Share News

Jagan Argument : అయోమయం... జగన్‌‘వాదం’!

ABN , Publish Date - Mar 06 , 2025 | 03:22 AM

ఏం చెప్పాలనుకుంటారో... ఏం చెబుతారో తెలియదు! సీఎంగా ఉన్నప్పుడు ఒకటి చెప్పి... అధికారం పోగానే ఇంకోటి చెప్పి... చివరికి, తాను చెప్పింది తానే ఖండించుకుంటారు! అంతా... అయోమయం!

Jagan Argument : అయోమయం... జగన్‌‘వాదం’!
YS Jagan

  • సొంత ప్రెస్‌మీట్‌కూ.. అసెంబ్లీకీ పోలిక

  • నాడు బాబుకు విపక్ష హోదా తీసేస్తానని బెదిరింపు

  • నేడు.. తనకు ఆ హోదా ఎందుకివ్వరని ఆక్రోశం

  • తన వాదనను తానే ఖండించుకున్న జగన్‌

  • విపక్ష హోదాకూ.. సభలో టైంకు సంబంధమేదీ?

  • సభ్యుల సంఖ్యను బట్టి నిష్పత్తి ప్రకారం మైక్‌

  • ముందు వరుసలో సీటు ఇచ్చినా సభకు డుమ్మా

  • పార్టీని నడిపించడంలోనే గందరగోళం

  • వాయిదాల బాటలో జిల్లాల పర్యటనలు

  • (అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఏం చెప్పాలనుకుంటారో... ఏం చెబుతారో తెలియదు! సీఎంగా ఉన్నప్పుడు ఒకటి చెప్పి... అధికారం పోగానే ఇంకోటి చెప్పి... చివరికి, తాను చెప్పింది తానే ఖండించుకుంటారు! అంతా... అయోమయం! ఇదీ జగన్‌ ‘వాదం’! ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానని మంకుపట్టు పట్టిన ఆయన... తన వైఖరిని సమర్థించుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ‘ఐదుగురు ఎమ్మెల్యేలను లాక్కొంటే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా రాదు’ అని ముఖ్యమంత్రి హోదాలో జగనే నిండు సభలో ప్రకటించారు. అంటే... నిబంధనల ప్రకారం కనీసం 10 శాతం ఎమ్మెల్యేలుంటేనే ఆ హోదా దక్కుతుందని ఆయనే చెప్పారు. ఇప్పుడు 11 సీట్లకు పరిమితం కాగానే... సంఖ్యతో సంబంధంలేదు, విపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అని చెబుతున్నారు. బుధవారం ఇదే అంశంపై సుదీర్ఘ ప్రెస్‌మీట్‌ పెట్టారు. అదే ప్రెస్‌మీట్‌లో ‘చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చింది నేనే. అప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలను లాక్కోవాలని చెప్పినా, నేను వద్దన్నాను’ అని చెప్పడం గమనార్హం. అంటే... ఆయన ప్రతిపక్షనేత హోదాకు, సంఖ్యకు సంబంధం ఉన్నట్లే కదా!


‘సమయం’... సందర్భం!

