Share News

AP Assembly: జగన్ పత్రికలో అవాస్తవాలపై స్పీకర్ సీరియస్

ABN , Publish Date - Feb 25 , 2025 | 09:40 AM

AP Assembly: సాక్షి మీడియాపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల శిక్షణ తరగతులపై సాక్షి పత్రికలో వచ్చిన అసత్య కథనాలపై చర్యలకు ఆదేశించారు స్పీకర్.

AP Assembly: జగన్ పత్రికలో అవాస్తవాలపై స్పీకర్ సీరియస్
AP Assembly budget Session

అమరావతి, ఫిబ్రవరి 25: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session) మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల శిక్షణా తరగతులపై సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. సభా హక్కుల కమిటీకి సాక్షి కథనాలను స్పీకర్ రిఫర్ చేశారు. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు జరగకుండా కోట్లాది రూపాయలు వెచ్చించారంటూ సాక్షి కథనాలను నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య (MLA Jayasurya) సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేల శిక్షణ తరగుతులు ఇచ్చే కార్యక్రమానికి కోట్లు ఖర్చు పెట్టారంటూ ఇటీవల సాక్షి పత్రికలో లోక్‌సభ స్పీకర్, ఏపీ స్పీకర్‌పై కథనాలు వచ్చాయని.. ఇది చాలా బాధాకరమన్నారు. అయితే శిక్షణా తరగతులు జరగకముందే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని తప్పుడు నివేదికలు రాశారని మండిపడ్డారు.


ప్రజాస్వామ్యంలో సభలపై ఉన్న గౌరవాన్ని అగౌరవపరుస్తూ రాతలు రాస్తూ జగన్ పత్రిక అవలభిస్తున్న విధానాలు చాలా బాధాకరమన్నారు. తప్పని సరిగా సాక్షి ఛానల్, పత్రికపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీలో పెట్టి సాక్షి ఛానల్, పత్రికపై తగు చర్యలు తీసుకోవాలని.. మరోసారి ఇలాంటి వార్తలు రాయకుండా చూడాలని స్పీకర్ ఎమ్మెల్యే జయసూర్య కోరారు.


దీనిపై స్పీకర్ మాట్లాడుతూ.. శిక్షణ తరగతులు లేకుండా కోట్లాది రూపాయలు దుర్వినియోగం అంటూ వచ్చిన కథనాలు తనను బాధించాయన్నారు. ఇలాంటి అసత్య కథనాలు ఉపేక్షించరాదని తెలిపారు. సభ్యుల కోరిక మేరకు సాక్షి అసత్య కథనాలపై చర్యలకు సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేస్తున్నట్లు వెల్లడించారు. సభా హక్కుల కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.


ఇది మంచి పద్దతి కాదు.. వైసీపీపై స్పీకర్

అలాగే.. నిన్న (సోమవారం) గవర్నర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ప్రవర్తించిన తీరుపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి సంఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా వైసీపీ వ్యవహరించిందన్నారు.. సీఎంగా పనిచేసిన వ్యక్తి, పార్టీకి అధినేత వ్యక్తి సభ్యత మరిచి ప్రవర్తించారని అన్నారు. పార్టీ సభ్యులు గందరగోళం చేస్తుంటే చూస్తూ నవ్వుతూ కూర్చున్నారే తప్ప వారిని ఆపే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచేలా ప్లేకార్డ్స్‌ పట్టుకొచ్చారని.. పోడియంపై విసిరేశారని అన్నారు. ఇది ఏం సంప్రదాయమని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదన్నారు. సీనియర్ సభ్యులు బొత్స సత్యనారాయణ కూడా జగన్‌ చేసేది తప్పని చెప్పకపోవడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగటానికి వీల్లేదని అన్నారు. ఇకపై అయినా విజ్ఞతతో వ్యవహరించాలని హితవుపలికారు. రాజ్యాంగం ద్వారా కాకుండా సర్వ హక్కులు తనకే ఉన్నాయ్ అన్నట్లు ప్రవర్తించటం ఎవరికీ తగదని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే చర్చలో పాల్గొనాలే తప్ప ఇలాంటి చర్యలు సరికాదన్నారు. నిన్నటి వైసీపీ తీరును ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

మోసం చేస్తూనే ఉంటా.. జగన్ కొత్త నినాదం..!

ఎండకాలంలో హ్యాపీ లైఫ్ కోసం అద్భుత చిట్కాలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 25 , 2025 | 10:54 AM