Gudivada Amar Nath : బాబోయ్.. చలి!
ABN , Publish Date - Jan 21 , 2025 | 03:41 AM
‘‘మీకు తెలుసా!? ఈ సమయంలో దావోస్‌లో మైనస్ 5, మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. మూడువేలమంది దాకా ప్రతినిధులు ఉంటారు. అంత చలి ఉంటే స్నానం చేస్తామా?’’...

నాడు దావోస్‌కు దూరంగా జగన్
అదేమని అడిగితే వింత కబుర్లు
2014-19 మధ్య ఏటా దావోస్‌కు బాబు
జగన్ అధికారంలోకి రాగానే నిర్లక్ష్యం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘‘మీకు తెలుసా!? ఈ సమయంలో దావోస్‌లో మైనస్ 5, మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. మూడువేలమంది దాకా ప్రతినిధులు ఉంటారు. అంత చలి ఉంటే స్నానం చేస్తామా?’’... జగన్ హయాంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్‌నాథ్ పలుకులివి! ‘మీరు దావోస్ ఆర్థిక సదస్సులో ఎందుకు పాల్గొనడం లేదు’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేక... చంద్రబాబు ప్రతి ఏటా దావోస్‌కు వెళ్లినా చేసిందేమీ లేదని చెప్పాలనుకుని... ఇంకేదేదో చెప్పి ఇలా అభాసు పాలయ్యారు. దావోస్‌లో ప్రతియేటా ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. పెట్టుబడుల ఆకర్షణకు, ‘బ్రాండ్’ ప్రమోషన్‌కు ఇదో అద్భుతమైన వేదిక! ‘మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి’ అని ఒక్కో దేశానికి తిరగాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ సంస్థల అధిపతులు, వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులంతా దావోస్ ఆర్థిక సదస్సులో అందుబాటులో ఉంటారు. మన పారిశ్రామిక విధానాలను వివరించేందుకు అదో చక్కటి అవకాశం! అందుకే... పెట్టుబడుల వేటలో ఉన్న వారు ఈ సదస్సుకు తప్పనిసరిగా హాజరవుతారు.
చలికి భయపడి ఆగిపోతే...
దావోస్‌లో మామూలుగానే చలి ఎక్కువ! ఆర్థిక సదస్సు సమయంలో చలి ఇంకా ఎక్కువ. చలికి భయపడి ఆగిపోతే... ‘బ్రాండ్ ఏపీ’ని ప్రమోట్ చేసే చక్కటి అవకాశాన్ని కోల్పోయినట్లే! 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రమం తప్పకుండా దావోస్ పర్యటనకు వెళ్లారు. కొత్తగా ఏర్పడిన ‘నవ్యాంధ్ర’ను ప్రమోట్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒకేఒక సారి దావోస్ ఆర్థిక సదస్సుకు... అది కూడా అన్యమనస్కంగానే హాజరయ్యారు. ‘మీరు ఎందుకు దావోస్ వెళ్లడంలేదు’ అని ప్రశ్నిస్తే... ‘చంద్రబాబు వెళ్లి మాత్రం చేసిందేమిటి!’ అంటూ వింత ప్రశ్నలు! చలి గిలి అంటూ వింత కబుర్లు!
అదే ఆహార్యం...
ఈసారి 55వ ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌తో సహా తెలంగాణ .. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు హాజరయ్యారు. అక్కడ... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తదితరులతో చంద్రబాబు దిగిన గ్రూప్ ఫొటో ఒకటి విడుదలైంది. అందులో... యువకుడైన లోకేశ్‌తోపాటు మిగిలిన వాళ్లంతా చలిని తట్టుకునేందుకు వీలుగా బలమైన జాకెట్లు, చేతులకు గ్లౌజులు వేసుకున్నారు. 74 ఏళ్ల వయసున్న చంద్రబాబు మాత్రం ఏపీలో ఎప్పుడూ ఎలా కనిపిస్తారో దావోస్‌లోనూ అదే ఆహార్యంతో కనిపించారు. చలికి వణకకుండా, తొణకకుండా తొలిరోజు నుంచే సదస్సులు, సమావేశాల్లో పాల్గొన్నారు. ‘బ్రాండ్ ఏపీ’ని ప్రమోట్ చేయడంపై దృష్టి సారించారు.