Nadu-Nedu Scheme: ‘నాడు-నేడు’.. ఫలితం మోడు!
ABN , Publish Date - Jan 29 , 2025 | 04:10 AM
ప్రభుత్వ బడుల్లో కనీస సౌకర్యాలను కూడా కల్పించలేదన్న విషయం జగన్ హయాంలో తేలిపోయింది.

జగన్ హయాంలో పాఠశాలల బాగు ఉత్తుత్తే
వైసీపీ పాలనలో విద్యా ప్రమాణాలు హుళక్కే
అక్షరాలు, అంకెలూ గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు
పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు శాతం
మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలూ కరువే
2018లో మెరుగ్గా ప్రమాణాలు.. 2024 నాటికి క్షీణత
జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికలో వెల్లడి
ఐదో తరగతి చదువుతూ రెండో తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన వాళ్లు 2018లో 57.1 శాతం ఉండగా, 2022లో 37.9 శాతం, 2024లో 37.5 శాతానికి తగ్గారు.
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో ‘నాడు-నేడు’ పేరిట ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేశామని, ఇంగ్లిష్ మీడియంతో విద్యాప్రమాణాలను మెరుగుపరిచి సర్కారీ స్కూళ్లను ఉద్ధరించేశామని చేసిన ఆర్భాటం హుళక్కేనని తేలిపోయింది. రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించినట్టు లెక్కలు చెప్పినా.. ప్రభుత్వ బడుల్లో కనీస సౌకర్యాలను కూడా కల్పించలేదన్న విషయం తేటతెల్లమైంది. విద్యార్థులకు మెరుగైన బోధన అంటూ.. ఐబీ, సీబీఎస్‌ఈ పాఠ్యాంశాలను ప్రవేశ పెట్టామంటూ చేసిన ప్రకటనల్లోనూ పసలేదని స్పష్టమైంది. గత ఐదేళ్లలో విద్యాప్రమాణాలు నానాటికీ తీసికట్టుగా మారాయని, విద్యార్థులు కనీసం అంకెలు, అక్షరాలను కూడా గుర్తించ లేనిస్థితికి దిగజారారని జాతీయ సర్వే సంస్థ ‘అసర్’ కుండబద్దలు కొట్టింది. తాజాగా విడుదల చేసిన అసర్ నివేదికలో జగన్ హయాంలో చేపట్టిన నాడు-నేడు ఫలితం ఒట్టి మోడేనని తేలిపోయింది. అసర్ నివేదికలో 2018, 2022, 2024 సంవత్సరాల్లో విద్యాప్రమాణాలు, పాఠశాలల్లో సౌకర్యాల గురించి వివరణాత్మకంగా పేర్కొంది. 2018లో మెరుగ్గా ఉన్న అనేక ప్రమాణాలు.. 2024నాటికి క్షీణించాయని వివరించింది. ముఖ్యంగా 6-14 ఏళ్ల పిల్లల హాజరు శాతం తగ్గిందని, పాఠశాలల్లో కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, తాగునీటి వసతి కూడా లేకుండా పోయాయని వెల్లడించింది.
జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికలోని ముఖ్యాంశాలు
6-14 ఏళ్ల చిన్నారుల హాజరుశాతం 2018లో 63.2 ఉండగా 2024లో 61.8 శాతానికి తగ్గింది.
ప్రభుత్వ స్కూళ్లలో మూడో తరగతిలో ఉండి రెండో తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన విద్యార్థులు 2018లో 22.6 శాతం ఉండగా, 2022లో 10.5 శాతం, 2024లో 14.7 శాతానికి తగ్గారు.
మూడో తరగతి చదువుతూ కనీసం తీసివేతలు చేయడం వచ్చిన విద్యార్థులు 2018లో 34.1 శాతం ఉండగా, 2022లో 29.2 శాతానికి తగ్గారు.
ఐదో తరగతి చదువుతూ రెండో తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన వాళ్లు 2018లో 57.1 శాతం ఉండగా, 2022లో 37.9 శాతం, 2024లో 37.5 శాతానికి తగ్గారు. ఐదో తరగతి చదువుతూ భాగహారాలు చేయడం వచ్చిన విద్యార్థులు 2018లో 36.7 శాతం ఉండగా, 2022లో 27.3 శాతం, 2024లో 35.1 శాతానికి తగ్గారు.
