Political Hypocrisy: బూతులు నీతులు!
ABN , Publish Date - Feb 28 , 2025 | 05:27 AM
ఒక్కసారి పాతరోజుల్లోకి వెళదాం! 2019లో అధికారంలోకి వచ్చీ రాగానే జగన్ ఏం చేశారో గుర్తుతెచ్చుకుందాం! పదవిలో కూర్చున్నది మొదలు... కక్ష సాధింపులు! తొలి ఆరు నెలల్లోనే...

సీఎంగా ఉండగా రాజ్యాంగానికి తూట్లు
అధికారం పోగానే ‘రెడ్‌బుక్’ అంటూ గగ్గోలు
జగన్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా వేధింపుల పర్వం
కోడెల బలవన్మరణానికి కారణమెవరు?
సోషల్ మీడియా పోస్టులపై దేశద్రోహం కేసులు
అర్ధరాత్రుళ్లు గోడలు, గేట్లు దూకి అరెస్టులు
వృద్ధులు, రోగులనూ బలవంతంగా లాక్కెళ్లడమే!
ఇప్పుడు పోసాని అరెస్టుపై వాపోతున్న వైసీపీ
కీలక కేసుల్లో ఇప్పటికీ చర్యలు లేవు
ముందస్తు బెయిళ్లతో బయటే నిందితులు
‘రెడ్‌బుక్ రాజ్యాంగం’.. జగన్ పదేపదే కలవరిస్తున్న పదం! తాను అధికారంలో ఉన్న ఐదేళ్లూ అన్ని రకాల హక్కులకూ పాతరేసి, నోరెత్తితే అరెస్టులు చేసి, ఫేస్‌బుక్‌లో పోస్టులు ఫార్వర్డ్ చేసినందుకే హింసించి, అర్ధరాత్రి గోడలు దూకి మరీ విపక్ష నేతలను అరెస్టు చేయించి, ఆపరేషన్లు చేయించుకున్న వాళ్లనూ ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు రహదారి మార్గంలో తీసుకెళ్లి నరకం చూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ అంటూ వాపోతున్నారు. తన ఐదేళ్ల హయాంలో చేసిన అరాచకాలన్నీ మరిచిపోయి... ‘మళ్లీ వస్తాం. అన్నీ నోట్ చేసుకుంటున్నాం. బట్టలూడదీసి నిలబెడతాం’ అని కూడా హెచ్చరిస్తున్నారు. అంటే... అధికారంలో ఉంటే అరాచకం రాజ్యమేలాలి! విపక్షంలో ఉంటే మాత్రం ధర్మం నాలుగు పాదాలా నడవాలి! ఇదీ... జగనిజం!
పోసాని బూతులు
బ్రోకర్, లోఫర్, సైకో, వెధవ, ల.. కొడకా, రాజకీయాలు వదిలేసి
ఏ చావైనా చావు.. మీ అమ్మను, భార్యను కూడా తిడతా..
- నటుడు, రచయిత
పోసాని నోటి వెంట జారిన బూతుల్లో కొన్ని
రోత పత్రిక సూక్తులు
పోసాని ఏనాడో చేసిన సాధారణ వ్యాఖ్యల ఆధారంగా కూటమి ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడింది. ఆయన అరెస్ట్ అక్రమం..
- జగన్ పత్రికలో పోసానికి మద్దతుగా వ్యాఖ్యలు
జగన్ నీతులు
దేవుడు అంతా చూస్తున్నాడు. ధైర్యంగా ఉండండి. మేం అందరం తోడుగా ఉంటాం. రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదు..
- పోసాని భార్యకు ఫోన్‌లో జగన్ భరోసా
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఒక్కసారి పాతరోజుల్లోకి వెళదాం! 2019లో అధికారంలోకి వచ్చీ రాగానే జగన్ ఏం చేశారో గుర్తుతెచ్చుకుందాం! పదవిలో కూర్చున్నది మొదలు... కక్ష సాధింపులు! తొలి ఆరు నెలల్లోనే... ఆత్మహత్య చేసుకునే స్థాయిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వేధింపులు! అధికారం అంతానికి వచ్చేసరికి... చంద్రబాబు అరెస్టు! మధ్యలో... ఎంత మందిపై తప్పుడు కేసులు పెట్టారో, ఎన్ని రకాలుగా వేధించారో లెక్కే లేదు! ఇప్పుడు అదే జగన్... అన్ని సాక్ష్యాలు, ఆధారాలు ఉన్న కేసుల్లో ఒకరిద్దరు అది కూడా ఓ మోస్తరు నాయకులను అరెస్టు చేయగానే ‘అన్యాయం, అక్రమం’ అని వాపోతున్నారు.
నిజానికి... వైసీపీ హయాంలో అరాచకాలకు సంబంధించి పెద్ద నాయకులపై చర్యలే తీసుకోలేదు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి సూత్రధారులుగా పోలీసులు నిర్ధారించిన జోగి రమేశ్, దేవినేని అవినాశ్‌లకు ముందస్తు బెయిలు లభించింది. వైసీపీ హయాంలోలాగా వారిని పోలీసులు అర్ధరాత్రి గోడలు, గేట్లు దూకి అరెస్టు చేసి ఉంటే... ఇలాంటి ఉపశమనం లభించేది కాదేమో! ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్టు చేసింది నియోజకవర్గ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కాదు! ఆ దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి, బెదిరించి ఫిర్యాదు వాపసు తీసుకునేలా చేశారనే ఈ అరెస్టు! దీనికి పోలీసులు అన్ని ఆధారాలను సమర్పించారు. సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా బూతులు ప్రయోగించిన వర్రా రవీందర్ రెడ్డి వంటి కొందరిపైనే ఇప్పుడు చర్యలు మొదలయ్యాయి. అసలు వాళ్లను వదిలేసి చోటామోటా వాళ్లను పట్టుకుంటున్నారేంటంటూ టీడీపీ శ్రేణులు ఆక్రోశిస్తున్నా... ప్రభుత్వం తొందరపడి కక్ష సాధింపులకు దిగడంలేదు. అయినా సరే... రెడ్ బుక్ రాజ్యాంగం అని జగన్, ఆయన రోత పత్రిక వాపోతుండటమే విచిత్రం! నంద్యాలలో మైనార్టీ కుటుంబం సామూహిక ఆత్మహత్య నుంచి కాకినాడలో దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం వరకూ... రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అరాచకాలు ఏ ‘రాజ్యాంగం’ ప్రకారం చెల్లుబాటు అయ్యాయో జగనే చెప్పాలి!
