Share News

TDP vs YSRCP: వైసీపీకి టీడీపీ సరికొత్త సవాల్ టార్గెట్ అదేనా

ABN , Publish Date - Mar 24 , 2025 | 09:00 AM

జగన్ అడ్డాలో పాగా వేసేందుకు టీడీపీ పావులు కదుపుతోందా. కడప అసెంబ్లీలో గెలుపు తర్వాత టీడీపీ పులివెందులను టార్గెట్ చేసిందా.. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించడమే లక్ష్యమా.. టీడీపీ మహానాడు పులివెందులలో పెట్టడం ద్వారా ఎలాంటి టీడీపీ వైసీపీకి ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుంది.

TDP vs YSRCP: వైసీపీకి టీడీపీ సరికొత్త సవాల్ టార్గెట్ అదేనా
YS Jagan

ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరనడానికి 2019, 2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ. 2019లో వైసీపీ 151 సీట్లు సాధించగా..2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఈ రెండు ఫలితాలు ప్రజా తీర్పును ప్రతిబింబిస్తున్నాయి.


2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీని బలహీనపర్చాలని తీవ్రంగా ప్రయత్నించింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో క్యాడర్ బలంగా ఉన్న పార్టీ కావడంతో వైసీపీ ప్రయత్నాలు ఫలించలేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీని బలహీనపర్చడంతో పాటు 2024 ఎన్నికల్లో చంద్రబాబును అక్కడి నుంచి ఓడించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుని పనిచేసింది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు మరోసారి భారీ మెజార్టీతో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నిక ఫలితాలను ఆధారంగా చేసుకుంటే ప్రజలు వైసీపీ పాలనపై విసుగు చెందారని స్పష్టమవుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూడా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో జగన్‌తో పాటు వైసీపీ నాయకులు సైతం కుప్పంలో టీడీపీని ఖాళీచేస్తామని బహిరంగంగానే ప్రచారం చేశారు. టీడీపీ మాత్ర ఎలాంటి ప్రచారం, హడావుడి లేకుండా సైలెంట్‌గా తమ పని కానిచ్చేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ సరికొత్త సవాల్‌ను వైసీపీ ఎంత మేరకు తట్టుకుంటుందనేది అసలు సిసలు ప్రశ్న.


పులివెందులలో మహానాడు

తెలుగుదేశం పార్టీ మే నెలలో పులివెందుల వేదికగా నిర్వహించే మహానాడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఆసక్తికరంగా మార్చనుందనే చర్చ జరుగుతోంది. జగన్ సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఒక సవాల్‌గా భావిస్తున్నారు. పులివెందులలో మహానాడు నిర్వహణ ద్వారా టీడీపీ సత్తా ఏమిటో తెలియజేయడమే ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తల్లో ఉత్సహాన్ని నింపడంతో పాటు ప్రత్యర్థి పార్టీ వైసీపీకి బలమైన రాజకీయ సంకేతాలను పంపుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మహానాడు వేదికగా పార్టీ భవిష్యత్తు ప్రణాళికతో పాటు 2047 నాటికి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించడంతో పాటు టీడీపీ ప్రభుత్వం యొక్క అవసరాన్ని వివరించడమే లక్ష్యంగా మహానాడు నిర్వహించే అవకావం ఉన్నట్లు తెలుస్తోంది.


అభివృద్ధి లక్ష్యంగా

చంద్రబాబు నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేశారు. రైతల సాగునీటి సమస్యలను పరిష్కరించుందుకు చర్యలు ప్రారంభించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్ ఎన్నో విమర్శలు చేస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఓవైపు రాష్ట్ర అభివృద్ధితో పాటు రాయలసీమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి మాజీ సీఎం జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడపలో పట్టు సాధించే దిశగా టీడీపీ అడుగులు వేస్తున్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. టీడీపీ రాజకీయ సవాళ్లను వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

టెక్‌ వ్యూ : కన్సాలిడేషన్‌కు ఆస్కారం

ఫార్మా కింగ్‌ దివీస్‌ మురళి

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 24 , 2025 | 09:24 AM