Home Minister Anita: రెడ్‌బుక్ అమలు చేస్తే రోడ్డుపై తిరగలేరు
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:29 AM
రాష్ట్రంలో రెడ్‌బుక్ అమలుచేస్తే వైసీపీ నేతలెవ్వరూ రోడ్డుపై తిరగలేరని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.

హోంమంత్రి అనిత హెచ్చరికలు
అనంతపురం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెడ్‌బుక్ అమలుచేస్తే వైసీపీ నేతలెవ్వరూ రోడ్డుపై తిరగలేరని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తప్పు చేస్తే ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. అనంతపురం నగరంలోని పోలీసు శిక్షణ కళాశాలలో శనివారం నిర్వహించిన ఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆమె పాల్గొన్నారు. పరేడ్ పూర్తయిన తరువాత మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించబోదని, అలాగని తప్పు చేసినవారిని ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘ఎవరి స్ర్కిప్ట్ చదివినా... అనుభవించే రాజా అతనే కదా’ అని పోసానిని ఉద్దేశించి హోంమంత్రి వ్యాఖ్యానించారు. పోసాని మాటలను చూసి అయ్యో పాపం అనేవారిని ఒక్కరినైనా తీసుకురావాలని సవాలు చేశారు. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయని, మాజీ ఎమ్మెల్యే వంశీపై ఎన్ని కేసులున్నాయో అందరికీ తెలుసన్నారు. నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడతామంటే ఇది వైసీపీ ప్రభుత్వం కాదని, ఎన్డీయే ప్రభుత్వమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అనిత సూచించారు. కొన్ని కేసుల్లో నిందితులు దొరికినా... శిక్ష పడేందుకు చాలా రోజులు పడుతుందనే అపోహలో ఉన్నారని, ఆ ఆలోచనను పోగొట్టి, వారిలో భయం పుట్టేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేయాలని పోలీసులకు సూచించారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌ను వైసీపీ గోడలకు పరిమితం చేస్తే... తాము రూ.450 కోట్లతో పూర్వవైభవం తీసుకొస్తున్నామని చెప్పారు. అప్పా, గ్రేహౌండ్స్‌కు నిధులిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాగా, శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి చేరబోతున్న ఎస్‌ఐలు నిష్పక్షపాతంగా, నిజాయతీతో ప్రజలకు సేవలు అందించాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. శిక్షణలో నేర్చుకున్నది విధినిర్వహణలో పాటించాలని సూచించారు. కాగా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించాలని శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరబోతున్న ఎస్‌ఐలకు డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా పిలుపునిచ్చారు. పాసింగ్ అవుట్ పరేడ్‌లో చేసిన ప్రమాణానికి అనుగుణంగానే ఉద్యోగ విరమణ పొందే వరకూ పనిచేయాలని సూచించారు.