ఎనిమిదో తరగతి చదువుతూ రెండో తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన వారు 2018లో 78.6 శాతం ఉండగా, 2024లో 53 శాతానికి తగ్గారు.
తాగునీటి సౌకర్యం ఉన్న ప్రభుత్వ స్కూళ్లు 2018లో 58.1 శాతం ఉండగా, 2024 నాటికి 55.9 శాతానికి తగ్గాయి. మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న స్కూళ్లు 2018లో 86.4 శాతం ఉండగా, 2024లో 78.4 శాతానికి తగ్గాయి.బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్న స్కూళ్లు 2018లో 81.1 శాతం ఉండగా, 2024లో 77.2 శాతానికి తగ్గాయి.
పాఠశాలల్లో ఆఫీసులు, స్టోర్ రూం సౌకర్యాలు 2018లో 58.6 శాతం ఉండగా, 2024లో 51.4 శాతానికి తగ్గాయి. లైబ్రరీలో పుస్తకాలు అందుబాటులో ఉన్న స్కూళ్లు 2018లో 91 శాతం ఉండగా, 2024లో 83.8 శాతంగా ఉంది.
2018లో కంప్యూటర్లు అందుబాటులో ఉన్న స్కూళ్లు 22.6 శాతం ఉండగా, 2024 నాటికి 19.2 శాతానికి తగ్గాయి. 2024లో 6-14 ఏళ్ల వారు ప్రభుత్వ స్కూళ్లలో 61.8 శాతం, ప్రైవేట్ స్కూళ్లలో 37.9 శాతం చేరారు.
1-5, 6-8 తరగతి ఎన్‌రోల్‌మెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గింది. 2018లో 1-5 తరగతి అబ్బాయిలు 55.4 శాతం, అమ్మాయిలు 63.4 శాతం ఎన్‌రోల్ అవ్వగా, 2024లో అబ్బాయిలు 54.5 శాతానికి, అమ్మాయిలు 62.2 శాతానికి తగ్గిపోయారు.
6-8వ తరగతి పిల్లల ఎన్‌రోల్‌మెంట్ కూడా 2018తో పోలిస్తే 2024 నాటికి తగ్గిపోయింది. ఈ విభాగంలో 2018లో అబ్బాయిలు 68.7 శాతం, అమ్మాయిలు 70.2 శాతం ఎన్‌రోల్ అయ్యారు. 2024 నాటికి అబ్బాయిల శాతం 64.1 శాతానికి, అమ్మాయిల శాతం 67.1 శాతానికి తగ్గిపోయింది.
2024లో అన్ని పాఠశాలలను పరిశీలిస్తే 7, 8 తరగతులు చదివే పిల్లలు కనీసం అక్షరం కూడా చదవలేని స్థితిలో 2.2 శాతం మంది, అక్షరాలు చదవగలిగిన వాళ్లు 6.2 శాతం మంది ఉన్నారు. పదాలు చదవగలిగిన వాళ్లు ఏడో తరగతిలో 12.5 శాతం మంది, ఎనిమిదో తరగతిలో 10.7 శాతం మంది ఉన్నారు. ఈ తరగతుల్లో ఉన్న పిల్లల్లో ఒకటో తరగతి, రెండో తరగతి పాఠ్యపుస్తకాలు చదవగలిగిన వాళ్లు 50 శాతం ఉన్నారు.
14 ఏళ్ల వయసు గల వారిలో 69.7 శాతం పిల్లలు డిజిటల్ టాస్కులు చేస్తుంటే, 86.8 శాతం మంది స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నారు.
2024లో 3వ తరగతి చదువుతున్న పిల్లల్లో 3.2 శాతం మంది కనీసం అంకెలను కూడా గుర్తించలేకపోయారు. ఆరో తరగతి చదువుతూ అంకెలను గుర్తించలేని పిల్లలు 2.6 శాతం మంది ఉన్నారు. 2024లో ఐదో తరగతి చదువుతూ భాగహారం చేయలేని పిల్లలు 22.6 శాతం మంది, ఎనిమిదో తరగతి చదువుతూ భాగహారం చేయలేని విద్యార్థులు 42.8 శాతం మంది ఉన్నారు.
For AndhraPradesh News And Telugu News