ఇదేమి ‘రాజ్యాంగం’?
విశాఖపట్నంలో విష వాయువులు లీకై పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయి, 450మంది అస్వస్థతకు గురైతే ఆవేదనతో తన స్నేహితురాలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ అనే 66 ఏళ్ల వృద్ధురాలు రీపోస్టు చేశారు. అందులో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన అక్షరం ఒక్కటీ లేదు. అయినా...ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారు. ఇదేమి రాజ్యాంగమో జగన్ చెప్పాలి కదా!
కరోనా సమయంలో మాస్కులు, గ్లౌజులు లేవన్న పాపానికి దళితుడైన వైద్యుడు సుధాకర్‌ను నడిరోడ్డుపై రెక్కలు విరిచి, చితకబాది చివరికి ఆయన్ను చావుదాకా తీసుకెళ్లారు.
గన్నవరం విమానాశ్రయంలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు బాగా కావాల్సిన మహిళ వద్ద పట్టుబడిన బంగారం ఒక కీలకమైన వ్యక్తికి చెందినదే అని సోషల్ మీడియాలో వచ్చిన వార్తను పంచుకున్న 75ఏళ్ల సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును అర్ధరాత్రి ఇంటికెళ్లి అరెస్టు చేశారు. ఆపరేషన్ చేయించుకున్నానని వేడుకున్నా వినకుండా లాక్కెళ్లారు.
జగన్ రెడ్డి పనితీరును ప్రశ్నించిన అప్పటి ఎంపీ రఘురామకృష్ణ రాజును ఆయన పుట్టిన రోజునే హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. కస్టడీలో ఆయనను తీవ్రంగా హింసించినట్లు నిర్ధారణ అయ్యింది.
ఆపరేషన్ చేయించుకుని, నిజంగా విశ్రాంతి అవసరమైన అచ్చెన్నాయుడును రాష్ట్రానికి ఆ చివర ఉన్న టెక్కలిలో అరెస్టు చేసి... రక్తమోడుతున్నా వదలకుండా వందల కిలోమీటర్ల దూరంలోని గుంటూరుకు రోడ్డు మార్గంలో తరలించారు.
‘నేను రేపు చంద్రబాబు ఇంటిపై దాడి చేయబోతున్నా’ అని ఒక రోజు ముందే సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన జోగి రమేశ్‌ను అడ్డుకున్న పోలీసులే లేరు!
పట్టపగలు డీజీపీ ఆఫీసు పక్కన టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై వందల మంది విధ్వంసం సృష్టిస్తే కనీసం ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు.
వీళ్లను వదిలేశారు కదా?
అత్యంత జుగుప్సాకర భాష వాడుతూ ప్రతిపక్ష నేతలను దూషిస్తూ వీడియోలు పోస్టు చేస్తూ.. జగన్‌ను కీర్తించే నటి శ్రీరెడ్డికి ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
వైసీపీ సర్కారు అడ్డగోలు నిర్ణయాలకు కోర్టుల్లో చుక్కెదురు అవుతుండటంతో... ‘హైకోర్టు న్యాయమూర్తులను కరోనా రోగుల వార్డులో వేయాలి’ అని సోషల్ మీడియాలో దూషించిన వాళ్లను, జడ్జిలను వ్యక్తిగతంగా తిట్టిన వాళ్లనూ జగన్ వదిలేశారు. సోషల్ మీడియాలో ఆ పోస్టులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేసినా దిక్కులేదు.
దేశవ్యాప్తంగా అనేక కేసుల్లో నిందితులకు సీబీఐ చుక్కలు చూపిస్తుండగా... వివేకా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే కడప జిల్లాలో పోలీసులు కేసులు పెట్టారు.
హైదరాబాద్‌లో కూర్చుని టీడీపీ, జనసేన నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకున్న సినీ దర్శకుడు ఆర్జీవీని జగన్ ‘ప్రత్యేక అతిథి’లా గౌరవించారు. ‘వ్యూహం’ సినిమాకు సర్కారు డబ్బు దోచిపెట్టారు.
పోసాని రైటు.. పట్టాభి రాంగా?
అప్పట్లో జగన్‌ను టీడీపీ నేత పట్టాభి అనకూడని మాటలు అన్నారంటూ ఆయన ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. మహిళలు, చిన్న పిల్లలను భయభ్రాంతులకు గురి చేశారు. కానీ... అప్పట్లోనే వైసీపీ నాయకుడిగా ఉన్న పోసాని కృష్ణ మురళి జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌ను మైకుల ముందే పచ్చిబూతులు తిట్టారు. పట్టాభి ఇంటిపై దాడిని ఎంచక్కా సమర్థించుకున్న జగన్... పోసానిని మాత్రం నిలువరించలేదు. పైగా... ‘పోసాని చేసినవి సాధారణ వ్యాఖ్యలు. ఆ మాత్రానికే కేసులు, అరెస్టా’ అని జగన్ పత్రిక వాపోవడం విశేషం.