ఎంపిక చేసుకున్న విలేకరుల సమావేశం ముగియగానే... ‘ఎంతసేపు మాట్లాడానబ్బా!’ అంటూ జగన్‌ ఒక వింత ప్రశ్న వేశారు. ‘చూశారా... ఇంత సమయం ఇస్తేకానీ అసెంబ్లీలో బడ్జెట్‌ గురించి మాట్లాడలేం’’ అంటూ వింత లాజిక్‌ బయటికి తీశారు. సొంత ఆఫీసులో, తాను సొంతంగా పెట్టుకున్న ప్రెస్‌మీట్‌కు, అసెంబ్లీలో ప్రసంగానికీ ముడిపెట్టడమే ఓ విచిత్రం! సభలో స్పీకర్‌ ఇచ్చే సమయానికీ, ప్రతిపక్ష నేత హోదాకూ సంబంధమే లేదు. ఆయా పార్టీలకు ఉన్న బలాన్నిబట్టి స్పీకర్‌ సమయాన్ని కేటాయిస్తారు. ఎవరికి ఎంత సమయమిచ్చేదీ సభలోనే ప్రకటిస్తారు. ‘ప్రతిపక్ష నేత హోదా’ ఉన్నప్పటికీ ఇదే వర్తిస్తుంది. కాకపోతే... ఈ హోదాతోపాటు ‘కేబినెట్‌ ర్యాంక్‌’ వస్తుంది. అంతేతప్ప, సభలో సీఎంతో సమానంగా మాట్లాడే అవకాశం మాత్రం రాదు. తమకు కేటాయించిన సమయం సరిపోలేదని భావిస్తే... స్పీకర్‌ను మరింత టైమ్‌ కోరవచ్చు. లేదా... సభలో చెప్పాల్సింది చెప్పి, మిగిలిన విషయం మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయవచ్చు. ఇన్ని మాటలు చెబుతున్న జగన్‌... చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా తనతో సమానంగా మాట్లాడే అవకాశమిచ్చారా? అన్నది అసలు ప్రశ్న. నిబంధనల ప్రకారం... బడ్జెట్‌పై చర్చను విపక్షాలు ప్రారంభించాలి. కానీ, 2022లో అధికారపక్షమైన వైసీపీకి స్పీకర్‌ అవకాశమిచ్చారు. అప్పటికి... కల్తీమద్యం మృతులపై టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తుండగా, ‘బడ్జెట్‌పై మీరెవరైనా మాట్లాడతారా?’ అని పైకి ఒక మాట అని, ఆ వెంటనే స్పీకర్‌ వైసీపీకి అవకాశమిచ్చారు.


సహచర సభ్యుల మాటేమిటి...

‘‘ప్రతిపక్షనేత హోదా ఇవ్వకపోతే 175 మంది శాసనసభ్యులలో నేనూ ఒకడిగా మిగిలిపోతా’ అని జగన్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన పదిమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఏమైపోయినా ఫర్వాలేదు, వాళ్లు మాట్లాడలేకపోయినా సరే, తనకు మాత్రం ‘హోదా’ కావాలి అన్నట్లుగా ఉందని అంటున్నారు. ఆయా అంశాలను సభలో లేవనెత్తి, వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేయడం సహజం. కానీ... తన తాడేపల్లి నివాసంలో ప్రెస్‌మీట్‌ పెట్టి, ‘దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి’ అని అడగడం చూసి విస్తుపోతున్నారు. జగన్‌కు అసెంబ్లీలో ముందువరుసలోనే సీటు కేటాయించారు. స్పీకర్‌కు కనిపించేంత, వినిపించేంత దూరంలో ఉన్నందున.. ఎప్పుడైనా తన చేతిని ఎత్తి, మైక్‌ కోరవచ్చు. ఇవ్వకపోతే... ‘నాకు అవకాశం ఇవ్వలేదు చూశారా’ అని ఆక్రోశించవచ్చు. దీనిని కూడా విస్మరించి... ‘నేను సభకు పోను. మిమ్మల్ని పోనివ్వను’ అంటూ పార్టీ ఎమ్మెల్యేలకూ అన్యాయం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

అన్నింటా అదే గజిబిజి...

అసెంబ్లీ జరుగుతున్నా వైఎస్‌ జగన్‌ అటువైపు వెళ్లడం లేదు. జిల్లాల పర్యటనలు చేసి ప్రజలను కలుస్తానని మూడునెలలుగా చెబుతున్నా.. అటుగా ఇప్పటివరకు మూడు అడుగులు కూడా పడలేదు. దీంతో వైసీపీ అధినేత తీరుపై ఆయన పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. సంక్రాంతి పోగానే లోక్‌సభ నియోజకర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశమవుతానని... రాత్రి బస చేస్తానని చెప్పారు. సంక్రాంతితోపాటు శివరాత్రి కూడా పోయింది. అయినా... జగన్‌ కాలు బయటపెట్టడంలేదు. జగన్‌ దంపతులు దాదాపు ప్రతి శుక్రవారం బెంగళూరు ప్యాలె్‌సకు వెళ్లి .. మళ్లీ మంగళవారం తాడేపల్లి ప్యాలె్‌సకు చేరుకుంటున్నారు. మధ్య మధ్యలో సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్తున్నారు. అప్పటి బిల్లుల బకాయిలపై కాంట్రాక్టర్ల నిలదీత బెడదతో... ఇటీవల పులివెందుల టూరూ తగ్గించేశారు.

Updated Date - Mar 06 , 2025 | 09:44 AM