిన టి.మహేశ్ వేసిన పిల్‌పై ఈ ఆదేశాలిచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది చిత్తరువు నాగేశ్వరరావు, టీటీడీ తరఫున న్యాయవాది సుమంత్ వాదనలు వినిపించారు.